• facebook
  • whatsapp
  • telegram

ఒత్తిడిని ఓడించడం తేలికే!-

         కార్తీక్ పదోతరగతికి వచ్చాడు. ఇప్పటివరకూ లేని ప్రాధాన్యమేదో వచ్చినట్లు అందరూ అతడిని ప్రత్యేకంగా చూస్తున్నారు. బంధువులూ, తెలిసినవారూ 'పదోతరగతికొచ్చావా? అయితే ఇక నువ్వు ఆటపాటలన్నీ మానేసి బాగా చదవాల్సిందే..' అంటున్నారు. మరోవైపు సబ్జెక్టుల్లో క్లిష్టత, పాఠాలు సరిగ్గా అర్థం కాకపోవడం, సిలబస్ భారం వంటి సమస్యలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో కార్తీక్‌లో ఏదో తెలియని అలజడి మొదలైంది. రాత్రీ, పగలూ ఆ అలజడి అతడిని భయపెడుతోంది. సరిగ్గా తిండి తిననివ్వదు.. నిద్రపోనివ్వదు.. 'సిలబస్ బాగా ఎక్కువగా ఉందే? చదవగలనా? చదివిందంతా గుర్తుంటుందా? పరీక్షలు సరిగ్గా రాయకపోతే ఎలా?' ఇలాంటి ఆలోచనలు అతడిని వేధిస్తున్నాయి. ఆ ఆలోచనల అలజడి పేరే 'ఒత్తిడి' అని ఆ కుర్రాడికి తెలియదు. ఆ ఒత్తిడి మితిమీరితే సామర్థ్యం దెబ్బతింటుందని గ్రహించేంత వయసూ కాదు అతడిది.

ప్రతి మనిషికీ ఒత్తిడి ఉండటం సహజం. ఆలోచనలూ, ఒత్తిళ్లూ లేకుండా జీవించాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఎన్నో పరిశోధనల్లో తేలిన సారాంశమేమిటంటే, 'మనిషి జీవితంలో ముందుకు వెళ్లడానికీ, విజయాలు సాధించడానికీ కొంత ఒత్తిడి ఉండటం తప్పనిసరి' అని. అయితే అసలు చిక్కంతా ఒత్తిడి మోతాదు పెరగడం వల్లే వస్తుంది.

నష్టమే ఎక్కువ

    విద్యార్థుల్లో ఒత్తిడి బాగా పెరగడంవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కొంతవరకూ ఒత్తిడి ఆరోగ్యకరమే కానీ, శ్రుతిమించితే ప్రమాదమనే చెప్పాలి. శారీరక, మానసిక సమతౌల్యాన్ని దెబ్బతీయనంతవరకూ ఒత్తిడి వల్ల సమస్యలేదు. ఒత్తిడి ఎక్కువైతే జ్ఞాపకశక్తిమీద, నేర్చుకునే కౌశలంమీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. మనం మామూలుగా చేసే పని కూడా చేయలేని పరిస్థితిని ఒత్తిడి కల్పిస్తుంది. తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన క్రికెట్ జట్టుపై ప్రత్యర్థులు అవలీలగా విజయం సాధించడం మీరు టీవీలో చూసే ఉంటారు. సమస్యను మరింత జటిలం చేసే తీవ్రమైన ఒత్తిడిలో ఏ పనీ సజావుగా చేయలేం. 

    ముఖ్యంగా విద్యార్థుల్లో ఒత్తిడి ఒక స్థాయిని దాటితే అసంబద్ధమైన ఆలోచనలు పెరుగుతాయి. ఆనారోగ్యం కూడా వస్తుంది. తలనొప్పి, అరచేతుల్లో చెమటలు పట్టడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరీక్షలు దగ్గరయ్యేకొద్దీ ఈ లక్షణాలు ఎక్కువ కావచ్చు కూడా. అందుకే విపరీతమైన ఒత్తిడికి దారి తీసే ఆలోచనలకు వెంటనే కళ్లెం వేయాలి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆలోచనలనూ, తద్వారా పెరిగే ఒత్తిడినీ సమర్థంగా తట్టుకునేందుకు, అవసరమైతే తిప్పికొట్టేందుకూ విద్యార్థి కొన్ని మార్గాలను అనుసరించాలి.

అవి....

సానుకూల దృక్పథం

    జీవితంపట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. అంటే ప్రతి విషయాన్నీ మనకు అనుకూలంగా వర్తింపజేసుకుంటూ ఆలోచించాలి. 'నేను చేయగలను.. తప్పనిసరిగా పరీక్షలు బాగా రాయగలను.. అమ్మానాన్నల ఆశలు నెరవేర్చగలను...'' అని తరచూ అనుకుంటూ ఉండాలి. మనం నిరంతరం ఏది కోరుకుంటామో అది తప్పనిసరిగా జరుగుతుందనే ఒక థియరీ కూడా ఉంది. దాని సంగతి పక్కన పెడితే ప్రతికూల ఆలోచనలను అదుపు చేయడంకోసం మనం తప్పనిసరిగా సానూకూల ఆలోచనా ధోరణిని పెంపొందించుకోవాలి. పిల్లలమీద తల్లిదండ్రులు ఆశలు పెంచుకోవడం సహజం. అయితే, విద్యార్థులు దీన్ని 'తమపై ఉన్న భారం'గా భావించకూడదు. చదువును ఒక 'భూతం'లా చిత్రీకరిస్తూ ఎవరెన్ని మాటలు చెప్పినా పట్టించుకోకూడదు. తమ సామర్థ్యం పట్ల తమంతట తామే ఒక అంచనాకు రావాలి.

ఏకాగ్రత

     అర్జునుడు గొప్ప విలుకాడని ప్రతీతి. అతడి ఏకాగ్రత గురించి తెలిపే ఒక ఘట్టం భారతంలో ఉంది. గురువు విలువిద్య నేర్పేటప్పుడు చెట్టుమీద ఉన్న పక్షికి బాణం గురి పెట్టాలంటూ శిష్యులకు చెబుతాడు. ఆ తరువాత 'మీకు ఏం కనిపిస్తోంద'ని అడుగుతాడు. 'చెట్టు, దాని కొమ్మ, ఆకులు, వాటి మాటున ఉన్న పక్షి' తమకు కనిపిస్తున్నాయని అందరూ చెబుతారు. అర్జునుడు మాత్రం తనకు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదని చెబుతాడు. ఇక అర్జునుడి ఏకాగ్రతను భంగపరచడం ఎవరి తరం?

     ఆలోచనలను అదుపులో ఉంచే అద్భుతమైన ఆయుధమే ఏకాగ్రత. దీన్ని సాధించడానికి విద్యార్థులు రోజూ కొంతసేపు ధ్యానం చేయడం ఉత్తమమైన పద్ధతి. ఏకాగ్రత ఉన్న వారికి చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితులు కూడా ఆటంకం కాబోవు.

ఫలితంపై ఆదుర్దా వద్దు

    విద్యార్థి ప్రణాళికాబద్ధంగా తనపని తాను చేసుకుంటూ పోవడమే ముఖ్యం. ఫలితంపై ఆదుర్దా చెందాల్సిన అవసరం లేదు. 'కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి' అని సామెత ఉంది. దీన్ని విద్యార్థికి వర్తింపజేసి నెమ్మదిగా అయినా క్రమం తప్పకుండా చదివితే ఎంత సిలబస్ అయినా పూర్తి చేయవచ్చని చెప్పవచ్చు. అసలు ప్రయత్నమే చేయకపోతే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం ఎప్పుడూ విఫలం కాదని గుర్తించాలి. చదివితే ఫలితం ఎప్పుడూ విద్యార్థి పక్షానే ఉంటుంది.

ప్రణాళిక అవసరం

    ఎంత పెద్ద ప్రయాణానికైనా 'మొదటి అడుగు' అనేది ఉంటుంది. చదువుకోవడం కూడా ప్రయాణం లాంటిదే. క్రమంగా అడుగులు పడితే ఎంత దూరమైనా సునాయాసంగా వెళ్లవచ్చు. కాకపోతే మన ముందున్న సమయం, మనం చదవాల్సిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అవసరం. ప్రణాళిక ప్రకారం చదివేటప్పుడు ఆలోచనలూ, భయాలూ వాటంతట అవే తగ్గిపోతాయి. వాటి స్థానంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది.

Posted Date: 11-09-2020


 

ఆచరణ

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం