• facebook
  • whatsapp
  • telegram

లక్ష్య సాధనకు దివిటీ!

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

మన జీవితాల్లో అంతర్భాగమైన గూగుల్, ఫేస్‌బుక్,  అమెజాన్‌ల సృష్టి ఏవిధంగా జరిగింది? మన ఓయో, మేక్‌ మై ట్రిప్, ఓలాల ప్రయాణం ఎలా మొదలైంది? మనకోసం భారత్‌ బయోటెక్, ఫైజర్, ఆక్స్‌ఫర్డ్‌లు రికార్డు సమయంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ చేయగలగడం వెనుక ఉన్న శక్తి ఏమిటి?

వీటన్నింటి వెనుక ఉన్నది... ఈ భూతలంపై ఏ ఘనకార్యం జరిగినా అందుకు మూలకారణంగా నిలుస్తున్నది ఒకటుంది. అది లేని జీవన గమనాన్నీ, నూతన సృష్టినీ మనం ఊహించలేం. అది కెరియర్‌ కావచ్చు లేదా మరొక రంగం కావచ్చు. ప్రస్థానం నిస్తేజంగా సాగుతుంది. అవరోధాలు ఎదురైతే ఎక్కడికక్కడే ఆగిపోతుంది. 

అదే...ప్రేరణ!  జీవన నైపుణ్యాల్లో ఒకటిగా అత్యంత ముఖ్యమైనదిగా భాసిల్లుతోంది. 

ప్రేరణ అంటే...

ప్రేరణకు ఆంగ్ల పదమైన ‘మోటివేషన్‌’లో ‘మువ్‌’ అనే అక్షరాలున్నాయి. అంటే ‘కదులు ముందుకు’ అని అర్థం. మోటివేషన్‌ అంటే కదలిక అన్నమాట. ఈ కదలిక, చైతన్యం... ప్రగతి కోసం, వికాసం కోసం. కెరియర్‌లోనో లేదా మరేదైనా జీవన రంగంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు...ఒక గమ్యాన్ని చేరాలన్న సంకల్పం వహించినప్పుడు ముందుకు కదిలించేదే మోటివేషన్‌. దీని ద్వారానే అనేక అద్భుతాలు జరుగుతున్నందువల్ల లైఫ్‌ స్కిల్స్‌లో మోటివేషన్‌ ఒక భాగమైంది. 

ఎలా జనిస్తుంది?

ప్రేరణ ఒక అంతర్గత మానసిక ప్రక్రియ. మనఃపథంలో రూపుదిద్దుకునే ఒక వృత్తం. ఈ నిరంతర ప్రక్రియలో నాలుగు దశలు ఉన్నాయి.

మనసుకు నచ్చిన లేదా బాగా అవసరమైన ఒక విషయం రేఖామాత్రంగా మెదడులో కదులుతుంది. అది అలాగే మనసులో కొంత సమయం తారాడుతుంది. 

రెండో దశలో అప్పటివరకు లీలామాత్రంగా ఉన్న విషయంపై స్పష్టత ఏర్పడుతుంది. లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. 

మెదడు, మనసు దీనిపై పదేపదే ఆలోచించడం వల్ల దాన్ని సాధించాలన్న ఉత్సాహం నరనరాల్లో నిండుతుంది. 

ఇది కదలికగా మారి, కార్యాచరణకు ఉద్యుక్తుల్ని చేస్తుంది. లక్ష్య సాధనకు సమాయత్తం చేస్తుంది. 

ఇదే మోటివేషన్‌. అయితే ఈ ప్రేరణ ఎలా వస్తుంది? ఇందుకు కారణం ఏమిటి? ఎన్నో గొప్ప విషయాలు సాధించిన ఘనాపాటీలకు ప్రేరణ ఏమిటి? ధనమా? కీర్తా? అధికారమా? ఏది ప్రేరణకు హేతువు అంటే...దానికి ఒకే జవాబు రాదు. 

ఎలా అలవర్చుకోవాలి? 

ప్రపంచంలో ఏ విజయాలు సిద్ధించినా దానికి మూలకారణం ప్రేరణే కాబట్టి దీన్ని ఎలా అలవర్చుకోవాలో చూద్దాం.

ఏది కారణం: మోటివేషన్‌ కారణం ఎవరికి వారికి వేర్వేరుగా ఉంటున్నందువల్ల కెరియర్లో ప్రవేశించాలనుకునేవారు తమకు ప్రేరణ కలిగించేదేమిటో గుర్తించాలి. మంచి ఉద్యోగం, మంచి కంపెనీ, మంచి వేతన ప్యాకేజీ, మంచి జీవన శైలి.. ఇలా ఏది అంతర్గత ప్రోత్సాహం కలిగిస్తుందో స్పష్టంగా గుర్తించాలి. ఇతర రంగాల్లోనివారు తమకు గతంలో ప్రేరణగా నిలిచిన అంశమేమిటో తెలుసుకోవడం మొదటి మెట్టు.

సమీపంలో..: తమకు ఏది ప్రేరణ కలిగిస్తుందో దాన్ని దగ్గరగా ఉంచుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఆ విజయాన్ని సాధించినవారు రోల్‌ మోడల్‌గా ఉంటే వారి ఫొటోలను స్టడీ టేబుల్‌పై పెట్టుకోవచ్చు. లేదా వారు చెప్పిన గొప్ప వాక్యాల పోస్టర్లు రోజూ కనిపించేటట్టు ఉంచుకోవాలి. లేదా ఓ పుస్తకమో, ఓ పాటో, ఓ వీడియోనో... ఏదైనా అందుబాటులో ఉంచుకుని సమయం దొరికినప్పుడు వీక్షించాలి. 

కార్యాచరణ కీలకం: లక్ష్య సాధనే ప్రేరణ ప్రధాన ఉద్దేశం. అందుకు ప్రేరణను ఆధారంగా చేసుకుని ఉత్సాహం ఇంధనంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇది లిఖిత రూపకంగా ఉంటే ఉత్తమం. దీన్ని స్వల్పకాలంగా, దీర్ఘకాలంగా విభజించుకోవడం వల్ల సాధ]న సులభమవుతుంది.  

నిరంతరం: ప్రేరణ ఒక్కరోజుతో పోయేది కాదు. విజయాలకూ, లక్ష్య సాధనకూ హద్దు ఉండదు. అందుకే ప్రేరణను ఎప్పుడూ నిలుపుకోవాలి. నిరంతర ప్రేరణ ఉండేలా ఆలోచనా సరళి ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా ప్రేరణ కోల్పోతే, వాహనంలో ఇంధనం నింపుకున్న మాదిరిగా స్ఫూర్తి పొందే ప్రయత్నం చేయాలి. లక్ష్య సాధనకు ప్రేరణే దివిటీ! 

నిరాశాపూరితంగా, నిస్తేజంగా జీవితం గడపడం వ్యర్థం. సదాశయంతో, సత్సంకల్పంతో, ఆశావహ జీవితమే లక్ష్యం కావాలి. అందుకు ప్రేరణే పరమౌషధం. 

ఈ ప్రముఖులకు ప్రేరణ ఏమిటి?

స్టీవ్‌జాబ్స్‌: యాపిల్‌ ఫోన్‌ చూడగానే కోలమొఖం, మాసిన గడ్డం లాంటి రూపం కళ్లముందు కదలాడుతుంది. మన మధ్య నుంచి కనుమరుగైనా స్టీవ్‌జాబ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న యాపిల్‌ ఉత్పత్తుల్ని వదిలివెళ్లారు. తనకు ప్రేరణ ఏమిటన్న ప్రశ్నకు ‘33 ఏళ్ల నుంచి ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే అద్దం ముందు నిల్చుని నాకు నేను వేసుకునే ప్రశ్న.. ‘ఈ రోజే నా జీవితంలో ఆఖరు రోజైతే నేను ఏమేమి చేయాలి?’ అని. అదే నాకు ప్రేరణ. మృత్యువు సమీపంలో ఉన్నప్పుడు ఏ పనులు చేయాలన్న ఛాయిస్‌ ద్వారానే యాపిల్‌ నుంచి ఇన్ని ఉత్పత్తులు వచ్చాయి’ అని ఆయన సమాధానం చెప్పారు. 

వాల్ట్‌ డిస్నీ: చిన్నారులకు ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించి వెళ్లిపోయిన వాల్ట్‌ డిస్నీకి ప్రేరణ కలిగించిన విషయం వింటే ఆశ్చర్యపోతాం. అపజయం తనను సదా నడిపిస్తోందని చెప్పేవారు. సాధారణంగా పరాజయం ఎదురు కాగానే చాలామంది కుంగిపోతారు. ఆపై అడుగు ముందుకు పడదు. కానీ కన్సాస్‌ నగరంలో ఉండగా 1920ల్లో వేసిన కార్టూన్‌ సిరీస్‌ విఫలమైనప్పుడు ఆయన గోడకు కొట్గిన బంతిలా మరింత శక్తిని కూడగట్టుకుని మిక్కి-మౌజ్‌ చిత్రాలు సృష్టించి అమరులయ్యారు. 

ఓప్రా విన్ఫ్రే: తన టెలివిజన్‌ షోలతో కోట్ల మందికి ఆరాధ్య దేవతలా నిలిచిన ఓప్రా విన్ఫ్రే జీవితం అంతా ముళ్లబాటే. నిరుపేద కుటుంబంలో పుట్టి బాల్యంలోనే పీడ కల వంటి జీవితం గడిపిన ఓప్రా విన్ఫ్రే తనకు ప్రేరణ కలిగించేది...జీవితం పట్ల బరువు బాధ్యతలు గుర్తెరగడం అంటారు. 300 కోట్ల డాలర్ల సంపద సృష్టించిన ఆమె... ‘మీ జీవితానికి మీరే బాధ్యులు, దానికి మరొకరిపై నెపం నెట్టకండి’ అని ఉద్బోధిస్తారు.

Posted Date: 01-02-2021


 

ప్రేరణ

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం