• facebook
  • whatsapp
  • telegram

నిల‌బెడుతుంది.. నిబ‌ద్ధ‌త‌!

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

నేటి ఐటీ, కార్పొరేట్‌ కంపెనీల్లో లక్షల మంది యువత పనిచేస్తుండగా పాలలో నీళ్లను వేరుచేసి చూపే లాక్టోమీటర్‌ మాదిరిగా కంపెనీకి విలువ (అసెట్‌)గా నిలిపే లక్షణమే వర్క్‌ ఎథిక్స్‌. కొంతకాలం దీన్ని మనిషి-మనిషికీ మారే వ్యక్తిత్వ లక్షణంగా భావించినప్పటికీ కెరియర్‌లో రాణించేందుకు సోపానంగా దోహదపడుతున్నందున నైపుణ్యంగా...జీవన సామర్థ్యంగా పరిగణిస్తున్నారు.  

ఒక టాస్క్‌ని ఒక ఉద్యోగికి అప్పగించినప్పుడు దీనిని సానుకూలంగా స్వీకరించడం, నిర్దేశించిన వ్యవధిలో పూర్తిచేసేందుకు తగిన క్రమశిక్షణ చూపడం, మధ్యలో ఎదురయ్యే సవాళ్లను సీనియర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకోవడం, టాస్క్‌ అవసరం రీత్యా వ్యక్తిగత అవసరాలు, ప్రాథమ్యాలను మార్చుకోవడం... అంతిమంగా విజయవంతంగా నిర్దేశిత సమయంలో నాణ్యతతో పూర్తి చేయగలగడం. ఈ దశలన్నింటిలో ఉద్యోగి చూపించే నిబద్ధతే- వర్క్‌ ఎథిక్స్‌. సాధారణ ఉద్యోగినీ, ఉత్తమ ఉద్యోగినీ వేరు చేసి చూపగలిగే గీటురాయి ఇదే!   

పని వాతావరణం (వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌)లో కొత్త ఉద్యోగిగా ప్రవేశించినా దీన్ని అర్ధం చేసుకొని... ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా అతికొద్దిమంది ఉన్నతస్థానాలకు ఎదిగిపోతుంటారు. చాలామంది దీన్ని అర్థం చేసుకోలేక నిబిడాశ్చర్యంలో మునిగిపోతుంటారు. వీలైతే యాజమాన్యాలకు పక్షపాత వైఖరిని అంటించి సంతృప్తి చెందుతుంటారు.  

ఎలా అలవర్చుకోవాలి?  

విలువలు... నైతిక వర్తనల నుంచి వచ్చిందే పని వాతావరణంలో నైతిక వర్తన (వర్క్‌ ఎథిక్స్‌). ఇది కొంతవరకు తల్లిదండ్రుల పెంపకం...కౌమారదశ (టీనేజ్‌) వరకు ఎదురైన అనుభవాలు, పాఠశాల వాతావరణంపై ఆధారపడి వున్నప్పటికీ కెరియర్‌లో ఉన్నతికి కారణమని గుర్తించినప్పుడు ఈ లక్షణాలను సాధనతో పెంపొందించుకోవచ్చు. ఇందుకు ఉపకరించే మార్గాలు-

పెయిన్‌-ప్లెజర్‌: స్వల్పకాల- దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ‘పెయిన్‌-ప్లెజర్‌’ సిద్ధాంతాన్ని చెబుతుంటారు. స్వల్పకాలపు బాధ ఓర్చుకోగలిగితే దీర్ఘకాలపు ఆనందం సొంతమవుతుంది. కానీ స్వల్పకాలపు ఆనందం కోసం ప్రలోభపడితే దీర్హకాలం బాధ  అనుభవించాల్సివుంటుంది. ఒక టీమ్‌గా టాస్క్‌ను నిర్వహిస్తున్నప్పుడు కీలక సమయంలో ఏదో ఒక సాకు చెప్పి సెలవు పెట్టేస్తే ఆపని తప్పిపోయి తాత్కాలిక ఆనందం కలుగవచ్చు. కానీ దీర్ఘకాల ప్రయోజనం కలిగించే మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అదే ఆ కష్టాన్ని తట్టుకోగలిగితే దీర్హకాల ప్రయోజనం కలిగించే పదోన్నతులూ, ప్రోత్సాహకాలూ లభించవచ్చు.  

పుస్తక పఠనం: పుస్తక పఠనం మెదడు పొరల్లోకి వెళ్లి చైతన్యం కలిగిస్తుంది. వ్యక్తిగత ఆలోచనా సరళి, దృక్పథాల్లో మార్పు తీసుకువస్తుంది. అత్యున్నత జీవన విలువలను పాటించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగినవారి జీవితగాథలు స్ఫూర్తిని కలిగిస్తాయి. పఠనం ఇప్పుడు పుస్తకరూపంలోనే కాదు, వివిధ రూపాల్లో అంతర్జాల వేదికపై లభిస్తోంది. రూపం మారినా, అక్షరం, పదం, వాక్యం కలిగించే ఉత్తేజాన్ని అందుబాటులో ఉండే మార్గాల ద్వారా సొంతం చేసుకోవచ్చు.  

రోల్‌మోడల్‌:  ఊహాజగత్తులో కదలాడే కథానాయకులకంటే నిజ జీవితంలో పరిశీలనకూ, స్ఫూర్తి పొందేందుకూ ఒక నాయకుడు ఉండటంలో తప్పు లేదు. ఎదుగుతున్న రంగంలో కృషిచేస్తున్నప్పుడు అదే రంగంలో మైలురాళ్లు సృష్టించిన నాయకులను ఆదర్శంగా మనోఫలకంపై ప్రతిష్ఠించుకొని వారు అనుసరించిన విలువలు, నైతిక వర్తనను తెలుసుకోవడం ద్వారా ఉత్తేజం పొందవచ్చు. ఇది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుంది.  

దీర్ఘ దృష్టి:  జీవితాన్ని ఉద్యోగం, శాలరీ ప్యాకేజీల్లాంటివాటికి పరిమితమైన హ్రస్వ దృష్టితో చూడకుండా కొన్ని దశాబ్దాల ముందుకు చూడగలిగినప్పుడు ఉన్నత విలువలకు పునాదులు ఏర్పడతాయి. 30-40 ఏళ్ల తర్వాత నేనెలా ఉండబోతున్నాను, నా ఇమేజ్‌ ఎలా ఉండబోతోంది? అన్న స్పృహ ఏర్పడితే పాక్షిక దృష్టి దరికి రాదు. ఉన్నత ఆశయాలవైపు దృష్టి మరలుతుంది. పని వాతావరణంలో నైతిక వర్తన నైపుణ్యం అప్రయత్నంగా ఏర్పడుతుంది.  

వర్క్‌ ఎథిక్స్‌ అనేది యువతకు మానసిక స్థైర్యాన్నిచ్చే అదృశ్య శక్తి. దీన్ని అలవరచుకోగలిగితే, ఇదే శక్తిమంతమైన నైపుణ్యంగా మారి ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాణించేలా చేయగలుగుతుంది!  

వీరి తీరేవేరు:  ఉన్నతస్థాయి కంపెనీల్లో వర్క్‌ ఎథిక్స్‌ ఉద్యోగుల్లో మాత్రమే ఉండాలని మేనేజ్‌మెంట్‌ కోరుకోదు. ఉన్నతస్థాయిలో యాజమాన్యం అనుసరించి చూపిస్తుంటుంది. 

విప్రో సంస్థల కార్యనిర్వాహక నేతగా అజిం ప్రేమ్‌జీ ఉన్నప్పుడు అప్పుడప్పుడూ తన గ్రూపు సంస్థల సీఈఓల సమావేశాలు నిర్వహించేవారు. తన అధ్యక్షతన సమావేశం ముగిశాక ప్రేమ్‌జీ కార్యదర్శి సీఈఓలందరికీ ఒక ఫీడ్‌ బ్యాక్‌ కాగితం ఇచ్చి ‘ప్రస్తుతం జరిగిన సమావేశం ఫలవంతమైనట్టు భావిస్తున్నారా? సంస్థ అధినేత సూచనలు ఆమోదయోగ్యంగా ఉన్నాయా?’.. అంటూ కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయమనేవారు. తమ పేరు వ్యక్తం చేయాల్సిన అవసరంలేనందున సీఈఓలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు రాసేవారు. వీటి ఆధారంగా ప్రేమ్‌జీ తన పనితీరులో మార్పులు చేసుకునేవారు. సంస్థ అధినేతనే ఇంతటి వర్క్‌ ఎథిÅక్స్‌ని చూసినప్పుడు ఉద్యోగులందరిపై ఈ ప్రభావం పడకుండా ఉంటుందా? 

39 ఏళ్ల రోష్ని నాడార్‌ ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తండ్రి శివనాడార్‌ నుంచి వర్క్‌ ఎథిక్స్‌ను అందిపుచ్చుకున్నారు. తమ సంస్థ ఫౌండేషన్‌ నుంచి ప్రారంభించిన ‘విద్యా గ్యాన్‌’ ద్వారా యూనివర్సిటీ, కాలేజీ, స్కూల్‌ స్థాయిలో చదివే ప్రతిభగల పేద విద్యార్థుల్లో నైపుణ్యాలను పొదిగి సానపట్టాలన్న నిశ్చయంతో రోష్ని పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎప్పటికైనా దేశానికి ఒక ప్రధానిని అందించాలన్నది తన ఆశయంగా ఆమె చెబుతారు. ఇంతటి ఉన్నతాశయంతో పనిచేసే అధినేత సారథ్యంలో పనిచేసే ఉద్యోగులు మరెంతగా ప్రభావితమవుతారు? 

Posted Date: 15-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం