• facebook
  • whatsapp
  • telegram

TS Constable Jobs: శ్రమ ఫలించింది.. ప్రయోజనం నెరవేరింది

సింగరేణి శిబిరంలో శిక్షణ పొంది కానిస్టేబుళ్లుగా  ఎంపిక


న్యూస్‌టుడే, గోదావరిఖని: నిరుద్యోగులను ఉపాధి అవకాశాల వైపు ప్రోత్సహించేందుకు చేపట్టిన ప్రయోజనం నెరవేరింది. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరంతో ఫలితం దక్కింది. కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్‌ రావడంతో సింగరేణి సంస్థ దేహదారుఢ్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. మూడు నెలల పాటు పరుగుతో పాటు హై, లాంగ్‌ జంప్‌, షార్ట్‌ఫుట్‌త్రోలో తర్ఫీదు ఇచ్చింది. గోదావరిఖని సింగరేణి క్రీడా మైదానంలో సేవాసమితి ఆధ్వర్యంలో మూడు నెలల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో 180 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 147 మంది శారీరక పరీక్షల్లో ఎంపికయ్యారు. రాత పరీక్షకు అర్హత సాధించిన 147 మందిలో 11 మంది ఉద్యోగాలు సాధించారు. నిరంతరం శ్రమించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను జీఎం శ్రీనివాస్‌ అభినందించారు. మూడు నెలల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు పౌష్టికాహారం అందించారు. ప్రతిరోజు పాలు, గుడ్డు, అరటిపండ్లు ఇచ్చారు.

చాలా కష్టపడ్డా: గువ్వాడి కల్పన
ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాను. నిరుపేద కుటుంబం మాది. ఇద్దరు పిల్లలు. భర్త ప్రైవేటు ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ భారం ఎక్కువవుతోంది. ఆ సమయంలోనే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వచ్చింది. తప్పకుండా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో సింగరేణి సంస్థ ఉచితంగా శిక్షణ ఇస్తుందని తెలిసి శిబిరంలో చేరాను. రోజు వారిగా ఇచ్చే శిక్షణ తీసుకుంటూ మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నించాను. దానికి అనుగుణంగానే సానుకూల ఫలితాలు వచ్చాయి.

నిరుపేద కుటుంబం: సాయికిరణ్‌
మాది చాలా నిరుపేద కుటుంబం. మల్యాలపల్లి గ్రామంలో చిన్నగా నడుపుకుంటున్న ఫ్లోర్‌మిల్‌ ద్వారా వచ్చే ఆదాయంతో నాన్న కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉద్యోగం సాధిస్తే కుటుంబ ఆర్థిక సమస్యను తగ్గించవచ్చని ఆలోచించా. సింగరేణి సంస్థ ఉచితంగా ఇస్తున్న శిక్షణ శిబిరంలో పాల్గొన్నా. మెరుగైన కసరత్తు చేశాను. ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది.

ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా: వివేక్‌
బీటెక్‌ పూర్తి చేశా. ఎలాగైనా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సాధన చేశాను. నాన్న సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నారు. కుటుంబాన్ని నిర్వహించడం కష్టంగా ఉంది. ఉద్యోగం సాధిస్తేనే కుటుంబానికి అండగా ఉంటుందని భావించాను. సింగరేణి సంస్థ నిర్వహించే శిక్షణ శిబిరం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించా. రాత పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యా.

ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపాం: పైడిపల్లి సంపత్‌, శిక్షకులు
ప్రతి అభ్యర్థికి శిక్షణ శిబిరంలో ఉత్సాహాన్ని నింపాం. ఉద్యోగం సాధించడం ద్వారా కలిగే ప్రయోజనంపై అవగాహన కల్పించాం. ఒకవైపు శారీరక సామర్థ్య పరీక్షలకు అవసరమైన విధంగా సిద్ధం చేస్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాం. దీంతో చాలా మంది శారీరక సామర్థ్య పరీక్షల్లో సత్తాచాటారు. రాత పరీక్షల్లో 11 మంది ఎంపికయ్యారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, 2 గెలుపు వ్యూహం

‣ ఆత్మన్యూనతతో అనర్థాలే!

‣ బ్యాంకులో కోర్సు.. ఆపై కొలువు!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని