• facebook
  • whatsapp
  • telegram

ఎదిగేందుకు రక్ష.. ఈ దక్షత! 

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

నేటి ఆధునిక కార్పొరేట్‌ ఐటీ కార్యకలాపాల్లో మల్టీటాస్కింగ్‌ అనివార్యమవుతోంది. కెరియర్‌లో ఎదిగేందుకు ఈ నైపుణ్యం సోపానంగా తోడ్పడుతుంది. నిత్యజీవితంలోనూ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు అక్కరకు వస్తోంది. బహువిధాలా ఉపయోగపడే బహుముఖ   కార్యదక్షత అలవరచుకోవడమే భవితకు రక్ష! 

రవి పొలంగట్టున కూర్చుని లాప్‌టాప్‌ ఒళ్లో పెట్టుకుని ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఒక ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేస్తున్నాడు. ఎరువుల కోసం పట్టణానికి వెళ్లిన తండ్రి వచ్చేలోపు కలుపు మొక్కలు తీసే పని పూర్తిచేయాలి. మరోపక్క వారంలో ఉన్న ఒక ఐటీ సంస్థ ఆఫ్‌ క్యాంపస్‌ సెలక్షన్‌ టెస్ట్‌కి సన్నద్ధమవుతున్నాడు. 

బీటెక్‌ పూర్తిచేసిన రవి గ్రామంలో చిన్నకారు రైతు అయిన తండ్రికి సాయం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే రెండు గంటలు కలుపు మొక్కలు తీస్తే.. మరో రెండు గంటలు టెస్ట్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈలోపు పక్కపొలం రైతు వచ్చి బ్యాంకులో తీసుకున్న రుణం తాలూకు వడ్డీ లెక్కలు అడుగుతుంటే వివరించే ప్రయత్నం చేస్తున్నాడు.

రవి చేస్తున్నది- మల్టీటాస్కింగ్‌ (బహుముఖ కార్యసాధన). ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేసే ప్రయత్నాన్ని మల్టీటాస్కింగ్‌ అంటారు. మనందరం కూడా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు దీన్ని చేయక తప్పదు. కార్పొరేట్‌ కంపెనీల్లో సీనియర్‌ స్థాయికి వెళ్లాక రోజువారీ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో మల్టీ టాస్కింగ్‌ అవసరమవుతోంది. అంతేనా? నిజజీవితంలోనూ వివిధ సందర్భాల్లో ఈ సామర్థ్యాన్ని చూపాల్సి వస్తోంది. అందుకే మల్టీటాస్కింగ్‌ ఒక జీవన నైపుణ్యంగా ఇటీవలి కాలంలో ముందుకొచ్చింది!

ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగలిగే సామర్థ్యమే బహుముఖ కార్యసాధన. ఒకే సమయంలో రెండు పనులు సమర్థంగా చేయగలిగితే ఒక పని నుంచి మరొక పనికి దృష్టిని మరల్చి ఏకాగ్రత సాధించగల నైపుణ్యం అలవడినట్టు పరిగణిస్తారు. ఇలా రెండు పనులే కాక అవసరమైతే మరిన్ని పనులు ఒకే సమయంలో చక్కబెట్టగలిగే సామర్థ్యం సముపార్జించినట్లు భావించవచ్చు. ఏ వృత్తిలోనైనా కార్యసాధన బహుముఖ పనులపై ఆధారపడి ఉన్నందున ఈ నైపుణ్యం అనివార్యం అవుతోంది.

బహుముఖ కార్యదక్షులు వీరే

ప్రపంచ ధనవంతుల జాబితాను ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించినప్పుడల్లా వీరికి ఇంతటి సంపద ఎలా సమకూరిందని ఆశ్చర్యపడటం కంటే దీని వెనుకగల బహుముఖ కార్యసాధన నైపుణ్యాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఫార్చూన్‌ 500 సంస్థల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ. ఆసియా ఖండంలోనే రెండో ధనవంతుడిగా, ప్రపంచ శ్రీమంతుల్లో 14వ స్థానంలో నిలిచారు. పెట్రోలియం, ఆయిల్, గ్యాస్, టెలికాం, రిటైల్‌ వంటి వైవిధ్య రంగాలకు విస్తరణ జరిగిన రిలయన్స్‌ అధినేతగా ముఖేష్‌ అంబానీ నిత్యవృత్తి జీవితంలో ప్రతి గంటా మల్టీ టాస్కింగ్‌ చేస్తుంటారు. ఒకే సమయంలో వేర్వేరు రంగాల పనులను చేయగల ప్రజ్ఞ, నైపుణ్యం అలవరచుకున్నందుకే గ్రూపును 88 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లగలిగారు. ప్రత్యక్షంగా రెండు లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నారు.

ప్రపంచ బాక్సింగ్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌ ముగ్గురు పిల్లల తల్లి. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ పోటీల్లో ప్రతిదానిలోనూ గెలిచిన మేరీకోమ్‌ గృహిణిగా, రాజకీయవేత్తగా, రాజ్యసభ సభ్యురాలిగా మల్టీటాస్కింగ్‌ చేసి ‘మేగ్నిఫిషియంట్‌ మేరీకోమ్‌’గా పేరు గడించారు.

భారతీయ మహిళలకు మించిన మల్టీటాస్కింగ్‌ మరొకరు చేయలేరని అంటుంటారు.ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూ మరోపక్క ఇంటి బాధ్యతలను గృహిణిగా చక్కదిద్దే స్త్రీమూర్తులు బహుముఖ కార్యదక్షతకు ప్రత్యక్ష నిదర్శనం. 

ఇలా అలవరచుకోవచ్చు

బహుముఖ కార్యదక్షతలు జన్మతః సిద్ధించే లక్షణాలేమీ కాదు. నిత్యజీవన పథంలో అలుపెరగని కృషి చేస్తున్నపుడు వివిధ సందర్భాలు ఈ నైపుణ్య అవసరాన్ని తెలియజేస్తుంటాయి. వివేకంతో సాధన చేస్తే మార్గాలున్నాయి.

1. పరిమితులు తెలుసుకోవడం: మల్టీటాస్కింగ్‌ తొలి అడుగు వ్యక్తిగత సామర్థ్య పరిమితులను గుర్తెరగడం. మనకుండే సమయం, మనకుండే వనరులు, వ్యక్తిత్వంలోని బలాలు- బలహీనతలు వాస్తవ దృక్పథంతో పరిగణనలోకి తీసుకుంటూ ఎన్ని కార్యాలపై పనిచేయగలమో నిర్ణయించుకోవాలి. మల్టీటాస్కింగ్‌ విషయంలో ‘నేల విడిచి సాము’ చేయరాదు.

2. ప్రాధాన్య క్రమం: బహుముఖ కార్యదక్షత అలవరచుకోవాలంటే చేయవలసిన పనులకు ప్రాధాన్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి. అంటే ఏది ముందు? ఏది తర్వాత? అనేదానిపై స్పష్టత ఉండాలి. అత్యవసరమైనవి (అర్జెంట్‌), ముఖ్యమైనవి (ఇంపార్టెంట్‌), సాధారణమైనవి (జనరల్‌) అన్న మూడు రకాలుగా వర్గీకరణ చేసుకుని ఏకకాలంలో ఒక అత్యవసరం, ఒక ముఖ్యమైన, మరో సాధారణ పనిని పూర్తిచేసేందుకు సాధన చేయాలి.

3. ఏకాగ్రత పెంచుకోవడం: మల్టీటాస్కింగ్‌ మూలకేంద్రం ఏకాగ్రత. అన్ని పనులూ ఒకేసారి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాదు. ఎంత ఏకాగ్రతతో చేయగలుగుతున్నామన్నది ముఖ్యం. అందుకే ఒకేసారి ఒకదానికంటే ఎక్కువ పనులు చేయాలనుకున్నపుడు ఏకాగ్రత చెదిరిపోకుండా చూసుకోవడం అవసరం.

4. సమయ విభజన: మల్టీటాస్కింగ్‌ ప్రభావవంతంగా జరగాలంటే సమయాన్ని వివిధ బ్లాకులుగా విభజించుకోవచ్చు. ఎనిమిది గంటల్లో నాలుగు పనులు పూర్తి చేయాలనుకున్నపుడు రెండు గంటల చొప్పున నాలుగు బ్లాకులుగా విభజించుకోవాలి. ఆ రోజుకు నాలుగు కార్యాలను పూర్తిచేసేందుకు ఒక్కోదానికి రెండు గంటల వ్యవధి నిర్దేశించుకోవాలి. దీనివల్ల చేయాలనుకుంటున్న పనుల్లో వైవిధ్యం ఉంటుంది. ఆ రోజుకు నాలుగు కార్యాలు పూర్తవుతాయి.

5. ఒకే తరహా పనులు ఒకేసారి: మనం చేయాల్సిన పనులన్నింటినీ కేటగిరీవారీగా వర్గీకరించుకోవడం మల్టీటాస్కింగ్‌కు అవసరం. అంటే మనం చక్కబెట్టాలనుకుంటున్న పనుల్లో వృత్తిపరమైనవి, వ్యక్తిగతమైనవి, కుటుంబానికి సంబంధించినవి.. ఇలా అవి ఏ తరహాకు చెందినవైతే ఆ వర్గీకరణ కిందకు తీసుకెళ్లి వాటి సాధనకు ప్రయత్నించడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి కార్యసిద్ధి జరుగుతుంది. 

Posted Date: 08-02-2021


 

బహుముఖ కార్యసాధన

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం