• facebook
  • whatsapp
  • telegram

క‌లిపి న‌డిపే నాయ‌క‌త్వం కావాలి

టీమ్ లీడ‌ర్‌షిప్‌ల‌కు కంపెనీల ప్రాధాన్యం 

బృందనాయకత్వ నైపుణ్యం ఉన్నవారికోసం సంస్థలు అన్వేషిస్తుంటాయి. వివిధ రకాల పనులను చేసే బృందాల్లో పనిచేసేందుకు ఉద్యోగులకు కొదువ వుండదు. కంపెనీలకు కావలసిందల్లా- ఉద్యోగులను కలిపి బృంద నిర్మాణం చేయగలిగేవారూ; సమర్థంగా బృంద నాయకత్వం వహించగలిగేవారూ! 

గూగుల్‌ హేంగవుట్‌ వేదికగా కంపెనీ సమావేశం జరుగుతోంది. న్యూ ఎంట్రెంట్స్‌ కేటగిరీలో చైతన్యకు అవార్డు ప్రకటించగానే ఉద్యోగుల్లో చాలామందికి ఆశ్చర్యం కలిగింది. అకౌంటింగ్‌- ఫైనాన్స్‌ కంపెనీలో సి.ఎ.లు, ఐ.సి.డబ్ల్యు.ఎ.లు చేసినవారుండగా కేవలం బి.కాం. విద్యార్హతలతో చైతన్య ఈ అవార్డు దక్కించుకోగలిగాడు. కంపెనీలో ఒక్కరిగా ప్రతిభ చూపడం వేరు. ఒక బృందానికి నాయకత్వం వహించడం వేరు. పదిమంది సభ్యులున్న బృందానికి నాయకత్వం వహించినప్పుడు తాను ఒక్కడే చూపే పనితీరు కంటే పదిరెట్లు ఎక్కువ ఫలితాలను ఆ ఉద్యోగి రాబట్టగలుగుతాడు. చైతన్య చేసిందిదే! 

వివిధ నైపుణ్యాలున్న వ్యక్తులు కొందరు సమష్టి లక్ష్యసాధనకు కలిసి పనిచేయడమే టీమ్‌ వర్క్‌. ఇలాంటి వైవిధ్య నైపుణ్యాలున్న బృంద సభ్యులకు నాయకత్వం వహించడమే లీమ్‌ లీడర్‌షిప్‌ (బృంద నాయకత్వం).  

జట్టు నిర్మాణంతో లాభాలేంటి?  

ఉత్పత్తి పెరుగుదల: బృంద నిర్మాణానికీ ఉత్పత్తికీ నేరుగా సంబంధం వుంది. ఒక కొత్త ఉత్పత్తి రావాలన్నా లేదా ఒక ఉత్పత్తిని మెరుగుపరచాలన్నా బృందంగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది.  

అవరోధాల అధిగమనం: ఒక్కరే పనిచేస్తుంటే ఏదైనా సమస్య ఎదురైతే అక్కడితో ఆగిపోవాల్సివస్తుంది. అదే బృందంలో భాగస్వాములుగా పనిచేస్తున్నప్పుడు సమస్యకు బృంద సభ్యుల్లో మరొకరు పరిష్కారం చూపగలుగుతారు. ఫలితంగా ప్రాజెక్టు ముందుకు కదులుతుంది.  

క్రమశిక్షణ: ఒంటరిగా పనిచేస్తున్నప్పుడు సహజంగానే బాధ్యత   కొరవడుతుంది. అదే బృందంలో భాగంగా పనిచేస్తున్నప్పుడు మిగతావారు గమనిస్తుండటం, తాము పూర్తిచేసే పనికోసం మరొక బృందం సభ్యుడు నిరీక్షిస్తుండటం వల్ల అసంకల్పితంగా క్రమశిక్షణ అలవడుతుంది. పనిచేయాలన్న ఉత్సాహం నిరంతరం అంతర్గతంగా జ్వలిస్తుంటుంది.  

ఒత్తిడి తగ్గుదల: ఒంటరిగా పనిచేయడం కంటే టీమ్‌లో ఒకరిగా పనిచేయడం వల్ల ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వివిధ పరిశీలనలు   వెల్లడించాయి. ప్రాజెక్టు డెడ్‌లైన్స్‌ను అందరూ సమష్టిగా చేరుకోవాలని కృషి చేస్తున్నందువల్ల ఒకరిపైనే భారం పడదు. 

టీమ్‌వర్క్‌ వల్లే విజయాలు 

గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు, ఘనమైన కంపెనీల వెనుక వున్నది టీమ్‌ వర్కే. బృందం పనితీరు లేకపోతే తమ ఉనికి లేదన్నదే ప్రసిద్ధ వ్యాపారవేత్తల స్థూలాభిప్రాయం.  

అజిం ప్రేమ్‌జీ: తాతల కాలంనాటి నూనెల మిల్లును వారసత్వంగా పుచ్చుకొని నాలుగు దశాబ్దాల్లో ప్రపంచస్థాయి ఐటీ కంపెనీ సహా బలమైన గ్రూపును నిర్మించిన విప్రో ప్రేమ్‌జీకి ఒక సంవత్సరం ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ టుడే ‘బిజినెస్‌ న్యూస్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించింది. ఆ అవార్డు అందుకునే రోజున దేశంలోని ప్రముఖ దినపత్రికలో ఫుల్‌ పేజీ ప్రకటనను విప్రో విడుదల చేసింది. ఆ పేజీలో వేలాది ఉద్యోగుల పేర్లు వరుసనే చిన్న అక్షరాలతో వుండగా మధ్యలో ఈ అవార్డు వీరందరి కృషి ఫలితం అన్న వాక్యం పాఠకులను ఆకర్షించింది. తాను నిర్మించిన టీమ్‌వర్క్‌ కారణంగానే ఈ అవార్డు లభించిందని చెప్పడం ప్రేమ్‌జీ అభిమతం.  

ఇన్ఫోసిస్‌-నారాయణమూర్తి: 1981లో ఇన్ఫోసిస్‌ కంపెనీని నారాయణమూర్తి ఒక్కరే ప్రారంభించలేదు. తనతో సమాన ప్రతిభగల నందన్‌ నిలేకని, ఎస్‌.డి. శిబులాల్, క్రిస్‌ గోపాలకృష్ణ, అశోక్‌ అరోరా, కె. దినేష్‌ ఎన్‌.ఎస్‌. రాఘవన్‌లను కలుపుకొని ఒక బృందంగా కంపెనీ ప్రారంభించారు. ప్రపంచంలోని 12 మంది ప్రసిద్ధ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఫార్చ్యూన్‌ పత్రిక ద్వారా గుర్తింపు పొందిన నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌ విజయం తన బృందానిదనే ఇప్పటికీ చెబుతుంటారు.  

బృంద నిర్మాణ నైపుణ్యం పెంచుకోవాలంటే?  

ఒక్కరిగా అన్నీ చేయగలనన్న భ్రమ కంటే సమష్టిగా ఏదైనా సాధించగలమని నమ్మాలి. స్వీయ బలం, స్వీయ ప్రతిభపై నమ్మకం ఉండటంతోపాటు తోటివారి సామర్థ్యాలపై కూడా గౌరవం ఉండాలి. సహచరుల ప్రతిభా పాటవాలను గుర్తించి ఉమ్మడి లక్ష్యసాధనకు ఉపయోగించుకునే సామర్థ్యం పెంచుకోవాలి.  

నిష్పాక్షిక ఎంపిక: బృంద సభ్యులను యాజమాన్యమే ఎంపిక చేసి ఇచ్చినప్పుడు సభ్యుల బలాబలాలను నిశితంగా పరిశీలించి తగిన విధంగా మలచుకోవాలి. అదే  సభ్యులను ఎంచుకునే స్వేచ్ఛను ఉద్యోగికి ఇస్తే నిష్పాక్షికంగా ఎంపిక చేసుకోవాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కంపెనీ అవసరాల రీత్యా ఎంపిక సాగాలి.  

భావ వ్యక్తీకరణే జీవనాడి: బృందం పటిష్ఠ్టంగా నడవాలంటే సభ్యులందరి మధ్య భావ వ్యక్తీకరణే పునాది. అందరూ చెప్పేది వినాలి. అందరికీ అన్ని ముఖ్య విషయాలూ పంచాలి. లక్ష్యానికి సంబంధించి అందరిలో స్పష్టత రావడానికి భావ వ్యక్తీకరణే సాధనంగా వినియోగించుకోవాలి. సభ్యులు ఏ విషయాన్నయినా స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే వాతావరణం ఏర్పరచాలి. అందరి అభిప్రాయాలకూ విలువ ఉంటుందన్న భావన ఏర్పరచగలగాలి.  

గెలుపు అందరిదీ: బృంద నిర్మాణ సారథిగా సభ్యులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ప్రాజెక్టు నిర్వహణలో మొత్తం బృందం గెలవాలన్న దిశగా కృషి చేయాలే తప్ప నాయకుడిగా తనదే పైచేయి కావాలన్న దృక్పథం ఉండకూడదు. నువ్వు గెలువు...నేను గెలుస్తా (విన్‌-విన్‌ రిలేషన్‌) అనే సూత్రంపై బృందం పనిచేసేలా చూడాల్సిన బాధ్యత బృంద సారథిదే!

Posted Date: 03-05-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం