• facebook
  • whatsapp
  • telegram

 లక్ష్య సాధనకు సరైన ఆయుధం చదువు

'జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు'? అని ఎవరైనా అడిగితే మీరేం చేస్తారు? టక్కున సమాధానం చెబుతారా? లేక జవాబు కోసం తడుముకుంటారా? 

     వెంటనే చెబితే మీకో లక్ష్యం ఉందనీ, మీ దగ్గర సమాధానం లేకపోతే లక్ష్యమేదీ లేదనీ అర్థం. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో వ్యక్తికీ, వ్యక్తికీ తేడాలుంటాయి. కొంతమంది చాలా చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించడంకోసం శ్రమిస్తారు. మరికొందరికి చాలా ఆలస్యంగా లక్ష్యాన్ని ఎంచుకుంటారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో కాస్త ఆలస్యమైనా పరవాలేదుగానీ, అసలు లక్ష్యమే లేకపోవడం మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమే. 

     మనమో పని చేస్తున్నాం. ఎందుకు? ఆ పనిని పూర్తి చేస్తే మనకో ప్రయోజనం ఉంటుంది కాబట్టి. అంటే ఆ పనిని పూర్తి చేయడం మన లక్ష్యం. లక్ష్యం లేకుండా పనిచేయడమంటే మనమేం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదని అర్థం. 

     మన లక్ష్యాన్ని సాధించుకోవాలంటే అందుకు అవసరమైన ఆయుధం చదువు. చదువు లక్ష్యం ఏమిటంటే మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడం. మనం అనుకున్న రీతిలోనే చదువు సాగుతోందా? లేదా? అని నిరంతరం బేరీజు వేసుకుంటూ ఉన్నప్పుడే లక్ష్యాన్ని సులభంగా సాధించగలం. ఏటా పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి కొన్ని సాధారణ/ చిన్న లేదా స్వల్పకాలిక లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది.

     ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నెన్నో చిన్న లక్ష్యాలను అధిగమిస్తూ వెళ్లాలి. కాలేజీకి వెళ్లాలంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. తయారు కావాలి. బస్‌స్టాప్ వరకూ నడచి వెళ్లాలి. సరైన బస్‌లో ఎక్కాలి. ఇవన్నీ కాలాతీతం కాకుండా సరైన సమయంలోనే జరగాలి. ఇవన్నీ లక్ష్యాలే. ఒక రకంగా చెప్పాలంటే జీవితమంతా లక్ష్యాల సమూహాలే మనల్ని నడిపిస్తాయి.

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఎలా?

   లక్ష్యాన్ని ఎంచుకునేముందు పలు రకాల పరిస్థితులనూ, ముఖ్యంగా మన సంసిద్ధతనూ, అభిరుచినీ, బలాలు-బలహీనతలనూ బేరీజు వేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన శారీరక, మానసిక, ఇతర పరిస్థితులు అనువుగా ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. తరువాతే లక్ష్య నిర్దేశం జరగాలి. ఎంచుకున్న లక్ష్యం మన సామర్థ్యానికి మించినదైతే దాన్ని అందుకోలేక చివరికి ఆశాభంగం చెందాల్సి రావచ్చు. 'కీడెంచి మేలెంచాల'ని పెద్దలు చెప్పిన మాట ఇక్కడ వర్తిస్తుంది. లక్ష్యం మరీ చిన్నదైనా మనకు సంతృప్తి కలగదు.

ఏం కావాలి?

   లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక కావలసింది దాన్ని చేరుకునే ప్రయత్నం. ఈ ప్రయత్నం నిరంతరంగా, నిరాటంకంగా సాగడానికి ఈ కింది అంశాలు అవసరం.

ప్రేరణ: నిరంతరం లక్ష్యాన్ని గుర్తు చేసుకునేందుకు అవసరమైన ప్రేరణ ఉండాలి. లక్ష్య సాధనలో ప్రేరణ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రెండు రకాలు. బయటనుంచి వచ్చే ప్రేరణ. అంతర్గత ప్రేరణ. విద్యార్థికి అంతర్గత ప్రేరణ ముఖ్యం. ప్రతిరోజూ 'నా లక్ష్యం ఏమిటి?, నేనెందుకు చదవాలి?' అని ప్రశ్నించుకుంటూ వాటికి మనసులోనే లభించే సమాధానాలనుంచి ప్రేరణ పొందాలి. పలు రంగాల్లో ప్రముఖులైనవారి జీవిత విశేషాలను తెలుసుకుని స్ఫూర్తిని పొందడం బయటినుంచి వచ్చే ప్రేరణకు ఉదాహరణ. గొప్పవారి విజయగాథలను వినడం/ చదవడం ద్వారా, ఆయా విషయాలను మిత్రులతో చర్చించడం ద్వారా బయటినుంచి ప్రేరణ పొందవచ్చు.

ప్రణాళిక: ఏ పనికైనా ప్రణాళిక ముఖ్యం. సంవత్సరంపాటు చదివే విద్యార్థికి ప్రణాళిక అత్యంత ముఖ్యం. సిలబస్‌నూ, సబ్జెక్టులనూ విభజించుకుని ఆ మేరకు క్రమం తప్పకుండా నేర్చుకుంటూ ఉండాలి. రోజూ కొంత మేరకు చదువుతూ పోతే, ఎంత సిలబస్‌నైనా సులభంగా పూర్తి చేయవచ్చు. అయితే మనం ఎంత ముందుగా మొదలు పెట్టామనే దానిమీదే మనం ఏ మేరకు విజయం సాధిస్తామనేదీ ఆధారపడి ఉంది. ప్రతినెలా తరగతి స్థాయిలో జరిగే పరీక్షల్లో మార్కులను క్రమేపీ పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. తద్వారా వార్షిక పరీక్షల్లో పెద్ద లక్ష్యాన్ని సాధించడం ఎంతో సులభమవుతుంది. సంవత్సరమంతా వృథా చేసి, చివర్లో హడావిడి పడటంవల్ల ఉపయోగమేమీ ఉండదు.

కష్టపడే తత్వం: కొంతమంది విద్యార్థులు సులభంగా ఉన్న పాఠాలను ముందు చదువుతారు. అంతవరకూ ఫరవాలేదు. కానీ, కొద్దిగా కష్టంగా ఉండే పాఠాల జోలికిపోరు. 'వార్షిక పరీక్షల్లో ఛాయిస్ ఉంటుంది కదా? అన్నీ చదవాల్సిన అవసరం ఏముంది?' అంటూ వాదిస్తారు. ఈ తరహా ధోరణి ఉన్నవారు జాగ్రత్తపడాలి. ఎంత క్లిష్టమైన అంశాలనైనా తెలుసుకోవాలి. ఎందుకంటే పరీక్షల్లో మనం చదవని అంశాలే వస్తే మన ఆశల సౌధాలు కుప్పకూలుతాయి. మనపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులనూ మోసగించినట్లవుతుంది. క్లిష్టమైన పాఠాలను నేర్చుకునేందుకు అవసరమైతే ఉపాధ్యాయులు, సీనియర్ విద్యార్థుల సహకారం తీసుకోవాలి.

పట్టుదల: లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే మిగతా లక్షణాలన్నీ వాటికవే అభివృద్ధి చెందుతాయి. పట్టుదలను అలవాటుగా చేసుకుని విద్యార్థి శ్రమించాలి.

ఏం చేయకూడదు?

పోలిక వద్దు: చదువుకోవడంలో ఇతరులతో మనల్ని పోల్చుకోవడం మంచిది కాదు. మన పద్ధతిలో మనం చదువుతూ పోవడమే ఉత్తమం. ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆత్మన్యూనతాభావం లాంటివి పెరిగే అవకాశం ఉంది. ఈర్ష్య వంటివి కూడా వృద్ధి చెందవచ్చు. తరగతిలో విద్యార్థుల మధ్య పోటీ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి. భావోద్వేగాలకు అందులో స్థానం ఉండకూడదు.

వాయిదా స్వభావం: ఏ రోజు పాఠాన్ని ఆ రోజే పూర్తి చేయడంద్వారా మార్కులు సాధించే లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. కొంతమంది కాస్త క్లిష్టమైన అంశాలను చదవాల్సి వస్తే, 'తరువాత చదువుదాం లే' అనుకుంటూ వాయిదా వేస్తారు. లక్ష్య సాధనకు గండి కొట్టే అంశాల్లో ఈ స్వభావం అగ్రశ్రేణిలో ఉంటుంది. వాయిదా వేసే మనస్తత్వం మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల గానీ, సోమరితనం వల్ల వస్తుంది.

ఏకాగ్రత కోల్పోవడం: లక్ష్యసాధనలో ఏకాగ్రత పాత్ర అనన్యం. నిత్యం ఒక పద్ధతి ప్రకారం చదవడాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తే ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కోల్పోతే మళ్లీ గాడిలో పడటం చాలా కష్టం. ఎంతో విలువైన కాలాన్ని కూడా వృథా చేసుకున్నట్లవుతుంది. ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలు విద్యార్థుల చుట్టూ కోకొల్లలుగా ఉంటాయి. ఉదాహరణకు సినిమాలు, టీవీ, ఇంటర్‌నెట్, వీడియోగేమ్స్, ఇతర ఆటలు.. లాంటివి. అందుకే సాధ్యమైనంతవరకూ వీటి ఆకర్షణకు లోను కాకుండా విద్యార్థి జాగ్రత్తగా ఉండాలి. టీవీ లాంటివి చూడాల్సి వస్తే కొద్దిగా సమయాన్ని అందుకోసం నిర్దేశించుకోవడం అవసరం. చూసే కార్యక్రమాలు కూడా విజ్ఞానాన్ని పెంచేవిగా ఉండాలి.

         లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఏకాగ్రతతో దాన్ని చేరే ప్రయత్నం చేయాలి. అందుకు పైన చెప్పిన అంశాలను గుర్తుంచుకోవాలి. మన ఏకాగ్రతకు ఏదీ ఆటంకం కాదనే ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలితే విజయం తప్పకుండా మనదే.

Posted Date: 11-09-2020


 

లక్ష్యం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం