• facebook
  • whatsapp
  • telegram

దుర‌భిప్రాయ ధోర‌ణికి దూరం!

‣ స‌వ్య‌మైన అభిప్రాయాల‌తోనే స‌రైన నిర్ణ‌యం

ఏ విషయంపైనైనా సవ్యమైన అభిప్రాయంతో ఉన్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. హేతుబద్ధంగా, తార్మికంగా ఆలోచనలు సాగినప్పుడు అన్ని విషయాల పట్లా సమదృష్టి ఏర్పడుతుంది. అంటే.. దురభిప్రాయ ధోరణికి  దూరంగా ఉంటేనే కెరియర్‌లో ఎదుగుదల సాధ్యం!  

ప్రిజుడిస్‌ నుంచి బయటపడటం

చదువులో చురుగ్గా ఉంటాడు నవీన్‌. ప్రాపంచిక విషయాలు పట్టించుకుంటాడు. కాస్త సమయం దొరికితే చాలు, పుస్తక పఠనంలో లీనమవుతుంటాడు. సమకాలీన అంశాలపై చర్చల్లో పాల్గొంటాడు. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగానే ఈ ఆసక్తిని గమనించిన తండ్రి ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టిపెట్టమని సూచించాడు. ఈ విధమైన ఆసక్తులు గలవారు ప్రభుత్వ పరీక్షల్లో రాణిస్తారన్నఅవగాహన ఆయనకు ఉంది. కానీ నవీన్‌ దీన్ని కొట్టిపారేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉంటాయని వ్యాఖ్యానించాడు. కొడుకులో ఈ దురభిప్రాయం ఎలా ఏర్పడిందో తెలియని తండ్రి దాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నించినా నవీన్‌ చెవికెక్కించుకోలేదు. ఆనోటా ఈనోటా విన్న కాకమ్మ కబుర్లన్నీ చెప్పాడు. అంత ప్రతిభ ఉండీ చివరకు ఓ చిన్న ప్రైవేటు ఉద్యోగంలో చేరిపోయాడు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ర్యాంకులో ఉండాల్సినవాడు కేవలం అతడిలో ఏర్పడ్డ ప్రిజుడిస్‌ (అకారణ దురభిప్రాయం) వల్ల అవకాశం కోల్పోయాడని ఆ తండ్రి బాధపడ్డాడు.

కీర్తి, కనకవర్షం

అకారణ వ్యతిరేకత చాలామంది ఎదుగుదలకు ప్రతిబంధకం. అయితే ఆ వ్యతిరేకతకు గురైన కొందరికి కీర్తి ప్రతిష్ఠలూ, అపార సంపదా లభించాయి. 

‣ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌: ఈయన్ను చిన్నతనంలో తెల్లవారి పిల్లలతో ఆడుకునేందుకు అనుమతించేవారు కాదు. దానితో ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఆటలకు దూరమయ్యాడు. ఇది మనసులో పడిపోయిన ఆ బాలుడు వివక్షకు వ్యతిరేకంగా ఎలుగెత్తాడు. పెరిగి పెద్దవాడై మంత్రి స్థాయికి ఎదిగాడు. వివక్షకూ, అకారణ ద్వేష భావనకూ వ్యతిరేకంగా పోరాడాడు.

‣ వారెన్‌ బఫెట్‌: ఈ స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం తన పెట్టుబడులు వేల రెట్లు పెరగడానికి ఒక కారణం చెబుతారు. మార్కెట్‌లో చాలామంది ఇన్వెస్టర్లకు కొన్ని కంపెనీలపట్ల ఉన్న దురభిప్రాయమే తనకు కలిసివచ్చే విషయమంటాడీ బెర్క్‌షైర్‌ హాథ్‌వే కంపెనీ అధినేత. పదివేల కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ నాలుగో కుబేరుడిగా బఫెట్‌ అవతరించాడు.

అకారణంగా వ్యతిరేకత

ప్రిజుడిస్‌ అంటే దురభిప్రాయం. ఒక అపోహ. ఏదైనా ఒక విషయంపై అకారణంగా వ్యతిరేకత ఏర్పడటం. దీనికి హేతుబద్ధత వుండదు. ముందే మనసులో ఏర్పరచుకున్న దురభిప్రాయం కారణంగా దానికి దూరంగా ఉంటారు. దాన్ని ఏవగించుకుంటారు.తమ కెరియర్‌కూ, జీవితంలో ఎదుగుదలకూ ఎంత అత్యవసరమైనదైనా దాన్ని అప్రియంగానే పరిగణిస్తారు.  

దురభిప్రాయాలూ, అపోహలూ కెరియర్‌లో ఎదిగే అవకాశాలను దెబ్బతీస్తున్నందున దీన్నుంచి బయటపడేందుకు ఏం చేయాలి?  

విశ్వసనీయ సమాచారం తెలుసుకోవడం: ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ గలవారికి రావనే దురభిప్రాయం ఉన్నప్పుడు దాని గురించి నిజానిజాలు తెలుసుకొని నిర్ధారణ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ పాటికే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించుకున్నవారిని కలుసుకోవడం ద్వారా వాస్తవాలు తెలుసుకోవచ్చు. దురభిప్రాయాన్ని మార్చుకోవచ్చు.  

ద్వేషించేవారికి దగ్గరగా: ఏదైనా ఒక వర్గంపై అకారణ ద్వేషం ఉన్నప్పుడు దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు మార్గం- ఆ వర్గంవారిని ఎక్కువగా కలవడమే. వారికి సన్నిహితంగా మెలగడం ద్వారా వారి గురించి లోతుగా తెలుసుకోవచ్చు. వారిపై ఉన్న దురభిప్రాయాలు క్రమేపీ తొలగిపోతాయి.  

వ్యక్తిగత దిద్దుబాటు: నిష్పాక్షికంగా ఉండటం, పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఎదిగే అవకాశాలు మెరుగవుతాయి. కానీ అందుకు కొన్ని మానసిక అడ్డంకులు ఏర్పడుతున్నప్పుడు వాటిని తొలగించుకునేందుకు కృషి చేయాలి. అందుకోసం అవసరమైతే వ్యక్తిత్వ దిద్దుబాటుకు సిద్ధమవ్వాలి. తగిన శిక్షణ పొందడంలోనూ తప్పు లేదు. 

Posted Date: 12-04-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం