• facebook
  • whatsapp
  • telegram

పడుతున్న అడుగులు ఏ దిశలో?

   నిత్యజీవితంలో అనుకోని చిక్కులు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో అభ్యర్థులు ఏ తీరులో పరిష్కరిస్తారో గమనించి ఇంటర్వ్యూల్లో మార్కులు వేస్తుంటారు. సమస్యల స్వభావం అంచనా వేసి, సమయానుకూలంగా పరిష్కార మార్గాలు అన్వేషించాలని చెప్పుకున్నాం. అందుకు తోడ్పడే పది కిటుకుల్లో కొన్ని తెలుసుకుందాం!

         సమస్యలు వివిధ స్థాయుల్లో, వివిధ సాంద్రతలతో, బహుముఖాలుగా ఉండొచ్చు. వీటిని పరిష్కరించడానికి విభిన్న కోణాల్లో ప్రయత్నం జరగాలి.
 

1. పరిష్కృత భాగంపై దృష్టి

   కొంతవరకైనా పరిష్కారమైందా, అయితే ఎంతవరకు.. అనే విషయాన్ని గమనించాలి. 

''If you are not sure, where you are going, you are liable to end up some place else, and not even know it'' - Robert-F-Majer 

 సమస్య అనే స్థితి నుంచి 'పరిష్కారం దిశగా మన అడుగులు పడుతున్నాయని గుర్తుంచుకోవాలి. సమస్య నుంచి మనల్ని మనం బయటపడేసుకోవడం తప్ప మరేమీ చేయలేని సందిగ్ధస్థితిలో తీసుకునే నిర్ణయాలు మరికొన్ని కొత్త సమస్యలకు కారణమవుతాయి. వీటినే అసమర్థ నిర్ణయాలంటారు. 

కాబట్టి పరిష్కృత భాగం మీద దృష్టి కేంద్రీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు చాలా మార్గాలున్నాయి. సమస్యను ముందుగా ఎలా నిర్వచించుకుంటామో అదే విధంగా పరిష్కృత సమస్య భాగాన్ని కూడా అదే విధంగా నిర్వచించుకోవాలి. తమను తాము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి ముందుగా! 

'సమస్య పరిష్కారమైందని నాకెలా తెలుస్తుంది? ఇందుకు ప్రామాణికంగా దేన్ని తీసుకోవాలి? పరిష్కృత భాగం ఎలా కనపడుతోంది?వంటివి.
 

2. లక్ష్యాల పట్ల స్పష్టత 

   సమస్య పరిష్కరించడం అంటే ఒక ముఖ్య చర్య తీసుకోవడం. అందులో నిమగ్నం కావడం అంటే ఒక పరిష్కారాన్ని వెదకటం. దొరికిన పరిష్కారాన్ని సరిగా అమలు పరచి, ఆ పరిష్కారం సరైనదేనని రుజువు చేయడమే- వాస్తవిక సమస్యా పరిష్కారం. 

   మన లక్ష్యాల్లోని బహుముఖత్వాన్ని అంచనా వేయాలంటే.. మన దృష్టి కోణానికీ, మన ప్రాధాన్యాలకూ మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించి వాటిని పోల్చి చూసుకోవాలి. 

  దృష్టి కోణాలు (perceptions), ప్రాధాన్యాలు (preferences) ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి. వీటినుంచి 4 విధాలుగా లక్ష్యాల్ని తీసుకోవచ్చు. సాధించడం (achieve) భద్రపరచడం (preserve), వదిలివేయడం (avoid), తొలగించడం (eliminate)! ఏదైనా సరే సమస్యను పరిష్కరించేటప్పుడు లక్ష్యాల పట్ల స్పష్టత కలిగిఉండేందుకు
 

ఈ ప్రశ్నలు వేసుకోవాలి.

*     ఏమి సాధించబోతున్నాం?

*     ఏమి పరిరక్షించబోతున్నాం?

*     ఏం తప్పించుకోబోతున్నాం?

*     ఏం తొలగించబోతున్నాం?

3. నిర్వచన ప్రక్రియ విస్తృతి

  సాధారణంగా చాలామంది అనుకునేదేమిటంటే.. 'సమస్యను నిర్వచించుకోవటం అనేది సమస్యా పరిష్కారానికి తీసుకునే చర్యల్లో మొదటిదని. ఇది చాలా పొరపాటు. 'Define the problame' అంటే చాలామంది రాత పూర్వకంగా సమస్యను వివరిస్తే సరిపోతుందని అనుకుంటారు. అంతకంటే చేయాల్సింది చాలా ఉంది.
 

సమస్యను నిర్వచించడమంటే..

*   దాని పరిధుల్ని నిర్ణయించడం

*   దాన్ని విస్తృతపరచడం

*   సమస్య ఎక్కడుందో గుర్తించడం చిచి దాన్ని వేరు చేయడం (isolate)

*   సమస్య వైవిధ్యాన్ని గుర్తించడం.. ఇవన్నీ జరగాలి. 

     సమస్యను గానీ పరిష్కృత సమస్యా భాగాన్ని కానీ నిర్వచించడానికి కిందివాటిని పాటించాలి.

1. సమస్యకు పరిధుల్ని ఏర్పరచాలి (locate)

2. సమస్య స్వభావాన్ని బట్టి ఇతర సమస్యలనుంచి వేరుచేసే విధంగా లక్షణాలను నిర్ణయించాలి (isolate)

3. వివరణాత్మకంగా ఉండేందుకు సమస్య స్వభావాన్ని నిర్వచించాలి (articulate)

4. సమస్యను నిర్వచించడం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పగలగాలి (explicate).

  చాలాసార్లు సమస్యను నిర్వచించడం అనేది సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాక జరుగుతుంది. అప్పటివరకూ అది ఒక కొనసాగుతున్న ప్రక్రియగానే పరిగణించబడుతుంది. కాబట్టి 'సమస్యను నిర్వచించడం అనే ప్రక్రియ పూర్తి కాకుండానే పరిష్కారానికి చర్యలు ప్రారంభం కావచ్చు.
 

4. ప్రాతిపదికలను పట్టించుకోవడం

  సమస్యా పరిష్కారాన్ని ప్రాతిపదికల (bases) పై దృష్టిపెట్టేదిగా భావించాలి. పరిష్కారానికి కావాల్సిన సమాచారం తనంతట తాను సిద్ధంగా ఎప్పుడూ ఉండదు. ఒక పెద్దసంస్థలో సమస్య పరిష్కారానికి అనేక పరిశోధనాత్మక చర్యలు చేపట్టాల్సి రావొచ్చు. అనేక క్లూల సహాయంతో పని చేయాల్సి రావొచ్చు. సమస్య పరిష్కారానికి ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలనేది సత్యమే అయినప్పటికీ ఈ చర్యలన్నీ ఒకదాని వెనుక ఒకటి 1.. 2.. 3.. ప్రకారం అనుసరించి చేస్తే పరిష్కారం లభిస్తుందని నమ్మకంగా చెప్పలేము.

దృష్టిపెట్టాల్సిన ప్రాతిపదికలు (bases) ఇవీ.

*     సమస్య స్థితిని నిర్వచించడం

*     అప్పటివరకూ పరిష్కారమైన స్థితిని (ఏదైనా ఉంటే) ప్రత్యేకంగా పేర్కొనడం

*     సమస్య రూపాన్ని అంచనా వేయడం

*     సమస్యకు మూలకారణాన్ని కనుగొనడం

*     పరిష్కారాన్ని తయారుచేయడం

*     పరిష్కారాన్ని అమలుపర్చడానికి చర్యలను నిర్థారించడం

*     అవరోధాలను, అడ్డంకులను సమన్వయపరచడం

*     మద్దతును, ఏకాభిప్రాయాన్ని సాధించడం

*     పరిష్కారానికి తగిన పథకాలను, ప్రణాళికలను రూపొందించడం

*     చర్యలను ప్రారంభించడం

*     వాటి ప్రభావాన్నీ, పరిణామాలనూ మూల్యాంకనం చేయడం

*     తగినవిధంగా భవిష్యత్ చర్యలను సరిదిద్దడం

       వీటిలో 4, 5 అంశాలు దాదాపుగా ఒకటే ఫలితాన్నిస్తాయి. ఈ రెంటిలో ఏదో ఒకటే చేయగలం కానీ రెంటినీ కాదు. అలాగే 3వ అంశానికి చాలా ప్రాముఖ్యం ఉంది.

(రచయిత: శ్రీనివాస్)

Posted Date: 07-09-2020


 

పరిష్కారం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం