• facebook
  • whatsapp
  • telegram

అద్భుతాలు చేసే ఆశావహ దృక్పథం

ఉన్నత విద్యాభ్యాసంలో, ఉద్యోగ సాధనలో 'సాఫ్ట్‌స్కిల్స్' ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నైపుణ్యాలున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు తేలిగ్గా దొరుకుతాయి; ఉద్యోగులకైతే వెంటవెంటనే పదోన్నతులు లభిస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో ఈ కీలక నైపుణ్యాలపై విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది! ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్న సాఫ్ట్‌స్కిల్స్‌ను స్థూలంగా 10 రకాలుగా చెప్పవచ్చు.

1. ఆశావహ (సానుకూల) దృక్పథం

2. భావ వ్యక్తీకరణ

3. సంక్షోభ నిర్వహణ, సమస్యా పరిష్కారం

4. సమయ నిర్వహణ

5. బృందాల్లో పని చేయటం

6. ఆత్మ స్థైర్యం 

7. విమర్శను స్వీకరించటం

8. మార్పును అనుసరించటం

9. ఒత్తిడిని తట్టుకోవడం

10. ఉన్నత విలువలు

   వీటిలో మొదటిదైన 'ఆశావహ దృక్పథం గురించి వివరంగా పరిశీలిద్దాం. 

   మన స్వభావం మనల్నే కాకుండా, ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మనకున్న ఆశావహ (positive) / ప్రతికూల (negative) దృక్పథం మీద ఆధారపడుతుంది. ప్రపంచాన్ని పరిశీలించే తీరులోనే ఎవరి దృక్పథమైనా వ్యక్తమవుతుంది. అనుకూల విషయాలమీద దృష్టి సారిస్తే... ఆశావహ (సానుకూల) దృక్పథం ఉన్నట్టు. 

   స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం లాంటి లక్షణాలతో ఈ దృక్పథం ప్రారంభమవుతుంది. ఇక- ప్రతికూల విషయాలకు ప్రాధాన్యమిస్తే ప్రతికూల దృక్పథం ఉన్నట్టు! ప్రతికూల స్వభావం ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆ వ్యక్తినే కాకుండా అతడి చుట్టుపక్కలవారిని కూడా ఉదాసీన వైఖరిలోకి నెట్టివేస్తాయి. ఇలాంటి వ్యక్తుల నుంచి మిగతావారు తొలగిపోవటానికి ఇష్టపడతారు. 

  ఇదే రకంగా... సానుకూల దృక్పథం- ఇతరుల్లోని శక్తియుక్తులను ప్రేరేపిస్తుంది. ఈ స్వభావమున్న వ్యక్తుల ప్రభావం వల్ల ఎదుటివారు కూడా సానుకూల దృక్పథంతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆలోచనా విధానం ఉన్నవారు ఇతరులను త్వరగా ఆకర్షించగలుగుతారు. ఈ దృక్పథం మంచి ఆరోగ్య పరిస్థితులకు కూడా దారితీస్తుంది. ఈ తరహా వ్యక్తులు ఒత్తిడిని త్వరగా జయించగలుగుతారు.

ఈ దృక్పథం అలవడాలంటే? 

దీనికోసం అనుకూల వాతావరణం ఏర్పరచుకోవాలి. 

ఆరోగ్యకరమైన ఆలోచనలకు తావివ్వాలి. 

*  ఇలాంటి ఆలోచనలు పెంపొందటానికి వినోదాత్మక చిత్రాలు చూడటం, పిల్లలతో ఆడుకోవటం, స్నేహితులతో హాస్య సంభాషణలు చేయటం లాంటివి దోహదం చేస్తాయి. 

ప్రతికూలాంశాలు మన చుట్టూ చోటుచేసుకోవడాన్ని నిరోధించడం అసాధ్యమే అయినప్పటికీ, పాజిటివ్ అంశాలమీద దృష్టి కేంద్రీకరిస్తే కొంతవరకు మెరుగైన ఫలితాలుంటాయి. 

    ఒక వ్యక్తి నిరాశా నిస్పృహల్లో ఉన్నపుడు ఎవరైనా సులభంగా చేసే పని- ఆ వ్యక్తికి సలహాలివ్వడం. దానికంటే- ఆశావహంగా ఆలోచించగలిగే వ్యక్తి అతడితో కొంత సమయం గడిపితే ఆ వ్యక్తి త్వరగా నిరాశ నుంచి తేరుకోగలుగుతాడు. 

  మరి ఆశావహ ఆలోచనా విధానం ఇంత గొప్పదైనపుడు ఎవరైనా దానికి బదులుగా ప్రతికూల (negative) దృక్పథాన్ని ఎందుకు అనుసరించాల్సివస్తోంది? 

    కొన్నిసార్లు మాత్రం- వ్యక్తులు అనుసరించే నెగిటివ్ ఆలోచనా విధానం అప్రమత్తత కోసం పంపిస్తున్న హెచ్చరిక సంకేతం కూడా కావొచ్చు.  

 కోపం, విచారం, ఉదాసీన వైఖరి చాలా సహజమైనవే. ప్రతి వ్యక్తిలోనూ ఉండేవే! కానీ వాటి గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం మాత్రం ప్రతికూల ఫలితాలను సృష్టిస్తుంది. అందువల్ల ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా positive అంశాల మీదే దృష్టి కేంద్రీకరించాలి. అదే శ్రేయస్కరం. దీనివల్ల రోజువారీ కలిసే వ్యక్తుల్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు!

ప్రయోజనాలు ఏమిటి?

ఆశావహంగా ఆలోచించేవారి జీవిత కాలం ఎక్కువ. క్రైస్తవ సన్యాసినులపై చేసిన ఒక పరిశోధనలో పాజిటివ్‌గా ఆలోచించే అలవాటున్నవారు  మిగతావారికంటే పదేళ్ళు ఎక్కువ కాలం జీవించారని వెల్లడైంది. 

ప్రతికూల విధానాలకంటే సానుకూల విధానాలకే సత్ఫలితాలు ఎక్కువ. 

ఆశావహ దృక్పథం ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు మిగతావారితో పోలిస్తే ఎక్కువ అమ్మకాలు చేయగలుగుతారు. 

సానుకూలంగా ఆలోచించే నాయకులు, ఒత్తిడిలో కూడా సమర్థమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 

వివాహాల విషయంలో కూడా ఇదెంతో సమర్థంగా పనిచేస్తుంది. అనుకూల- ప్రతికూల అంశాలను 1:1 నిష్పత్తి కంటే 5:1 నిష్పత్తిలో తీసుకోగలిగిన జంటల సక్సెస్ రేటు ఎక్కువని తేలింది. 

ఎప్పుడూ ఆశావహంగా ఉండేవారు ప్రతికూల పరిస్థితుల్లో సైతం సరిగా స్పందించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 

*  సానుకూలంగా ఆలోచించేవారు సమస్యను విశాల దృష్టితో పరిశీలించి పరిష్కారాలను కనుగొనగలుగుతారు. ప్రతికూల ఆలోచనలున్నవారికి ఈ విశాలత సాధ్యం కాదు. 

కృతజ్ఞత, మెచ్చుకోలు వంటి positive అంశాలు క్రీడాకారుల సామర్థ్యాన్ని పెంచుతాయని రుజువైంది. 

positive గా ఆలోచించేవారికి స్నేహితులు ఎక్కువమంది ఉంటారు. సంతోషానికీ, ఆరోగ్యకర వాతావరణానికీ స్నేహితులు ఎంతో కీలకం కదా!

సానుకూల దృక్పథమున్న టీమ్ లీడర్లు ఇతరులనుంచి మద్దతును కూడగట్టడంలోనూ ముందుంటారు. తద్వారా పదోన్నతుల వంటివి త్వరగా పొందగలుగుతారు.

ఉపయోగపడే పుస్తకాలు

The power of positive thinking:  Norman Vincent Peale

You can if you think you can:  Norman Vincent Peale

How to stop worrying and start Living:  Dale Carnegie

The magic of Thinking Big: David J Schwartz

Success Through a positive mental attitude: Napolean Hill

అన్నీ అనుకూలమే!

సానుకూల దృక్పథంపై విస్తృత పరిశోధనలు చేసిన రచయిత జాన్ గోర్డన్.

The Energy Bus: 10 Rules to Fuel Your Life, Work and Team with Positive Energy లాంటి 'బెస్ట్ సెల్లర్స్ ఈయనవే.

ఆ పరిశోధనలు తేల్చిన ప్రకారం...

* ఈ దృక్పథంతో ఉండేవారి జీవిత కాలం పెరుగుతుంది.

ఉద్యోగ నైపుణ్యం వృద్ధి చెందుతుంది.

పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువ.

* క్రీడా నైపుణ్యం పెరుగుతుంది.

* చక్కని టీమును తయారుచేసుకోవడం సాధ్యమవుతుంది.

* ఆర్థిక విజయాలు సైతం అందుతాయి.

(రచయిత: శ్రీనివాస్)

Posted Date: 07-09-2020