• facebook
  • whatsapp
  • telegram

అలజడిని ఆపగలిగితే గెలుపే!  

మానసిక ఒత్తిడి తట్టుకోగలిగే సామర్థ్యం ఓ కీలక జీవన నైపుణ్యం. దీన్ని పెంపొందించు కోవడం ద్వారా కెరియర్‌లో, వృత్తి జీవితంలో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. జీవన గమనాన్ని ఆనందమయం చేసుకోవచ్చు! 

సివిల్స్‌ ఇంటర్వ్యూకు వెళ్ళేముందు వచ్చిన ఒక ఫోన్‌కాల్‌ మధులో అలజడి రేపింది. అతని యూనివర్సిటీ రూమ్‌మేట్‌ కాల్‌ చేసి ‘ఇంటర్వ్యూ బాగా చేయి. అసలే నీకిది చివరి అటెమ్ట్‌. మీ ఇంట్లోవాళ్లు, బంధువులు అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు’ అంటూ హెచ్చరించాడు. దీంతో అతని మదిలో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది. గత రెండు ప్రయత్నాల నుంచి విజయం అందినట్టే అంది త్రుటిలో తప్పిపోతోంది. ఈసారి తప్పిపోతే... తన కెరియర్‌ ఏమైపోతుంది? కుటుంబ సభ్యుల ఆశలన్నీ అడియాసలవుతాయి.. ఇలాంటి ఆలోచనలు చుట్టుముట్టడంతో నిస్సత్తువ ఆవరించింది. మెదడంతా మొద్దుబారిన స్థితిలో ఇంటర్వ్యూ గదిలోకి పిలుపువచ్చింది. గదిలోకి వెళ్లిన మధు వాళ్లేం అడుగుతున్నారో... తానేం చెబుతున్నాడో గుర్తించలేని స్థితిలో పావు గంటకే బయటకు వచ్చేశాడు!  

ఇతడు ఎదుర్కొన్న ఈ మానసిక స్థితినే ఒత్తిడి అంటాం. నిరాశా నిస్పృహలతో పెద్ద బరువు మీద పడిన భావన. ఈ స్థితిని చక్కదిద్దుకోలేని నిస్సత్తువ ఆవరించే పరిస్థితినే మానసిక ఒత్తిడి (స్ట్రెస్‌)గా పరిగణిస్తారు. ఇది శారీరకం కూడా. ఈవిధమైన మానసిక స్థితి కారణంగా ముందు రక్తప్రసరణ స్థాయి పడిపోతుంది. నిస్సత్తువ ఆవరించి గొంతు తడారిపోతుంది. కాళ్లు, చేతులు ఆడవు. మొత్తం దేహమంతా సహజ శక్తిని కోల్పోయినట్టు  అనుభవమవుతుంది. కెరియర్‌లో, జీవన పథంలోని ముఖ్య సందర్భాల్లో ఆశించిన ఫలితాలకు ఈ మానసిక ఒత్తిడి అవరోధంగా నిలుస్తుంటుంది. దీన్ని అదుపుచేసే నైపుణ్యాన్ని అలవరచుకునేవారే అద్భుతంగా రాణిస్తున్నారు. 

వివిధ రంగాల ప్రముఖులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వేర్వేరు మార్థాలు అనుసరిస్తుండగా - ఒత్తిడిని జయించేందుకు కొన్ని సూచనలు. 

1. అవగాహన: ముందుగా ఒత్తిడిపై తగిన అవగాహన ఉండాలి. ఒత్తిడి కలిగిస్తున్న సందర్భాలు, పరిస్థితులపై స్పష్టత తెచ్చుకోవాలి.  

2. ముందస్తు ప్రణాళికలు: వృత్తి జీవితంలో, కెరియర్‌లో భవిప్యత్‌ ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకొని కచ్చితంగా అనుసరించాలి.

3. ప్రత్యామ్నాయాలు: కెరియర్‌లో ఏక లక్ష్యం మంచిదే. కానీ అది తప్ప వేరే మార్గం లేనప్పుడు ఆ దారి మూసుకుపోతే ఎలాగన్న ఆలోచన ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి.

4. సమస్యా పరిష్కారం: సమస్యలు ఎప్పుడూ మానసికంగా దుర్బలుల్ని చేస్తాయి. పరిష్కారాలు మనసును తేలిక పరుస్తాయి. అందుకే సమస్యా పరిష్కార మానసిక స్థితిని అలవర్చుకోవాలి.  

5. అడ్డంకులను ఊహించగలగడ]ం: లక్ష్య దిశగా వెళుతున్నప్పుడు ఆ మార్గంలో ఎదురయ్యే అవరోధాలను ముందుగానే పసిగట్టగలిగే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. అడ్డంకుల తొలగింపునకు ముందునుంచే కసరత్తు చేయవచ్చు.  

6. మనసుకు నచ్చే హాబీలు: మనసును తేలికపరచి, సాంత్వనపరచే అభిరుచులను పెంపొందించుకోవాలి. బిల్‌గేట్స్‌ పడుకునే ముందు గంటపాటు నచ్చిన పుస్తకం చదవడం ద్వారా ఒత్తిడికి దూరంగా ఉంటారు. 

వీరెలా ఎదుర్కొంటున్నారు?

వృత్తి, వ్యాపార, వ్యక్తిగత జీవితాల్లో నిత్యం వెంటాడే ఒత్తిడిని ప్రపంచ ప్రముఖులు ఎలా ఎదుర్కొంటున్నారో చూద్దాం.  

విరాట్‌ కోహ్లీ: ఆనందకర వ్యాపకంలో నిమగ్నం కావడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. సానుకూలంగా ఆలోచించడం, స్నేహితులు, తెలిసినవారితో సంబంధాలను పటిష్ఠం చేసుకోవడం ద్వారా అమితానందాన్ని పొందవచ్చు.  

టీమ్‌ కుక్‌ (ఆపిల్‌ సీఈఓ): ప్రతి ఒక్కరూ చెప్పేది సావధానంగా వినడం ద్వారా ఒత్తిడి దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో నిరాశావాదుల మధ్య ఆశావాదంతో జీవించడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. 

జాక్‌ డార్సీ (ట్విటర్‌ సీఈఓ): ఆ రోజు పూర్తి చేయాల్సిన పనుల జాబితాను ప్రతిరోజూ నా ఎదురుగా ప్యాడ్‌పై రాసి పెట్టుకొంటా. దాన్ని అనుసరిస్తుండటం ద్వారా ఒత్తిడి దగ్గరకు రాకుండా జాగ్రత్త పడతాను.   

ఒత్తిడితో చిత్తే!

మానసిక ఒత్తిడి మన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎంతటి నైపుణ్యాలున్నా ఒత్తిడి కారణంగా పనితీరు క్షీణిస్తుంది. మానసిక ఒత్తిడి చూపే ప్రభావాలు:  

జ్ఞాపకశక్తి: ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అవసరమైన విషయాలు గుర్తుకురావు. ఫలితంగా తగిన విధంగా స్పందించలేం.  

ఏకాగ్రత: ఏ పనైనా ఏకాగ్రత లోపిస్తే ముందుకు పోవడం సాధ్యం కాదు. చేస్తున్న పనిపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల ఫలితం సానుకూలంగా ఉండదు.  

నిర్ణయ సామర్థ్యం తగ్గుదల: మానసిక ఒత్తిడి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడం కారణంగా ఆ సమయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోలేం. దీనివల్ల తీవ్ర నష్టాలు వాటిల్లే సందర్భాలుంటాయి.  

నిర్వేద ధోరణి: ఒత్తిడి చూపే ప్రభావం కారణంగా వ్యతిరేక భావనలు పెరుగుతాయి. జ్ఞాపకశక్తి క్షీణించడం, ఏకాగ్రత లోపించడం, నిర్ణయ సామర్థ్యం కొరవడటంతో నిర్వేద ధోరణితో ప్రవర్తిస్తారు. 

Posted Date: 19-04-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం