• facebook
  • whatsapp
  • telegram

మేలు చేసే సవాలు!

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

‘మీరు సమస్యలో భాగంగా ఉంటారా? సమస్య పరిష్కర్తగా మారతారా? నిరాశావాది ప్రతి పనిలోనూ ఒక సమస్యను చూస్తాడు. ఆశావాది ప్రతి పనిలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు’- ఈ మధ్య వివిధ సందర్భాల్లో తరచుగా వినిపిస్తున్న వాక్యాలివి. వాస్తవానికి ఇవే కెరియర్‌కు ఉన్నత సోపానాలు. జీవన గమనంలో ఒక భిన్నమైన వ్యక్తిగా నిలబెడుతున్న సమస్యా పరిష్కారం (ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌) ఒక ప్రధాన జీవన నైపుణ్యం. జనం జేజేలు పలికే వ్యక్తిత్వ లక్షణం, జీవన సామర్థ్యం! 

రవి, హరి స్నేహితులు. ఇద్దరూ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లే. ఒక హోమ్‌ ఆటోమేషన్‌ స్టార్టప్‌ కంపెనీలో చేరి రెండేళ్లవుతోంది. యాజమాన్యం ప్రతిఒక్కరి పని తీరునూ నిశితంగా పరిశీలిస్తోంది. రవికి కంపెనీ అసాధారణంగా జీతాన్ని రెట్టింపు చేసింది. హరికి మాత్రం సాధారణంగా అందరు ఉద్యోగులకు ఇచ్చే పది శాతం పెరుగుదల చూపించారు. 

ఎందుకీ తేడా? పనిలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడంలో రవి సమర్థుÄడు. దేన్నీ సమస్యగా భావించడు. ఒక అవకాశంగా చూస్తాడు. పనిలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలతో యాజమాన్యం దగ్గరకు వస్తాడు. కానీ హరికి ప్రతిసారీ పనిలో ఎదురయ్యే సమస్యలే కనిపిస్తాయి. వాటినే మేనేజ్‌మెంట్‌కు నివేదించి పరిష్కారాలు చెపుతారని నిరీక్షిస్తాడు. ఇప్పటికే చేరిన రెండేళ్లలో రవి పనిలో ఎదురైన ఎన్నో సవాళ్లను తగిన పరిష్కారాలు కనుగొనడం ద్వారా సంస్థకు ఎంతో సమయం, కొన్ని సందర్భాల్లో డబ్బు ఆదా చేయగలిగాడు. కంపెనీకి అదనపు విలువ తీసుకొస్తున్న రవి కంపెనీకి అసెట్‌ (ఆస్తి). ఈ తరహా ఉద్యోగులను ప్రోత్సహించాలన్న సంస్థ విధానం మేరకే ఆ నిర్ణయం జరిగింది.  

ఏమిటీ పరిష్కారం?

ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంటే సాధారణంగా గణితంలో లెక్కలు గుర్తుకు వస్తాయి. ఒక లెక్కను అంచెలంచెలుగా (స్టెప్‌ బై స్టెప్‌)గా పరిష్కరించుకుంటూ వెళతాం. కానీ బాహ్య ప్రపంచంలో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంటే ఏమిటి? ఒక పని పూర్తికావాలనుకున్నప్పుడు, ఒక లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు, ఒక గమ్యం చేరాలనుకుంటున్నప్పుడు.. మార్గం అగోచరంగా ఉందనుకోండి. అప్పుడు మేధను ఉపయోగించి సరళమైన, సరైన మార్గాన్ని కనుక్కోగలగడమే ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌. 

కార్పొరేట్‌ రంగంలో పని సంస్కృతిలో దేన్నీ సమస్యగా భావించరు. వాటిని సవాళ్లుగా పరిగణిస్తారు. వాటిని ఛేదించేందుకు వివిధ దశలున్నాయి.  

1. సన్నద్ధత: సవాళ్లను ఎదుర్కొనాలంటే... సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే అందుకోసం ముందుగా తగిన భూమికను సిద్ధం చేసుకోవాలి. సవాలు పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సదరు సవాలులో భాగం కాకుండా, దానినుంచి దూరంగా జరగాలి. సమస్యకు సంబంధించిన సాధ్యమైనంత ఎక్కువ సమాచార సేకరణ చేయాలి. ఉదాహరణకు బెస్ట్‌ ఎంప్లాయిమెంట్‌ రిపోర్టు పొందిన కంపెనీలో జాబ్‌ కొట్టడమే మీ లక్ష్యం. అందుకు ఆ కంపెనీ గురించీ, ఎంపిక విధానం గురించీ సమాచార సేకరణ చేయాలి. ఆపై సవాలును ఛేదించడం సులువు అవుతుంది.  

2. మానసిక మధనం: ఎదుర్కొనబోయే సవాలుకు సంబంధించిన సమాచార సేకరణ పూర్తయ్యాక  దానిపై సంపూర్ణ అవగాహన కోసం మానసిక మధనం చేయాలి. దీనిలో సమస్య లేదా సవాలు మూలాల్లోకి వెళ్లాలి. సవాలుకు సంబంధించిన ప్రతి దశనూ స్పృశించాలి. ఆద్యంతాలను అవలోకించాలి. ఈ సమయంలో ఎదురు కాబోయే అవరోధాలు లీలామాత్రంగా గోచరిస్తాయి. వాటిని అధిగమించే మార్గాలపై మానసిక కసరత్తు చేయాలి.  

3. ప్రత్యక్ష కార్యాచరణ: సవాలుతో తలపడే ప్రత్యక్ష దశ ఇది. అప్పటికే మానసిక మధనం చేసివున్నందువల్ల ఈ దశలో కొత్తగా అనిపించదు. మానసిక మధనం బాగా చేసివుంటే ఈ దశలో అంతా అనుకున్నట్టే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీంతో ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుంది. కానీ ఈదశలో అనుకోని అవరోధాలు ఎదురు కావచ్చు. ముందే సన్నద్ధమైనవాటికి భిన్నమైన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు.  

4. సంకల్పబలం: కొత్తగా ఉత్పన్నమైన పరిస్థితులను ఆధిగమించాలంటే దృఢ సంకల్పం అలవర్చుకోవాలి. మానసిక మధనం సమయంలోనే అనుకోని అవాంతరాలను ఎదుర్కోగలిగే మానసిక శక్తిపై తగిన సాధన చేయాలి. దానివల్ల సవాళ్ల్లను ఎదుర్కొనే సమయంలో, సమస్యలను పరిష్కరించే తరుణంలో ప్రతికూలతలకు తట్టుకోగలుగుతాం. అనుకున్న ఫలితం సాధించగలుగుతాం. సవాళ్లను ఎదుర్కొనే మార్గంలో అన్ని దశలనూ ఒకసారి దాటగలిగితే ఇదొక అలవాటుగా మారుతుంది. నవాళ్లను సునాయాసంగా అధిగమించే సామర్థ్యం అలవడుతుంది. 

ఇదే సమస్య పరిష్కార ప్రక్రియ! 

వెనకడుగు వేయని స్వాతి మోహన్‌ 

శాస్త్రవేత్తలకు ఎదురయ్యే సవాళ్లే మానవాళికి మేలు చేస్తున్నాయి. నాసా ఆధ్వర్యంలోని మార్స్‌ ప్రాజెక్టులోని కీలక సవాలును అధిగమించినందువల్లనే అంతరిక్ష శాస్త్రవేత్త స్వాతి మోహన్‌ జగత్‌ ప్రసిద్ధి పొందారు. 

నాసా పంపిన పర్సివరెన్స్‌ రోవర్‌ లక్ష్యం అంగారక గ్రహంపై వున్న బ్రెజిరో క్రాటర్‌ అని పిలిచే ప్రాంతాన్ని చేరుకోవడం. ఇక్కడ రోవర్‌ను విజయవంతంగా దింపి పరిశోధనలు సాగిస్తే ప్రాణికోటి ఆనవాళ్లు లభ్యమవుతాయని అంచనా. అయితే మార్స్‌ పైన ఈ ప్రాంతంపై రోవర్‌ను దింపడమే అసలైన సవాలు. ఇది కఠిన అగ్నిపరీక్ష అని స్వాతి వెనకడుగు వేసివుంటే ఆమెకీనాడు కీర్తిప్రతిష్ఠలు లభించివుండేవి కావు. 

ఈ సవాలును ఏవిధంగా ఛేదించాలో మేధామథనం చేసిన ఆమె ల్యాండింగ్‌ కంట్రోల్‌ బాధ్యతను స్వీకరించి విజయవంతంగా రోవర్‌ని దింపి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Posted Date: 08-03-2021