• facebook
  • whatsapp
  • telegram

Police Jobs: కలలు కని.. కానిస్టేబుళ్లయ్యారు!

ఎల్కూరు నుంచి 10 మంది విజేతలు



ఎల్కూరు(మల్దకల్‌), న్యూస్‌టుడే:  ఎల్కూరు గ్రామం నుంచి అత్యధికంగా పది మంది కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికై గుర్తింపు తెచ్చారు. 2018లో గ్రామం నుంచి 6 మంది, 2020లో 8 మంది, తాజాగా ఏకంగా 10మంది కొలువులు సాధించడంతో నియోజకవర్గంలోనే గ్రామానికి గుర్తింపు వచ్చింది. అంతా పేదరైతు కుటుంబాలకు చెందిన వారే. డిగ్రీ, బీటెక్‌ చదివిన వీరంతా మొదటి ప్రయత్నంలోనే కొలువులు సాధించారు. వీరిలో రాజు, లలిత, రమేష్‌ బీటెక్‌ చదవగా, బంగి కృష్ణ, ఇజబుల్‌, జి.రమేష్‌, రంజిత్‌, వెంకటేశ్‌, గిడ్డారెడ్డి, హరికృష్ణ డిగ్రీ చదివారు.

అక్కాతమ్ముళ్లు..
మండలంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. అక్క లావణ్య సివిల్‌ కానిస్టేబుల్‌గా, తమ్ముడు అశోక్‌ రెడ్డికి ఫైర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. వీరి చిన్నతనంలో తల్లి చనిపోవడంతో తండ్రి సుధాకర్‌ రెడ్డి కష్టపడి చదివించారు. లావణ్య ఓ ప్రైవేట్‌ ఫార్మా కంపెనీలో పని చేస్తుండగా, అశోక్‌ రెడ్డి ఎంసీఏ చదువుతున్నారు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా సొంతంగా పరీక్షకు సిద్ధమై ఉద్యోగాలు సాధించారు.

బావబామ్మర్దులు..
మదనాపురం మండలంలోని కొన్నూర్‌ గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్‌ రెడ్డి, సాయికుమార్‌ రెడ్డి బావబామర్దులు. వీరు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని డిగ్రీ పూర్తయ్యాక పోలీస్‌ ఉద్యోగ సాధనకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యారు. సూర్యప్రకాశ్‌ రెడ్డి చిన్నతనంలోనే తండ్రి అంజిరెడ్డి చనిపోయారు. తల్లి రాధమ్మ వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. సాయికుమార్‌ రెడ్డి తల్లిదండ్రులు మహేశ్వరి, జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుల్‌ఉద్యోగం సాధించారు.  

భర్త ప్రోత్సాహంతో..
ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన డొంక మనీషా డిగ్రీ పూర్తి చేసింది. చదువులో తండ్రి ప్రోత్సహించగా వివాహం తరవాత భర్త ఆమెకు అండగా నిలిచారు. ఆయన టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ కావడంతో నిరంతరం సలహాలు, సూచనలు ఇచ్చాడు. చివరికి ఆమె ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఏడాదిన్నర పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మనీషా ఎస్సై కావడమే తన లక్ష్యమని భవిష్యత్తులో సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ..
మహబూబ్‌నగర్‌ పురపాలిక అప్పన్నపల్లికి చెందిన పిట్టల సందీప్‌కుమార్‌ది రెక్కాడితే తప్పా డొక్కాడని కుటుంబం. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో చదివాడు. అనుకున్నది సాధించాడు. ఒక్కగానొక్క కుమారుడు. తండ్రి నర్సింహులు ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌ కాగా తల్లి జంగమ్మ ఎస్వీఎస్‌ ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తారు. తల్లిదండ్రులకు భారం కాకుండా గ్రామం సమీపంలోని పెట్రోలు బంకులో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేవాడు. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చదివాడు. అతడి కష్టం ఫలించింది. కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపిక కావటంతో సందీప్‌కుమార్‌తో పాటు అతడి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

భర్త తోడ్పాటుతో.. ఉద్యోగ సాధన
వనపర్తికి చెందిన యాదమ్మ ఎస్‌సీటీ (సివిల్‌) కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. బీటెక్‌ చదివిన ఆమె సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని కాదనుకుని పోలీసు ఉద్యోగంపై ఉన్న అభిమానం, గౌరవంతో స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పరీక్ష రాశారు. ఆగస్టులో వెలువడిన ఫలితాల్లో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సు కానిస్టేబుల్‌ (జీడీ)గా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫలితాల్లోనూ ఆమె కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. భర్త భాస్కర్‌యాదవ్‌ స్థానికంగా కమర్షియల్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య లక్ష్యాన్ని గుర్తెరిగిన ఆయన ఆమె ఎంచుకున్న మార్గంలో రాణించేందుకు ప్రోత్సాహమందించారు. ‘తన కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకున్న వారు లేరని తానే ఇష్టంతో చదివి బీటెక్‌ చేశా’నని యాదమ్మ తెలిపారు. భర్త ప్రోత్సాహంతోనే రెండు పరీక్షల్లోనూ విజయం సాధించానని పేర్కొన్నారు.

సర్కారు కొలువులు సాధించిన యువకులు
వారంతా పోలీసు కొలువు కోసం కలలు కన్నారు. నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండి శిక్షణ తీసుకున్నారు. పేదరికాన్ని జయించి, కష్టాలను ఎదిరించి లక్ష్య సాధనకు నిత్యం శ్రమించారు. చివరికి విజేతలుగా నిలిచారు. పేద, మధ్య తరగతి, వ్యవసాయ కుంటుంబాల నుంచి వచ్చి కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికై సమాజసేవలో భాగం కాబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన పలువురిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

అమ్మ కష్టమే ప్రేరణ..:  కాట్రపల్లి అంజప్ప, ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థి
నాన్న భీరప్ప చిన్నప్పుడే చనిపోయారు. ఐదుగురిలో నేను మూడో సంతానం. నాన్న లేని లోటు వెంటాడుతుండేది. అమ్మ లింగమ్మ రోజూ పడుతున్న కష్టం కంటతడి పెట్టిస్తుండేది. చదువుకుంటూనే ఎంపిక పరీక్షలకు సిద్ధమయ్యాను. పీయూ అధ్యాపకులు ప్రోత్సహించారు. తాత, మేనమామ, అమ్మ ఆశలన్నీ నా కర్తవ్యాన్ని గుర్తుచేసేవారు. టీఎస్‌ఎస్పీ(బెటాలియన్‌) కానిస్టేబుల్‌ కొలువు సాధించా. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఎదిగి.. అమ్మకు గర్వకారణంగా నిలుస్తా.

ఆన్‌లైన్‌ తరగతులతో..: పి.సౌమ్య, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ విద్యార్థిని
పరీక్షకు ఆన్‌లైన్‌ తరగతులు వింటూ సిద్ధమయ్యా. దేహధారుఢ్య పరీక్షల్లో విజయం సాధించేందుకు పీయూలో ఉన్న సౌకర్యాలతో సాధన చేశా. వారం రోజులు హైదరాబాదుకు వెళ్లి కొన్ని మెళకువలు నేర్చుకున్నా.. సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం రావటం ఆనందంగా ఉంది. వార్డెన్‌, అధ్యాపకుల ప్రోత్సాహం మరవలేనిది. సివిల్స్‌ సాధించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తా.

శిక్షణ తీసుకోకుండా..: పూజిత, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ విద్యార్థిని
మా నాన్న కొండయ్య తాపీమేస్త్రీ. అమ్మ భాగ్యమ్మ గృహిణి. ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. పీయూలో అక్కవాళ్లు ఇచ్చిన పుస్తకాలతో చదువుకున్నా. స్నేహితులు, అధ్యాపకుల సూచనల పాటిస్తూ మూడు నెలల కాలం సిద్ధమయ్యా. ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. ప్రభుత్వ ఉన్నతాధికారిణి కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం మరింత శ్రమిస్తా.     

లైబ్రరీలోనే ఎక్కువ గడిపా: ఇ.శ్రీనివాసకుమార్‌, ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థి
ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. పీయూలోని గ్రంథాలయం, మైదానంలోనే ఎక్కువ సమయం గడిపా. టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. భవిష్యత్తులో గ్రూప్‌-2 అధికారి కావాలన్నదే లక్ష్యం. అమ్మానాన్నలు భూదేవి, భీమప్ప వ్యవసాయం చేసి నన్ను, తమ్ముడు, చెల్లిని చదివిస్తున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నతంగా ఎదిగి పదిమందికి తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం.

అన్నాచెల్లెళ్లు ఒకేసారి..
దేవరకద్ర మండలం బొల్లారం గ్రామానికి చెందిన రాంచందర్‌, బంగారమ్మల కుమార్తె శిరీష.. బసప్ప, శకుంతల కుమారుడు భరత్‌ కానిస్టేబుల్‌ కొలువు సాధించారు. వారిద్దరు అక్కాచెల్లెళ్ల పిల్లలు. శిరీష తల్లిదండ్రులు కూలీ పనిచేస్తారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూనే కోచింగ్‌ తీసుకుని కానిస్టేబుల్‌గా ఎంపికైంది. భరత్‌ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూ ఇంటి వద్ద చదివి పోలీసు ఉదోగ్యాన్ని సాధించారు. ఐపీఎస్‌ కావటమే తమ లక్ష్యమని వారు చెబుతున్నారు.

అన్నదమ్ములు..
గట్టు మండలం అంతంపల్లికి చెందిన అన్నదమ్ములు కొలువు సాధించారు. రైతు తిమ్మారెడ్డికి ముగ్గురు కుమారులను కష్టపడి చదవించారు. ఇందులో ప్రహ్లాదరెడ్డి, సత్యనారాయణరెడ్డి పీజీలు చదివి, తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఇద్దరికీ ఒకే సారి పోలీసు ఉద్యోగాలు రావడంతో కుటుంబంలో సంతోషం వ్యక్తమైంది.

రెండేళ్ల నుంచి ప్రత్యేక శిక్షణ
ఉప్పునుంతుల మండల కేంద్రానికి చెందిన మదనాగుల మల్లేశ్‌ది వ్యవసాయ కుటుంబం. ఐదేళ్ల క్రితం తండ్రి రాములు చనిపోగా అన్నయ్య ప్రోత్సాహంతో రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. పోలీస్‌ కావాలనే కోరికతో బాగా చదివి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. గతంలో కొన్ని మార్కుల తేడాతో ఉద్యోగం తప్పిపోగా ఈసారి సాధించాడు.

నాన్న సహకారంతో..
ఉప్పునుంతలకు చెందిన మదనాగుల వేణుగోపాల్‌ది మధ్య తరగతి కుటుంబం. తండ్రి శ్రీనివాసులు తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కొడుకును పోలీసుగా చూడాలని ప్రోత్సహించారు. హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారదు. తండ్రి సహకారంతో కష్టపడి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. బీఎస్సీ పూర్తి చేసిన వేణుగోపాల్‌ ఈవెంట్స్‌ శిక్షణను వరంగల్‌లో రెండేళ్ల పాటు తీసుకున్నట్లు చెప్పాడు.

ఎస్సై కావడమే లక్ష్యం
ఉప్పునుంతలకు చెందిన మేడమోని మల్లేశ్‌ది వ్యవసాయ కుటుంబం. ఒకవైపు వ్యవసాయంలో కుంటుంబానికి అండగా ఉంటూ మరో వైపు పోలీసు కావాలనే లక్ష్యంతో ప్రయత్నించి కొద్ది మార్కుల తేడాతో తప్పాడు. అయినా కుంగిపోకుండా మళ్లీ పరీక్ష రాసి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న మల్లేశ్‌ ఈ ఉద్యోగంలో చేరి ఎస్సై ఉద్యోగం సాధించేవరకు పోరాడుతానని తెలిపాడు.

నాడు అన్న.. నేడు తమ్ముడు
2018లో ఫలితాల్లో పెద్దతాండ్రపాడు చెందిన రాజశేఖర్‌ బెటాలియన్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తాజాగా ఆయన తమ్ముడు మధు ఎంపికయ్యారు. పేద కుటుంబం నుంచి ఇద్దరూ ఉద్యోగాలు సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

 

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని