• facebook
  • whatsapp
  • telegram

ప్రతికూల ఆలోచనలు వేధిస్తున్నాయా? 

కరోనా అనిశ్చిత పరిణామాల కారణంగా విద్యార్థుల, ఉద్యోగార్థుల జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు నిరాశా నిస్పృహకలకు లోనవుతుంటే మరికొందరు ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారు. ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం!

కాలేజీకి వెళ్లిరావడం.. ఆ తర్వాత చదువుకోవడంతో లాస్యకు క్షణం కూడా తీరిక దొరికేది కాదు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ చూసినా దిగులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఒకప్పటిలా ఉత్సాహంగా ఉండలేకపోతోంది. 

ఉద్యోగాన్వేషణలో ఉన్న సాగర్‌ పరిస్థితీ ఇంచుమించు ఇలాగే ఉంది. కరోనా జోరుగా ఉన్న తరుణంలో ఆన్‌లైన్‌లోనే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాడుగానీ ఎక్కడి నుంచీ పిలుపు రావడం లేదు. దీంతో ప్రతికూల ఆలోచనలతో సతమతం అవుతున్నాడు. 

ఇలాంటి స్థితి ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంటుంది. దీన్నుంచి బయటపడాలంటే.. కొన్ని అంశాలను గమనించాలి, పాటించాలి. .

1. ఆలోచనలతో ఒత్తిడి: ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పరిస్థితి మరింత చేజారిపోతుంది. మీరెంత ఎక్కువగా వీటి గురించి ఆలోచిస్తే అంత ఎక్కువగా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. రోజువారీ పనులూ మందకొడిగా సాగుతాయి. అయితే ఈ ఆలోచనలను ఒక్కసారే నిర్మూలించడం సాధ్యంకాదు. ఇలాంటి ఆలోచనలు రావడం మొదలుపెట్టినప్పుడు మీ దృష్టిని మరో పని మీదకు మళ్లించాలి. చదువు, ఇతర పనులను కొనసాగిస్తూ బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆలోచనలు ఎప్పుడూ మీ నియంత్రణలో ఉండాలిగానీ మీరే ప్రతికూల ఆలోచనల నియంత్రణలోకి వెళ్లపోకూడదు. 

2. స్పందనపై అంచనా: మీ ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకోగలిగితే వాటిని నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు. రోజువారీ సంఘటనల పట్ల మీ స్పందన ఎలా ఉంటుందనే విషయంలో ఒక అంచనాకు రావాలి. ప్రతి విషయానికీ సానుకూలంగా స్పందిస్తున్నారా లేదా ప్రతికూలంగా స్పందిస్తున్నారో తెలుసుకోవాలి. అలాగే ప్రతికూల ఆలోచనలు రావడం వెనుక ఉన్న కారణాన్ని అన్వేషించాలి. నిర్దిష్టమైన ప్రదేశం, పరిస్థితులు లేదా మనిషి మీ ప్రతికూల ఆలోచనలకు కారణమైతే సాధ్యమైనంత వరకు ఆయా పరిస్థితులు లేదా మనుషులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. 

3. వాస్తవం.. తర్కం: ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన తర్వాత వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించాలి. ఈ ఆలోచనల్లో వాస్తవం ఎంతో గుర్తించాలి. అవి వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్నాయో లేదో తెలుసుకోవాలి. లేదా మీకున్న భయాలే ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తున్నాయా అనే దిశగానూ ఆలోచించాలి. ఇలా తార్కికంగా ఆలోచించడం వల్ల నిరంతరంగా వచ్చే ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడొచ్చు. 

4. పోలికలతో నష్టం: విద్యార్థులుగా/ ఉద్యోగార్థులుగా మీ మీద మీకు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోలేనప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి. అలాగే ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే.. ఆ సందర్భంగా  ఆత్మన్యూనత తలెత్తవచ్చు. దీనివల్ల కూడా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అందుకే పోల్చుకోవడం మానేయటం ఉత్తమం.

5. విమర్శలతో ఎదుగుదల: సాధారణంగా విమర్శలను వినగానే ఎవరైనా ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడతారు. ఉదాహరణకు మీరు రాసినదాంట్లో సరైన పాయింట్లు లేవని ఎవరైనా విమర్శించారు అనుకుందాం. అంటే దానర్థం మీకు రాయడమే రాదని కాదు. మీరు రాసే దాంట్లో అదనంగా మరిన్ని అంశాలను చొప్పిస్తే సరిపోతుంది. విమర్శలను నేర్చుకోవడానికో అవకాశంగా భావిస్తే.. మీ ఎదుగుదలకూ తోడ్పడతాయి.  

6. బలాలను గ్రహిస్తే మేలు: ఇతరులు చేసిన విమర్శలు మీకు ఎక్కువకాలంపాటు గుర్తుండిపోతాయి. పొగడ్తలను మాత్రం మర్చిపోతుంటారు. అలాగే మీలోని బలహీనతల మీదే దృష్టి కేంద్రీకరిస్తారుగానీ బలాల గురించి ఆలోచించరు. కాబట్టి ముందుగా మీ దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. అప్పుడు సానుకూలంగా స్పందించడం అలవాటు అవుతుంది. మీలో ఉన్న బలాల గురించి మీకు స్పష్టంగా తెలిసుండాలి. ఈ స్పష్టత మీకుంటే ప్రతికూల ఆలోచనల వేగం తగ్గుతుంది. మీ బలాల పట్ల అవగాహన ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. గతంలో మీరు చేసిన పొరపాట్లు, పొందిన అపజయాల  గురించి పదేపదే ఆలోచించడం మానేయాలి. వీటి స్థానంలో మీ బలాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. బలహీనతలు ఆత్మన్యూనతనూ, బలాలు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
 

Posted Date: 25-08-2021


 

ఆలోచన