• facebook
  • whatsapp
  • telegram

ఆత్మవిశ్వాసం అండగా ఉంటే.... కాదేదీ కష్టం!

      ఆత్మవిశ్వాసం అంటే 'నేను చేయగలను' అనే నమ్మకమే. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న మనిషి ఏదైనా సాధించగలడనీ, అది కొరవడితే ఏమీ చేయలేడనీ నిరూపించే కథలు, చారిత్రక ఘట్టాలు ఎన్నెన్నో ఉన్నాయి. పూర్వం ఒక రాజు రాజ్యం నుంచి ఏడుగురు లక్ష్ములు నిష్క్రమించారట. దీంతో రాజు రాజ్యంతో సహా సర్వం కోల్పోయాడు.
                 

       ఎనిమిదో లక్ష్మి అయిన ధైర్య లక్ష్మిని మాత్రం ఆయన వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడట. తనకున్న ధైర్యంతో మళ్లీ సైన్యాన్ని కూడగట్టి, యుద్ధం చేసి, రాజ్యాన్నీ, అష్టలక్ష్ములనూ మళ్లీ సాధించుకున్నాడనేది కథ. 

ఇది కథే అయినా ఇందులోని నీతిని మనం విస్మరించలేం. ధైర్యం (ఆత్మ విశ్వాసం) ఉన్నవాడు దేన్నయినా సాధించగలడనేది ఇందులోని సారాంశం.

మనం ఒక పని చేసే ముందే మన మనసులో ఒక నిర్ణయం లేదా తీర్పు సిద్ధమైపోతుంది. అంటే, మనం చేయబోయే పనిలో విజయం సాధిస్తామో లేదో మనం ముందే ఒక అంచనాకు వచ్చిఉంటాం. 'నేనిది చేయగలను' అనో, 'చేయలేను' అనో అనుకుంటాం. చాలావరకూ మనం అనుకున్నదే జరుగుతుంది. 'యద్భావం తద్భవతి' అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా? ధైర్యవంతులు, సానుకూల దృక్పథం ఉన్నవాళ్లు 'నేనిది కచ్చితంగా చేయగలను' అనే ఆత్మవిశ్వాసంతో ఆ పని చేసి విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం కొరవడినవాళ్లు ఆ పని చేయకముందే మానసికంగా ఓటమిని అంగీకరిస్తారు (నేనిది చేయలేనేమో? అనుకోవడం ద్వారా). అందుకే వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆ పని చేయలేరు. ఆత్మవిశ్వాసానికి ఉన్న శక్తి అదే. 

ఆత్మవిశ్వాసానికి డబ్బుతో, ఐశ్వర్యంతో సంబంధం లేదు. విజయతీరం చేరాలనుకున్నవారికి ఉండాల్సిన మొదటి లక్షణమిది. 

మన ఇతిహాసాల్లో మనుషుల లక్షణాలను బట్టి వారిని మూడు రకాలుగా వర్గీకరించారు. వారు.. ఉత్తములు, మధ్యములు, అల్పులు. ఉత్తముడు ఎంతటి కార్యాన్నైనా సాధించేవరకూ విశ్రమించడు. మధ్యముడు కొంతవరకూ పనిచేసి, ఆ కార్యాన్ని మధ్యలో వదలివేస్తాడు. అల్పుడు 'అది మనవల్ల అయ్యే పనికాదులే..' అనుకుంటూ అసలు ఎప్పటికీ కార్యసాధనకు పూనుకోడు. 'ఆరంభింపరు నీచ మానవుల్..' అనే పద్యం మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది.

ఎలా సాధించాలి?

      విద్యార్థులు బాగా చదవడానికి, పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి వారిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాలి. దాన్ని సాధించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.

ముందుగా సులభమైనవి..

     సిలబస్‌లో చదవాలనుకునే అంశాలను ముందుగా విడగొట్టుకోవాలి. ఆసక్తికరమైన, సులభమైన అంశాలను ఒక విభాగంలో, క్లిష్టమైన అంశాలను మరో విభాగంలో చేర్చాలి. ఆసక్తికరంగా, సులభంగా ఉన్న పాఠ్యాంశాలను ముందుగా ఎంపిక చేసుకుని చదవాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసాన్ని క్రమేపీ పెంచుకోవచ్చు. ముందుగా సులభమైన పాఠాలను చదవడంవల్ల భయాలూ, అనుమానాలూ ఉండవు. చదువులో మమేకమైన భావన కలుగుతుంది. ఇది క్రమంగా బలపడుతుంది. ఆ తరువాత క్లిష్టమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా నేర్చుకునేందుకు ఈ పద్ధతి బాటలు వేస్తుంది.

ప్రణాళిక

    ఒక పద్ధతి/ ప్రణాళిక ప్రకారం చదవడంవల్ల కూడా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. పాఠాలన్నింటినీ ఒకేసారి చదవడంవల్ల గందరగోళం ఎక్కువవుతుందే కానీ, ప్రయోజనం ఉండదు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఒక ప్రణాళికను రూపొందించుకుని దాని ప్రకారం చదివితే పాఠాలన్నీ పట్టుబడతాయి. ఏ పాఠ్యాంశాన్ని ఏ సమయానికి పూర్తి చేయాలనేదీ ముందే నిర్దేశించుకుని, దాన్ని కచ్చితంగా అనుసరిస్తూపోతే పరిస్థితి పూర్తిగా విద్యార్థి చెప్పుచేతుల్లో ఉంటుంది. ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమవుతుంది.

అంతరాయం వద్దు

   ప్రణాళిక పక్కాగా అమలైతే విద్యార్థికి అభ్యసనం 'నల్లేరుమీద బండి నడకే' అవుతుంది. ఆధునిక జీవితంలో విద్యార్థులను ఆకర్షించే ఎన్నో అంశాలు చుట్టూ ఉన్నాయి. టీవీ, కంప్యూటర్లు, సినిమాలు వంటివాటికి వీలైనంతవరకూ దూరంగా ఉండటం శ్రేయస్కరం. దీనివల్ల నిత్యం మనసును దారి మళ్లించే అంతరాయాలు, అవాంతరాలను ముందుగానే నిరోధించవచ్చు. బద్దకం, నిర్లక్ష్యం వంటి లక్షణాలను దరిచేరనివ్వకూడదు.

స్వీయ నియంత్రణ

    చదివే అంశాలపై స్పష్టత అవసరం. ప్రణాళిక ప్రకారం చదువు సాగాలంటే విద్యార్థికి స్వీయ నియంత్రణ కూడా అవసరం. పాఠ్యాంశాలను అనుకున్న సమయానికే పూర్తి చేయడం కోసం విద్యార్థి తనకు తానే కొన్ని ఆంక్షలను నిర్దేశించుకోవాలి. వాటి ప్రకారం చదవాలి. దీనివల్ల స్వయం క్రమశిక్షణ కూడా అలవడుతుంది. ఇది విద్యార్థి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

Posted Date: 11-09-2020


 

వ్యక్తిత్వం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం