• facebook
  • whatsapp
  • telegram

కలిసొచ్చే కలివిడితనం

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

సమయస్ఫూర్తి, చతురత, విజ్ఞతలతో  ఇతరులతో సంబంధాలను సజీవంగా నిలుపుకోవాలి. అప్పుడే ‘సోషల్‌ కాంపిటెన్సీ’ స్కేలులో ఎప్పుడూ మంచి పాయింట్లే పడతాయి. ఫలితంగా కెరియర్‌లో, జీవితంలో అద్భుతంగా రాణించవచ్చు! 

కార్పొరేట్‌ కంపెనీలో జూనియర్‌ హెచ్‌.ఆర్‌. నియామకాలు జరుగుతున్నాయి. అన్ని దశలూ ముగిశాక అభ్యర్థుల సోషల్‌ కాంపిటెన్సీ స్థాయిని పరీక్షించేందుకు మరో రౌండ్‌ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. అభ్యర్థుల్లో ఒకరైన నీరజ నివ్వెరపోయింది. ఈ సాంఘిక సామర్థ్యం గురించి ఆమె మొదటిసారి వింటోంది. ఎలాగూ దానిగురించి తనకేమీ తెలియదని పోటీ నుంచి నిష్క్రమించింది.  

ఏమిటీ నైపుణ్యం? 

పదిమందీ కలిసే సందర్భాల్లో ప్రభావవంతంగా ఉండటమే ఈ సామర్థ్యం. ఇంకా సరళంగా చెప్పాలంటే అందరితో కలివిడిగా మసలుకోవడం. మనుషుల మధ్య సంబంధాలు ఏర్పర్చడం, ఆ సంబంధాలను పదికాలాలపాటు నిర్వహించగలగడమే సోషల్‌ కాంపిటెన్సీ. మరి ఏ లక్షణాలుంటే ఇది మెరుగ్గా ఉన్నట్టు భావిస్తారు?

శక్తిమంతమైన భావవ్యక్తీకరణ: కలివిడితనానికి తొలిమెట్టు చక్కగా మాట్లాడగలగడం, మనసులోని భావాన్ని ఎదుటివారిని ఆకట్టుకునేలా వ్యక్తీకరించడం. నచ్చని విషయాన్ని ఎదుటివారు నొచ్చుకోకుండా మెచ్చుకునేలా చెప్పగలగడం. మాట్లాడుతుంటే సంభాషణను హృద్యంగా కొనసాగించడం.  

స్పర్థల నివారణ: సాంఘిక సామర్ధ్యం ఉన్నవారిలో ఒక అరుదైన లక్షణం ఉంటుంది. వీరు ఎక్కడున్నా తమ చుట్టూ ఉన్నవారితో ఎప్పుడు ఘర్షణ పొడచూపినా దాని నివారణకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అందుకే వారిని సంస్థల్లో సమస్యా పరిష్కర్తలు (ట్రబుల్‌ షూటర్లు)గా గుర్తించి ఆధారపడుతుంటారు.  

శ్రద్ధగా ఆలకించడం: కలివిడితనం ఉండేవారిలో కనిపించే ముఖ్య లక్షణం- ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం. ఈ లక్షణాలతోనే వీరు తమచుట్టూ ఉన్నవారిని ఆకట్టుకోగలుగుతారు. తమ మాటలను ఆసక్తిగా, పూర్తిగా వినేవారిని తమకు సన్నిహితులుగా ఎవరైనా భావిస్తారు. 

సంబంధాల అల్లిక: సాంఘిక నైపుణ్యానికి పునాది మానవ సంబంధాలే. నిత్యజీవితంలో, వృత్తి జీవితంలో మానవ సంబంధాలను అర్ధం చేసుకొని వాటిని పటిష్ఠ అనుబంధాలుగా మార్చుకోగలిగే నైపుణ్యమే పెద్ద బలం. పని వాతావరణంలో ఈ నైపుణ్యం చాలా సందర్భాల్లో అక్కరకు వచ్చి కొందరు ఉద్యోగులను ప్రత్యేకంగా నిలుపుతుంది.

గౌరవం: కలివిడితనానికి గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ప్రాణవాయువు లాంటిది. ఎదుటి వ్యక్తిపై గౌరవం, ఆసక్తి చూపడం ద్వారానే ఇతరులతో సంబంధాలు బలపడతాయి. గౌరవం చూపడం అనేది ఒక సానుకూల స్పందన. ఇది మనుషుల మధ్య బంధం ఏర్పరచి బలపరుస్తుంది.  

వీరి తీరు విభిన్నం  

అమితాబ్‌బచ్చన్, అక్షయ్‌కుమార్‌లు తమను ఇంతవారిని చేసిన ప్రేక్షకులను ప్రత్యక్ష దేవుళ్లుగా భావిస్తారు. అవసరమైన ప్రతి విషయాన్నీ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. కరోనా కష్టకాలంలో అక్షయ్‌కుమార్‌ ఏకంగా పాతిక కోట్ల విరాళం ఇచ్చారు. చెక్కు రాయబోతున్నపుడు ఆయన అర్థాంగి ‘అంతపెద్ద మొత్తమా? మరోమారు ఆలోచించమని’ సూచించగా ‘ఇది ప్రజల డబ్బే. ఇది వారికి ఇస్తున్నాను. మళ్ళీ సమయం వచ్చినప్పుడు ప్రేక్షకులు వాపసు ఇస్తారు’ అని అక్షయ్‌కుమార్‌ తేలిగ్గా నవ్వుతూ కొట్టిపారేశారు. విపత్కర కాలంలో ప్రజల తరపున నిలబడి సాంఘిక నైపుణ్యాన్ని చూపినందువల్లే ఈ తారలు మిగతావారికంటే భిన్నంగా నిలిచారు. 

ఎలా పెంపొందించుకోవచ్చు? 

మనిషి ‘సాంఘిక జీవి’ అని అరిస్టాటిల్‌ క్రీస్తుపూర్వమే చెప్పారు. సాంఘిక జీవన ఆనుపానులు తెలిసిన మనిషికి సాంఘిక సామర్థ్యం సంతరించుకోవడం వెన్నతో పెట్టిన విద్య. అయితే కాస్త ప్రత్యేక దృష్టితో సాధన చేయాలి.   

1. స్వీయ నియంత్రణ: సాంఘిక సామర్థ్యం సంతరించుకోవడం అంటే అందరికీ దగ్గర కావడం, అందరివాడుగా మనగలగడం. ఇందుకు స్వీయ నిర్వహణ, స్వీయ నియంత్రణ తొలి అడుగు. ఎక్కడ ఏం మాట్లాడాలి? ఎలా వ్యవహరించాలో గ్రహించాలి. 

2. నమ్మకం: సాంఘిక సంబంధాలకు నమ్మకమే కేంద్ర బిందువు. ఎదుటి మనిషి మన శ్రేయోభిలాషి అనుకున్నప్పుడే అరమరికలు లేకుండా మనగలుగుతాం. నమ్మకాన్ని ఏర్పరచుకోవడమే ముందు చేయాల్సిన పని. దాన్ని సదా నిలుపుకోవడం మరీ అవసరం.  

3. ఆత్మ వివేచన: సాంఘిక సంబంధాలంటే మానవ సంబంధాలే. నిత్యం వివిధ సందర్భాల్లో, పరిస్థితుల్లో మన మాట, ప్రవర్తన ఎలా ఉండాలన్న ఆత్మ వివేచన మదిలో మథనం జరుగుతుండాలి. ఇతరులతో సంబంధాలను క్షీణింపజేసే ప్రతిదాన్నీ త్యజించాలి. సంబంధాలను మెరుగుపరచే ప్రతి దాన్నీ మెరుగుపరచుకోవాలి.  

4. గెలుపు తపన: విద్య, ఉద్యోగం, వ్యక్తిగత జీవితం...ఇలా ఏదైనా సరే, ఆ రంగంలో గెలవాలన్న కోరికను మదిలో నింపుకున్నప్పుడు ఉన్నత లక్ష్యాలవైపు చూపు ఉంటుంది. అల్ప విషయాలపై దృష్టి మరలదు. ప్రతిదాన్నీ విశాల దృక్పథంతో వీక్షించడం అలవాటవుతుంది. విశ్వజనీన భావన ఏర్పడినప్పుడు మానవ సంబంధాలను సన్నిహితంగా, హృద్యంగా నడుపుతాం. తద్వారా అందరికీ దగ్గరివారిగా పేరు తెచ్చుకోగలుగుతాం.


 

Posted Date: 29-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం