• facebook
  • whatsapp
  • telegram

కూడ గ‌డితే... సాయ‌ప‌డితే...

ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ ఉన్నవారికి  కంపెనీలు తమ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఏమిటివి? వీటినెలా పెంపొందించుకోవచ్చు? 

సుప్రసిద్ధ బహుళ జాతి సంస్థ తాజాగా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటోంది. రెండు వారాల నుంచి దేశవ్యాప్తంగా జూమ్‌లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఎక్కువమంది రెజ్యూమేల్లో  ‘స్ట్రాంగ్‌ ఇన్‌ ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌’ అని ఉండటంతో సహజంగానే హెచ్‌.ఆర్‌. ఇంటర్వ్యూల్లో దానిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అభ్యర్థులు రకరకాలుగా సమాధానాలు ఇస్తున్నారు. వైజాగ్‌ నుంచి ఇంటర్వ్యూకు హాజరైన అమిత్‌ తనకీ ప్రశ్న ఎదురయినప్పుడు దీనిపై తనకంతగా తెలియకపోయినా ఒకటి-రెండు సంఘటనలు క్లుప్తంగా చెప్పాడు.   

* కాలేజీలో ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తూ నగరంలోని ప్రముఖ కంపెనీల నుంచి స్పాన్సర్‌షిప్‌ తీసుకురమ్మని యాజమాన్యం విద్యార్థులకు సూచించింది. అమిత్‌ ముందుకొచ్చి ఎనిమిదిమంది స్నేహితులతో బృందాన్ని ఏర్పరచుకున్నాడు. తన సీనియర్‌ ప్రొఫెసర్‌ మార్గదర్శకత్వంలో ఆరు కంపెనీల స్పాన్సర్‌షిప్‌ సాధించాడు.  

* కొవిడ్‌ వచ్చిన కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేని తన క్లాస్‌మేట్‌ పరిస్థితిని కాలేజీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లాడు. అనుమతిని మంజూరు చేయించాడు.  

వీటిని ఉదాహరించగానే హెచ్‌.ఆర్‌. సీనియర్‌ మేనేజర్‌ అతనిలోని ఇంటర్‌పర్సనల్‌ నైపుణ్యాలను గుర్తించారు. మొదటి సంఘటన- తన తోటివారిని కూడగట్టడం. వారితో కలిసి లక్ష్య సాధనకు పనిచేయడం. రెండోది- తనతోపాటు ఉండేవారిపై నిజమైన ఆసక్తి చూపి అవసరమైనప్పుడు వారికి సహాయపడటం. ఈ రెండూ ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌లో భాగమనీ, ఇలాంటి లక్షణాలున్నవారి వల్ల కంపెనీకి ఎంతో ఉపయోగమనీ గ్రహించిన హెచ్‌.ఆర్‌. అధికారి అమిత్‌ ‘హైరింగ్‌’ (ఎంపిక)కు పచ్చజెండా ఊపారు.  

ఏమిటీ నైపుణ్యాలు?   

ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్‌ అంటే పరస్పర సంబంధ నైపుణ్యం. ఇతరులతో శక్తిమంతమైన భావ వ్యక్తీకరణ వారధిని ఏర్పరచుకొని ఒక మానసిక బంధాన్ని ఏర్చరచుకోగల నైపుణ్యం. ఉద్యోగుల మధ్య అర్థవంతమైన సంబంధాలు తప్పకుండా ఏర్పడటం- కొనసాగడం కంపెనీలకు అవసరం. దీని దృష్టా ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ - పరస్పర సంబంధ సామర్థ్యానికి ప్రాధాన్యం పెరిగింది.  

పరిగణించే అంశాలు..  

పరస్పర సంబంధాలంటే కేవలం తోటివారితో ఏర్పడే పరిచయాలే దీని కిందకు రావు.  

* స్వీయ అవగాహన: తను, తన ఇష్టాయిష్టాలతో పాటు ఇతరుల ఇష్టాయిష్టాలూ ఉద్వేగాలను గుర్తించగలగడం.  

* ఇతరులపట్ల ఆసక్తి: తోటివారిపట్ల నిజమైన శ్రద్ధ, వారి కష్టసుఖాలను పంచుకునే అనుబంధం.  

* సహచరులతో కలిసిమెలిసి పనిచేయదం: సహోద్యోగులతో అరమరికలు లేకుండా కలిసి పనిచేయడం. అవసరమైతే నలుగురినీ ముందుండి నడిపించగలగడం.  

* స్పష్టమైన భావవ్యక్తీకరణ: తోటివారితో పటిష్ఠంగా భావ వ్యక్తీకరణ చేయడం. ఎప్పుడైనా అవాంతరం ఏర్పడిందనిపించినప్పుడు చొరవ తీసుకొని సరిచేయడం.  

* స్పర్థ్ధల నివారణ: అందరితో కలిసిమెలిసి పనిచేస్తున్నప్పుడు చిన్నచిన్న పొరపొచ్చాలను అధిగమించగలగడం. ఇందుకోసం కల్మషం లేకుండా చొరవ చూపడం.  

ఈ లక్షణాలను చూపగలిగినప్పుడు పరస్పర సంబంధాల నైపుణ్యం ఉన్నట్టుగా పరిగణిస్తారు.  

వీరే మనకు సాక్ష్యాలు  

ప్రముఖ స్థానాలకు చేరిన వారంతా పటిష్ఠమైన పరస్పర సంబంధాలు ఏర్పరచుకోవడంలో దిట్టలే. అసలు వీరు వాటిని దాటి మానవ సంబంధాల్లోనే (హ్యూమన్‌ రిలేషన్స్‌) ఉత్తములుగా పేరు తెచ్చుకుంటుంటారు.  

* అబ్దుల్‌ కలాం: తోటి మనిషిపై శ్రద్ధాసక్తులు చూపడంలో మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను మించినవారు లేరు. ఆయన దృష్టిలో చిన్నాపెద్దా అంటూ ఎవరూ లేరు. అందరినీ సమదృష్టితో చూడటం కలాం ప్రత్యేకత.  

* రతన్‌ టాటా: ఇండియన్‌ ఏర్‌లైన్స్‌... తమ ప్రయాణికుల్లో ఉత్తములైనవారికి ‘అవర్‌ బెస్ట్‌ గెస్ట్‌’ అవార్డును ఇవ్వదలచి ఎంపిక విషయంలో అన్ని ఫ్లైట్లలోని కేబిన్‌ క్రూ అభిప్రాయం తీసుకుంది. అందరూ ఏకగ్రీవంగా రతన్‌టాటాకు అవార్డును ఇవ్వమని చెప్పారు. ఆయన తమనెంతో గౌరవంగా చూస్తారనీ, చిరునవ్వుతో పలుకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటారనీ సిబ్బంది వ్యక్తం చేసిన అభిప్రాయాలతో రతన్‌ నెరపే పరస్పర సంబంధాల పరిమళాలు మనల్ని తాకుతాయి.  

పెంపొందించుకునేది ఎలా?  

పరస్పర సంబంధాల నైపుణ్యం మనం ఏర్పరచుకోగలిగే సామర్థ్యమే. ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.  

* సానుకూల దృక్పథం: పరస్పర సంబంధాలకు పునాది మనలోని సానుకూల దృక్పథమే. తోటివారిపట్ల సదభిప్రాయం, గౌరవం ఏర్పరచుకోవడం ద్వారా పరస్పర సంబంధాలకు బీజం పడుతుంది.  

* ఉద్వేగాలపై నియంత్రణ: కోపం, అసహనం, అనుమానం లాంటి ప్రతికూల ఉద్వేగాలకు అడ్డుకట్ట వేయాలి. ఇవి ఇతరులతో మనకున్న సంబంధాలను తెంచేసేవే తప్ప పటిష్ఠపరిచేవి కావు. వీటిని ఎప్పటికప్పుడు నియంత్రించుకునేందుకు సాధన చేయాలి.  

* తోటివారిలో ప్రతిభకు ప్రోత్సాహం: పరస్పర సంబంధాలకు అంకురార్పణ తోటివారిలోని ప్రతిభను తెలుసుకున్నప్పుడే జరుగుతుంది. పని వాతావరణంలో మంచి పనితీరు చూపించిన వారిని ప్రశంసించడం వల్ల వారిలో సదభిప్రాయం ఏర్పడుతుంది.  

* కలిసి పనిచేసేవారిపై శ్రద్ధాసక్తులు: పని సంస్కృతిలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వారు చేసే పనిపట్ల మాత్రమే కాక వారి కష్టసుఖాలపై ఆసక్తి చూపడం ద్వారా పరస్పర సంబంధాలకు మార్గం ఏర్పడుతుంది.  

* ప్రతివారిలో ఓ మంచి లక్షణం: ప్రతివారిలో తప్పులెన్నడం వల్ల సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. అదే తోటివారిలో ఉండే ఏదైనా ఒక మంచి వ్యక్తిత్వ లక్షణం, సుగుణాల సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని తరచూ అభినందించడం ద్వారా వారితో విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది! 

Posted Date: 10-05-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం