• facebook
  • whatsapp
  • telegram

CS Jobs: తొలి ప్రయత్నంలోనే నెరవేరిన కల

 

పోలీసు కానిస్టేబుల్‌ ఫలితాల్లో సత్తాచాటిన యువతీ యువకులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబ‌రు 5న విడుదల చేసిన పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాల్లో తిరుమలాయపాలెం మండలంలోని యువతీ యువకులు సత్తా చాటారు. పిండిప్రోలు గ్రామం నుంచి ముగ్గురు, బీరోలు నుంచి నలుగురు అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. వీరంతా తొలి ప్రయత్నంలో విజయం సాధించటం విశేషం.

పిండిప్రోలులో ముగ్గురు..
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన గోకినేపల్లి ఊహిక తల్లిదండ్రులు సత్యనారాయణ, శైలజ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ఊహిక చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలనేది కల. ఇటీవల నీట్‌లో మంచి ర్యాంకు వచ్చినా మెడిసిన్‌లో చేరేందుకు సముఖత చూపలేదు. పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనే లక్ష్యంతో తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. 
కట్టోజు మోహనాచారి తల్లిదండ్రులు భిక్షమయ్య-లక్ష్మమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. బీటెక్‌ పూర్తి చేసిన తరువాత పోలీస్‌ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సన్నద్ధమయ్యారు. ఎలాంటి కోచింగ్‌కి వెళ్లకుండా సొంతంగా చదివి, తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. ఎస్సై కావాలన్నదే తన లక్ష్యమంటున్నారు. 
పప్పుల రాజశేఖర్‌ తల్లిదండ్రులు విజయ్‌కుమార్, రమా. వీరిది వ్యవసాయ కూలీ కుటుంబం. రాజశేఖర్‌ తల్లి రమ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నాటి నుంచి తండ్రికి చేదోడుగా ఉంటూ చదువుకున్నాడు. పోలీస్‌ ఉద్యోగం సాధించాలనే తపనతో కృషి చేశాడు. తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. 

బీరోలు నుంచి నలుగురు
బీరోలుకు చెందిన అమ్మటి రాజేశ్‌ తల్లిదండ్రులు వెంకన్న, శ్రీమతి. మధ్యతరగతి కూలీ కుటుంబం. డిగ్రీ పూర్తి చేసిన తరువాత రాజేశ్‌ పోలీస్‌ నోటిఫికేషన్‌ పడటంతో కోచింగ్‌కి వెళ్లాడు. నిద్రాహారాలు మాని ఉద్యోగమే లక్ష్యంగా కృషి చేశాడు. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు.
రాసాల సాయికుమార్‌ తల్లిదండ్రులు శ్రీనివాస్‌-పద్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్న పడుతున్న కష్టాలు చూసి సాయికుమార్‌ ప్రభుత్వ కొలువు సాధించాలనుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నాడు. పోలీసు నోటిఫికేషన్‌ను సద్వినియోగం చేసుకుని కొలువు దక్కించుకున్నారు.
చెన్నగాని సాయికిరణ్‌ తల్లిదండ్రులు నర్సయ్య-నీలమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. పోలీసు కొలువు ఇతని కోరిక. డిగ్రీ పూర్తి చేసిన తరువాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకొని కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. 
పొదిల దుర్గారావు తల్లిదండ్రులు శ్రీనివాస్‌-సుభాషిణి. వీరిది మధ్యతరగతి కుటుంబం. దుర్గారావు బీటెక్‌ చదివాక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో వచ్చిన కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకుని సత్తాచాటి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 

బోనకల్లు, న్యూస్‌టుడే: పేద కుటుంబాల్లో కొలువుల పంట పండింది. తల్లిదండ్రుల కష్టం చూసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కష్టపడ్డారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించి స్ఫూర్తి నింపారు. 
ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బందం దుర్గాప్రసాద్‌ తండ్రి వెంకటేశ్వర్లు గీత కార్మికుడు. తల్లి వ్యవసాయ కూలీపనులు చేస్తుంది. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు.
బోనకల్లు మండలం ముష్టికుంట్ల వాసి వడిదెల గోపి తండ్రి దగ్గర లేకపోయినా తల్లి కూలీ చేసి తన కుమారుణ్ని చదివించింది. కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. తల్లి పడిన కష్టానికి ఫలితం దక్కింది. 
ముష్టికుంట్లకు చెందిన చాపలమడుగు వర్ధన్‌ తండ్రి బాబురావు లారీ డ్రైవర్, తల్లి జయమ్మ కూలి పనులు చేస్తుంటారు. తమ పరిస్థితి తమ కుమారుడికి ఉండకూడదని కష్టపడి చదివించారు. మొదటి ప్రయత్నంలో ఉద్యోగం రాకపోయినా పట్టుదలో చదివి రెండో ప్రయత్నంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 
రావినూతల గ్రామానికి చెందిన తాళ్లూరి ఎర్రబ్బాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. హోంగార్డుగా పనిచేస్తూ కష్టపడి చదివి కానిస్టేబుల్‌ పరీక్షలు రాసి విజయం సాధించారు. 
రావినూతల గ్రామానికి చెందిన అవునూరి సందీప్‌ తండ్రి బాబురావు టైలర్‌ కాగా, తల్లి సత్యవతి కూలి పనులు చేస్తుంది. తన కుమారుణ్ని ఉన్నత స్థితిలో చూడాలని కష్టపడి చదివించారు. వారి ఆశలకు అణుగుణంగా సందీప్‌ పట్టుదలతో చదివి విజయం సాధించారు.

నాడు సైనికుడు.. నేడు కానిస్టేబుల్‌
ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తరువాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. 105మార్కులు సాధించి సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు బాణాపురానికి చెందిన బెందు వీరబాబు. ప్రజలకు సేవా చేయాలనే లక్ష్యంతో ఎటువంటి శిక్షణ తీసుకోకుండా ఇంటివద్దే సన్నద్ధం అయ్యారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరిలో టాపర్‌గా నిలిచారు. వీరబాబు ఆర్మీలో 17ఏళ్లు పనిచేశారు. ఆర్మీలో సిగ్నల్‌ఆపరేటర్‌గా పనిచేశారు. రిటైర్డ్‌ అయిన తరువాత గ్రామానికి వచ్చిన వీరబాబుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రూపు-3 సాధించడమే తన లక్ష్యమని తెలిపారు.

అమ్మ నమ్మకం నిలబెట్డారు.. 
బాణాపురానికి చెందిన జంగం పవన్‌కుమార్‌ది నిరుపేద కుటుంబం. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. ఇంటర్‌ కోదాడలో, డిగ్రీ ఖమ్మంలో, ఓయూలో ఎంఎస్సీ పూర్తిచేశారు. పవన్‌ ఏడో తరగతిలో ఉండగానే తండ్రి భాస్కర్‌రావు మృతిచెందారు. అప్పట్నుంచి తల్లి తిరుపతమ్మ వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ చదివించింది. పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివాడు. తమ్ముడు పవన్‌కల్యాణ్‌ 2019లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. మూడో ప్రయత్నంలో 136మార్కులు సాధించి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఎస్‌ఐ ఉద్యోగం సాధించడమే లక్ష్యమని తెలిపారు. 

యువత.. ‘ఉన్నతా’శయం
ఉన్నత విద్య అభ్యసించినా కానిస్టేబుల్‌ కొలువులపై మక్కువతో యువతీయువకులు సాధన చేసి విజయం పొందారు. చింతకాని మండలం నుంచి ఎంపికైన పదిహేను మందీ ఉన్నత విద్యావంతులే కావటం గమనార్హం.
చింతకానికి చెందిన పొనుగోటి హేమలత బీటెక్‌ ఇటీవల పూర్తి చేసి గ్రూప్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పోలీసు ఉద్యోగంపై ఇష్టంతో కష్టపడి చదివారు. సివిల్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. హేమలత తండ్రి రత్నాకర్‌ చింతకాని మాజీ ఎంపీపీ.
రైల్వే కాలనీకి చెందిన షేక్‌ మదీనా జేఎన్‌టీయూలో మెటలర్జికల్‌ విభాగంలో ఎంటెక్‌ పూర్తి చేశారు. తండ్రి నాగుల్‌మీరా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆమె సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. 
నాగులవంచకు చెందిన యరనాగుల శ్రీలత ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. ఆమె తండ్రి నాగేశ్వరరావు గ్రామంలో చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 
మధిర మండలం నాగవరప్పాడు గ్రామంలో పేద కుటుంబానికి చెందిన వెలగాల పూర్ణచంద్రరావు ఓయూలో డబుల్‌ పీజీ పూర్తి చేశారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తూ తనను చదివించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగం సాధనే లక్ష్యంగా ఏర్పరచుకున్నారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 
మధిర మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన చావలి కనకరాజు తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తుంటారు. చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమై టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని