• facebook
  • whatsapp
  • telegram

మెరిపించే మెలకువలు

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు 

కళాశాలలో, తర్వాత కెరియర్‌లో... మొత్తంగా జీవితంలో అద్భుతంగా ఎదగాలంటే.. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితమైపోతే సరిపోదు. అంతకుమించినవెన్నో నేర్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి జీవన నైపుణ్యాలు (లైఫ్‌ స్కిల్స్‌). బతుకు దెరువుతో పాటు మెరుగైన జీవితానికి పునాది వేసే ఈ నైపుణ్యాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా అధ్యయనం చేసింది. పది నైపుణ్యాలు అవసరమని తేల్చింది. వీటిని ఎంత త్వరగా నేర్చుకుని, అవగాహన ఏర్పరచుకుంటే అంత త్వరగా జీవితంలో రాణించవచ్చు! 

బాహ్య ప్రపంచంలో మనకు ఇద్దరు విజేతలు కనిపిస్తుంటారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించినవారూ; పెద్దగా చదువుకోకపోయినా ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నవారూ.మొదటి కోవకు చెందిన బాగా చదువుకున్నవారు చాలామంది ఉండగా అతికొద్ది మంది మాత్రమే విజేతలుగా నిలుస్తుండటాన్ని గమనిస్తుంటాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మంచి చదువులు చదువుకుని విజేతగా నిలిచిన వ్యక్తి సహాధ్యాయులందరికీ అంతటి విజయం సిద్ధించదు. వీటిని సునిశితంగా పరిశీలించినపుడు జీవితంలో నెగ్గడానికి అవసరమైన లక్షణాలు మరేవో అగోచరంగా ఉన్నాయని అనిపించక మానదు.

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకుని గూగుల్‌లో ఉన్నతపీఠంపై ఉన్న సుందర్‌ పిచాయ్‌ నుంచి నాటి తరంలో పెద్దగా చదువుకోకపోయినా అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం సృష్టించిన ధీరూబాయి అంబానీ వరకు వీరి విజయాల వెనుక అదృశ్య లక్షణాలేవో నిక్షిప్తమై ఉన్నాయని ప్రస్ఫుటమవుతోంది.

జీవిత పరుగులో అగ్రభాగాన నిలువగలగడం లలాట లిఖితమని నమ్మే రోజులు పోయాయి. ఈ జగత్తులో ఓ మారుమూల మనిషికి ఒక విజయం సాధ్యమైతే అదే పనిని మరొకరు అదే మార్గాన్ని అనుసరించడం ద్వారా సాధించవచ్చని విశ్వసించి నిరూపిస్తున్న శకమిది. అందుకే విజయ సాధకులు నడిచిన దారిని దశాబ్దాల పర్యంతం అధ్యయనం చేసి, అసలు రహస్యాలను ఒడిసి పట్టుకున్నారు. వాటినే ప్రపంచం మొత్తానికి పరిచయం చేశారు. అవే.. జీవన నైపుణ్యాలు!

వేర్వేరు దశల్లో విభిన్న నైపుణ్యాలు

నైపుణ్యాలు అన్నపుడు వేర్వేరు దశల్లో అవసరమైన కౌశలాలు ప్రస్తావనకు వస్తాయి. విద్యార్థి దశలో అవసరమైన నైపుణ్యాలు వేరు. ఉద్యోగ సాధన- ఉద్యోగ పర్వంలో అక్కరకు వచ్చేవి వేరు. విద్యార్థిగా ఉన్నపుడు లక్ష్యం చదువులో రాణించడమే. కాబట్టి ఆ దశలో అనుసరించాల్సివని- స్టడీ స్కిల్స్‌. అలాగే ఉద్యోగ సాధన- ఉద్యోగ పర్వంలో రాణించడానికి దోహదపడేవి సాఫ్ట్‌స్కిల్స్‌. జీవిత పర్యంతం మనల్ని గెలుపుబాటలో నడిపించే జీవన నైపుణ్యాలు వేరు. 

అయితే అన్నీ లక్ష్యాన్ని సులభతరం చేసేవే. కాబట్టి, మూడు దశల్లోనూ కొన్ని ఉమ్మడిగా ఉంటాయి. ఉదాహరణకు- మనిషికి మాత్రమే సొంతమై, తనకు అన్నివేళలా అనివార్యమైన నైపుణ్యం- భావ వ్యక్తీకరణ. ఇది విద్యార్థి, ఉద్యోగి దశల్లోనూ అవసరమే. అలాగే ఇది జీవిత పర్యంతం ఉండాల్సిన జీవన నైపుణ్యం. ఈ విజ్ఞాన ఆధారిత సమాజంలో జీవించేందుకు ఏదో ఒక నైపుణ్యం కావాలి. లేదా నైపుణ్యాల సమాహారం అవసరం. 

ఎవరికైనా అవసరమైన జీవన నైపుణ్యాలను నాలుగు విభాగాలుగా చెప్పవచ్చు.

స్వీయ అవగాహన (సెల్ఫ్‌ అవేర్‌నెస్‌)

నిన్ను నువ్వు తెలుసుకో (నో దై సెల్ఫ్‌) అని గ్రీకు తత్వవేత్తలు సూచించారు. మన గురించి మనం తెలుసుకోవటమేమిటన్న సందేహం కలుగుతుంది. మనదేహంలో అంతుపట్టని వింతలెన్ని ఉన్నాయో మన మస్తిష్కంలోనూ శోధించాల్సినవెన్నో ఉన్నాయి. నిష్పాక్షికంగా మనల్ని మనం అర్థం చేసుకోవడం అంటే ఏ సందర్భంలో నిరాశ చెందుతాం, ఎప్పుడు ఉత్తేజితులం అవుతాం, బాహ్య ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులకు ఎలా స్పందిస్తున్నాం, అసలు మార్పును ఎలా స్వీకరిస్తుంటాం, పురోగమన పథంలో నడిచేందుకు మనకున్న క్రమశిక్షణ ఎలాంటిది, ఒత్తిడి అనివార్యమైన ప్రస్తుత కాలంలో దాన్నెలా నియంత్రించుకుంటున్నాం, మన ప్రవర్తన, వివిధ సందర్భాల్లో అనుసరించే విలువలేమిటి? మన బలాలూ బలహీనతలేంటి?.. ఈ స్వీయ విశ్లేషణ అవసరం. జీవన నైపుణ్యాల్లో ఒకటైన ఈ స్వీయ అవగాహనతో ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరినవారెందరో ఉన్నారు.

భావవ్యక్తీకరణ- ఆలోచన (కమ్యూనికేటింగ్‌ థింకింగ్‌)

మన ఆలోచనా సరళి కూడా జీవన నైపుణ్యాల్లో భాగమే. మన మెదడు ఆలోచనల పుట్ట. మనం ఏ పనీ చేయని సమయం ఉంటుందేమో కానీ మెదడులోకి ఆలోచనలు రాని క్షణమంటూ ఉండదు. మనిషి మెదడులోకి రోజుకు 6400 ఆలోచనలు వచ్చిపోతుంటాయని నూతన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆలోచనలను అనుకున్న లక్ష్యదిశగా ఫలాత్మకంగా మార్చుకోగలగడం జీవన నైపుణ్యం. ఉత్తమ నిర్ణయ ప్రక్రియ (డెసిషన్‌ మేకింగ్‌), సమస్యా పరిష్కారం (ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌)ల దిశగా ఆలోచనలను మళ్లించడం చక్కని జీవన నైపుణ్యం. 

ఉద్వేగాలు (ఎమోషన్స్‌)

స్వీయ ఉద్వేగాల నియంత్రణ, సానుకూల దిశగా వీటి వినియోగం కూడా జీవన నైపుణ్యమే! మనలో చెలరేగే ఉద్వేగాల వివిధ దశలను అర్థం చేసుకోవటం, వాటిపై నియంత్రణ సాధించటం విజయాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కోపం, భయం, ప్రేమ లాంటి స్వీయ ఉద్వేగాలను అర్థం చేసుకోవడœం- ఆ సమయంలో పరిస్థితులను సానుకూలంగా మలచుకోవడానికి దోహదం చేస్తుంది.

తోటివారితో అనుసంధానమైనవి (రిలేటెడ్‌ టూ అదర్స్‌)

ఏకాకిగా పనిచేయటం ఒకదారి అయితే, నలుగురినీ కలుపుకుని పనిచేయడం మరొక దారి. నేటి కార్పొరేట్‌ యుగంలో బృంద కూర్పు (టీమ్‌ బిల్డింగ్‌), బృంద నాయకత్వం (టీమ్‌ లీడర్‌షిప్‌), ప్రభావశీల భావ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణలో అవరోధాలను తొలగించడం లాంటి సామర్థ్యాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిని కార్పొరేట్‌ ప్రపంచంలో సాఫ్ట్‌స్కిల్స్‌గా పరిగణిస్తున్నప్పటికీ జీవన పథంలో ఈ నైపుణ్యాలు ఏర్పరచుకున్నవారికి విభిన్న కోణాల్లో విజయాలు సిద్ధిస్తున్నాయి. ఈ విభాగాల్లో ఇరవైకి పైగా నైపుణ్యాలు విద్యార్థుల, ఉద్యోగుల బతుకుబాటను సులభతరం చేస్తాయి. సాధన చేసి ప్రావీణ్యం సాధిస్తే ఉన్నత స్థాయికి చేరుస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసిన జీవన నైపుణ్యాలు

1. సృజనాత్మక ఆలోచన 

2. విశ్లేషణాత్మక ఆలోచన 

3. భావ వ్యక్తీకరణ 

4. ఇతరులతో సంభాషణ 

5. స్వీయ అవగాహన 

6. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలగడం 

7. స్థిరంగా నిర్ణయాలపై నిలబడటం 

8. అందరి పట్ల సమభావం 

9. ఉద్వేగాలను తట్టుకోగలడం 

10. ఒత్తిడిని అధిగమించడం.

ఒక ఆర్కిటెక్ట్‌ గానో లేదా ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గానో, ఒక అధ్యాపకుడిగానో లేదా మరో వృత్తిలోనో రాణించాలంటే ఆయా వృత్తులకు సంబంధించిన నైపుణ్యాలు అవసరం. చదువు ద్వారానో, అనుభవం ద్వారానో వీటిని అలవరచుకుని జీవన యానం సాగిస్తాం. అయితే జీవన నైపుణ్యాలు ఏమిటి అన్న సందేహం కలుగుతుంది. వృత్తి నైపుణ్యంతో ఒక రంగంలో గమనం సాగిస్తున్నపుడు ఆ రంగంలో రాణించేందుకూ, ఉన్నత స్థాయికి చేరేందుకు జీవన నైపుణ్యాలు (లైఫ్‌ స్కిల్స్‌) తోడ్పడతాయి.

 

Posted Date: 04-01-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం