• facebook
  • whatsapp
  • telegram

Police Constable Jobs: స్ఫూర్తిగా తీసుకొని.. విజయం సాధించి!

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీసు కానిస్టేబుళ్ల ఫలితాల్లో జిల్లా నుంచి ఎందరో యువతీయువకులు విజయం సాధించారు. కొందరు తండ్రి బాటలో ప్రయాణించగా, మరికొందరు సోదరి, సోదరులను ఆదర్శంగా తీసుకొని గెలుపు బాట పట్టారు. కొన్ని గ్రామాల్లో అధిక మంది విజయం సాధించి ఆ ప్రాంతానికి పేరు తీసుకొచ్చారు. తుది పరీక్షలో ఎంపికైన వీరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తమ కలలను నిజం చేసుకోవడానికి అడుగు దూరంలో నిలిచారు. - న్యూస్‌టుడే, యంత్రాంగం

గీత కార్మికుడి కుమారులిద్దరు పోలీసులు..
కొత్తగట్టు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తీగల రమేశ్‌- స్వరూప దంపతులకు సాయికృష్ణ, మహేశ్‌ ఇద్దరు కొడుకులు. తండ్రి రమేశ్‌ పోలీస్‌ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో 1994 సంవత్సరంలో ఎంపిక కోసం వెళ్లి విఫలమయ్యారు. తండ్రి ఆశయ సాధనలో తనయులు సఫలీకృతులయ్యారు. పెద్ద కొడుకు సాయికృష్ణ పీజీ పూర్తి చేసి రెండో ప్రయత్నంలో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. తమ్ముడు మహేశ్‌ డిగ్రీ పూర్తి చేసి రెండో ప్రయత్నంలో ఏఆర్‌ పోలీస్‌కు ఎంపికయ్యారు. తండ్రి రమేశ్‌ కానిస్టేబుల్‌ కావాలనే కోరికను ఇద్దరు కొడుకులు నెరవేర్చటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెల్లె ఎస్సై.. అన్న కానిస్టేబుల్‌
చొప్పదండికి చెందిన ఎముండ్ల సమత రెండు నెలల క్రితం ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాజాగా ఆమె అన్న రాజశేఖర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. వీరిద్దరు డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి బీరయ్య, బూదవ్వ కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. అన్నాచెల్లెలు ఇద్దరు కలిసి గత ఏడాది నుంచి పోలీసు కొలువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రతి రోజు ఇద్దరు కలిసి సాధన చేసేవారు. గత నెల సమత ఎస్సైగా ఎంపికకాగా రాజశేఖర్‌ స్వల్ప తేడాతో ఎంపిక కాలేదు.

కూలీ పని చేస్తూ..
పేదరికంతో రోజూ కూలీగా పని చేస్తూనే ఇంటి వద్ద సన్నద్ధమై కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన గరిగంటి రమేశ్‌. ఈయన తండ్రి నర్సయ్య నాలుగేళ్ల కిందట మృతి చెందారు. పేద కుటుంబం కావడంతో పదో తరగతి నుంచే రమేశ్‌ కూలీ పని చేస్తూ విద్యాభ్యాసం కొనసాగించారు. ఓ వైపు పని చేస్తూనే ఇంటి వద్దే పత్రికలు, పుస్తకాలు చదివి సన్నద్ధమయ్యారు. ఈనాడు పత్రికలోని ఎడిటోరియల్స్‌ చాలా అంశాలపై అవగాహన పెంచాయని చెప్పారు. టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం రావటం ఆనందంగా ఉందని తెలిపారు. 

అన్న ఆర్మీ.. తమ్ముడు కానిస్టేబుల్‌
చొప్పదండికి చెందిన చిల్ల సునీల్‌కుమార్‌ వాళ్ల అన్న అక్షయ్‌కుమార్‌ 2019 నుంచి ఆర్మీలో సైనికునిగా పని చేస్తున్నారు. మేనమామలు మంద మహేందర్‌ ఆర్మీ, రాజ్‌కుమార్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని సునీల్‌కుమార్‌ బీఏ పూర్తి చేసి పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యారు. ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. వీరి తల్లిదండ్రులు రవి, లత కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు.

తండ్రి బాటలో..
అనగాని జయశంకర్‌ కరీంనగర్‌ మూడో ఠాణాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఈయన కుమారుడు అజయ్‌కుమార్‌ ఎంబీఏ పూర్తి చేసి, తండ్రి బాటలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రెండు సార్లు ప్రయత్నించి.. విఫలమయ్యారు. మూడో సారి పట్టుదలతో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. అనుకున్న లక్ష్యం చేరుకోవడం ఆనందంగా ఉందని అజయ్‌ తెలిపారు.

అక్కాతమ్ముడికి ఒకేసారి..  
గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన అక్కాతమ్ముడు మౌనిక, సాయికృష్ణ ఒకేసారి పోలీసు శాఖలో సివిల్‌ కానిస్టేబుల్‌ కొలువులు సాధించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భూమయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. పెద్ద కుమార్తె విద్యుత్తుశాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తుండగా పీజీ చేసిన రెండో కుమార్తె మౌనిక, బీటెక్‌ చేసిన కుమారుడు సాయికృష్ణలు పోలీసు కొలువే లక్ష్యంగా కష్టపడ్డారు. ఒకేసారి వీరు ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు అభినందించారు. 

భార్యాభర్తలు ఇద్దరూ.. 
మండలంలోని కొలిమికుంటకు చెందిన సత్తు తిరుపతి ఆర్‌ఆర్‌బీలో పొరుగుసేవల విభాగంలో పని చేసేవారు. ఆయన భార్య జక్కుల రవళి 2020లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఇప్పుడు తిరుపతి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. వీరిద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించిన కొద్దిపాటి తేడాతో ఉద్యోగం కోల్పోయారు.

మొగ్దుంపూర్‌ నుంచి 9 మంది
కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌ ఒక్క గ్రామం నుంచే 9 మంది యువకులు ఎంపిక కావడం విశేషం. గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కరీంనగర్‌లో కానిస్టేబుళ్ల శిక్షణ సంస్థ ఏర్పాటు చేశారు. ఈయన వద్ద స్వగ్రామం నుంచి కొంతమంది యువకులు శిక్షణ పొందారు. ఒకే గ్రామం నుంచి 9 మంది యువకులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిని గురువారం గ్రామంలో సంఘ పెద్దలు అభినందించారు.

అన్నాచెల్లెళ్లు..
వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పేద వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. రెడ్డిపల్లికి చెందిన పోతుల ఇందిర-చంద్రయ్య దంపతులది వ్యవసాయ కూలీ కుటుంబం. వీరి కుమారుడు పోతుల శ్రావణ్‌ ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఇతని చెల్లెలు పోతుల నవత డిగ్రీ చదివింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రయత్నం చేసింది.  మొదటి ప్రయత్నంలోనే  గురువారం ప్రకటించిన ఫలితాలలో  ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఒకే కుటుంబంలో అన్నాచెల్లెలు కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 

అక్క ఎస్సై.. చెల్లి కానిస్టేబుల్‌
నిరుపేద కుటుంబానికి చెందిన అక్కా, చెల్లెళ్లు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించి తల్లి కల నెరవేర్చారు. ఆకునూర్‌కు చెందిన పోగుల రాణి కూరగాయలు అమ్ముతూ ఇద్దరు కుమార్తెలను పోషించింది. ఆమె పెద్ద కుమార్తె సుమాంజలి నాలుగేళ్ల క్రితం ఎస్సై ఉద్యోగం సాధించి ప్రస్తుతం నిర్మల్‌లో పని చేస్తున్నారు. చెల్లి స్నేహాంజలి తాజాగా సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే ఆమె హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. గ్రూపు-1 పరీక్షలకు హాజరైంది. ఇద్దరు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలు సాధించడంతో తల్లి ఆనందానికి అవధుల్లేవు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని