• facebook
  • whatsapp
  • telegram

చొరవతో సాధించు!

క్రియాశీల‌క సామ‌ర్థ్యం కీల‌కం

రోజురోజుకీ పుట్టుకొస్తున్న కొత్త సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి చొరవ, క్రియాశీల సామర్థ్యం ఉన్నవారు అవసరమని ఉద్యోగ నియామక కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రొయాక్టివ్‌నెస్‌’ అనే ఈ జీవన నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడం సముచితం! 

రెజ్యూమె వైపు పరిశీలనగా చూసిన రిక్రూటర్‌ ‘మీరు ప్రొయాక్టివ్‌ పర్సనాలిటీ అనడానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పగలరా?’ అని చైతన్యను ప్రశ్నించాడు.  

‘నేను ఈ ఇంటర్వ్యూకు రాగలగడమే అందుకు తగిన ఉదాహరణ అనుకుంటున్నా. మా కాలేజీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ జరగడంలేదు. కానీ మీ కంపెనీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో ఉన్నదని ఇతర కాలేజీల్లోని ఫ్రెండ్స్‌ ద్వారా తెలుసుకున్నాను. నా అర్హతలు తెలుపుతూ మెయిల్‌ ఇచ్చాను. వెంటనే సమాధానం రాలేదు. పదేపదే ఫాలోఅప్‌ చేయడంతో కాల్‌ లెటర్‌ వచ్చింది. కాల్‌లెటర్‌ వస్తుందన్న నమ్మకంతో నెలరోజుల నుంచి ఇంటర్వ్యూ కోసం సన్నద్ధమవుతున్నాను’ అన్న చైతన్య జవాబు రిక్రూటర్‌కు నచ్చింది.  

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కాలయాపన చేయకుండా కావలసినదానికోసం తానే చొరవగా పూనుకొని క్రియాశీలకంగా ముందడుగు వేయడమే- ప్రొయాక్టివ్‌నెస్‌! 

ఈ సామర్థ్యాన్ని అలవర్చుకున్నవారు కంపెనీల్లో రాణిస్తారు. ఎందుకంటే క్రియాశీలకంగా ఉండేవారు పని గమనంలో ప్రతి అడుగుకీ పైనుంచి ఆదేశాల కోసం ఎదురుచూడరు. తమ పరిధికి మించిన సవాలు ఎదురైనప్పుడు మాత్రమే మార్గదర్శకత్వాన్ని ఆశిస్తారు. అదే రియాక్టివ్‌ (తక్షణ స్పందన) స్వభావులు ఏదీ తమంతట తాము చేసేందుకు సిద్ధపడరు.  

ఇవీ మార్గాలు:  

ప్రొయాక్టివ్‌గా ఉండటం కెరియర్‌లో అందరికంటే ముందు నిలపడమే కాదు, ఎంచుకున్న  రంగంలో అసాధారణంగా నిలుపుతుంది. 

1. ముందస్తు ప్రణాళిక  

చొరవగా, క్రియాశీలకంగా ఉండగలగాలంటే ముందు నిస్తేజాన్ని వీడాలి. ఉద్యోగమైనా... సొంత వ్యాపారమైనా...మరో వ్యాపకమైనా. ‘అవకాశం వచ్చినప్పుడు చూసుకుందాంలే’ అన్న ధోరణి వీడాలి. అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవడం మొదటి మెట్టు. ప్రణాళిక రూపొందించుకుంటే దీన్ని సాధించుకునే మార్గాలు స్ఫురిస్తాయి. ఆ దిశగా కృషి చేయాలన్న ఉత్సాహం అంకురిస్తుంది.  

2. అంతిమ ఫలితం ఆదిలోనే..  

ప్రణాళిక రూపకల్పన ద్వారా వచ్చిన ఉత్సాహం నిలబడాలంటే ప్రయత్నం ఫలవంతమవుతుందన్న నమ్మకం వుండాలి. అసలు ఆదిలోనే అంతిమంగా ఆశించిన ఫలితం సొంతమవుతుందన్న విశ్వాసం దృఢంగా ఏర్పడేలా చూసుకోవాలి. 

3. ప్రాథమ్యాల జాబితా  

చాలామందిలో ఈ ప్రొయాక్టివ్‌ సామర్థ్యం కొరవడటానికి అసలు కారణం- సాధించాలనుకుంటున్న లక్ష్యం విషయంలో ఏ పని ఎప్పుడు చేయాలనే ప్రాథమ్యాలను నిర్దేశించుకోలేకపోవడం. క్రియాశీలక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నప్పుడు స్పష్టమైన సామర్ధ్యాలనూ, కార్యాచరణనూ రూపొందించుకొని, ఆ దిశగా వెనకడుగు వేయకుండా కృషి చేయాలి.  

4. సరళత్వం  

ఏ విషయంలోనూ జడత్వం కూడదు. ప్రతి విషయంలోనూ సరళంగా వ్యవహరించగలగాలి. మౌలిక విలువల్లో రాజీ లేకుండా లౌకిక విషయాల్లో సర్దుబాటుకు సిద్ధంగా వుండాలి. ఏ సవాలునైనా స్వీకరించేలా, ఏ సవాలుకైనా తగిన పరిష్కారాలతో సిద్ధంగా ఉన్నప్పుడే ప్రొయాక్టివ్‌ దృక్పథం ఏర్పడుతుంది.  

అవకాశాలు సృష్టించుకుంటారు! 

ప్రొయాక్టివ్‌ నైపుణ్యం గలవారు అవకాశాలకోసం ఎదురుచూడరు. చొరవ తీసుకుని అవకాశాలను సృష్టించుకుంటారు.  

అభిజిత్‌ బన్సాద్‌  

అభిజిత్‌ బన్సాద్‌ది నాగ్‌పుర్‌. అహమ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థలో చదువుతున్నప్పుడు- డిజైనింగ్‌లో మూస ఆలోచనా పద్ధతికి స్వస్తి పలికి సృజనాత్మకంగా ఉండాలని తపన పడేవాడు. ప్రాజెక్టు వర్క్‌ కోసం తన ఆలోచనలకు అవకాశం ఇవ్వగలిగే కంపెనీకోసం తానే ప్రయత్నించాడు. టైటాన్‌ వాచ్‌ కంపెనీలో అవకాశం రాగానే ఆంధ్రప్రదేశ్‌లోని ఏటికొప్పాక వెళ్లి, అక్కడి కళాకారులు సహజ రంగులతో చేస్తున్న నమూనాల స్ఫూర్తితో టైటాన్‌కి సృజనాత్మక డిజైన్లు అందించాడు. ఫలితంగా శాశ్వత ఉద్యోగంతో టైటాన్‌ సంస్థ అతడికి స్వాగతం పలికింది. అప్పటివరకు వాచీల తయారీలో అనుసరిస్తున్న పాశ్చాత్య స్విస్‌ విధానానికి భిన్నంగా స్వదేశీ అభిరుచితో ఇతడు సృష్టించిన ‘రాగా’ శ్రేణి టైటాన్‌ వాచీలను విక్రయాల్లో మరో మెట్టు ఎక్కించింది. తానే చొరవగా అవకాశాలను సృష్టించుకున్న అభిజిత్‌ బన్సాద్‌ నేడు ఎ.బి.డి. డిజైనింగ్‌ స్టూడియో అధినేత.  

సురేష్‌ కామత్‌  

ఎం.టెక్‌ చేసిన సురేష్‌ కామత్‌ కొంతకాలం ఐటీ కంపెనీల్లో పనిచేసి తర్వాత తనలోని క్రియాశీలక ఆలోచనలకు అనుగుణంగా సొంత కంపెనీ స్థాపించారు. ఆయన నెలకొల్పిన కంపెనీపేరు లేజర్‌ సాఫ్ట్‌ ఇన్ఫో సిస్టమ్స్‌. దీనిలో బీటెక్‌ చేసిన ఇంజినీర్లు ఉండరు. సాధారణ బీకామ్, బీఎస్సీ చేసిన యువతీ యువకులను తీసుకొని వారికి శిక్షణ ఇస్తారు. వాళ్ల చేతనే ఐటీ ఉత్పత్తులను సృష్టిస్తారు. ఇలా తీసుకునేవారిలో వికలాంగులూ ఉంటారు. ఇక లేజర్‌ సాఫ్ట్‌ కంపెనీ కార్యాలయం సాధారణ, మధ్య తరగతి నివాస ప్రాంతంలోనే ఉంటుంది. ఇటువంటి సాధారణ వనరులతో సురేష్‌ కామత్‌ అసాధారణ ఐటీ ఉత్పత్తులను సృష్టించగలిగారు. ఆయనలోని చొరవకూ, క్రియాశీలతకూ నిదర్శనంగా లేజర్‌ సాఫ్ట్‌ నిలిచింది. ప్రస్తుతం పొలారిస్‌లో భాగమైనా తన ఉత్పత్తుల ద్వారా అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది.  

Posted Date: 22-03-2021