• facebook
  • whatsapp
  • telegram

DSP: అక్క డీఎస్పీ.. చెల్లి ఆర్మీ మేజర్‌

* శ్రీకాకుళం యువ‌తుల విజ‌య‌గాథ‌
 


ప్రదీప్తి.. మొన్న గ్రూప్‌-1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై శభాష్‌ అనిపించుకుంది. ప్రతిభ.. ఆర్మీలో మేజర్‌గా రాణిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా విభాగం ప్రతినిధిగా సుడాన్‌లో విధులు నిర్వహించడానికి వెళ్తోంది. ‘ఇద్దరూ ఆడపిల్లలేనా?’ అనే ఇరుగుపొరుగు మాటల్ని పట్టించుకోకుండా రాణించిన ఈ శ్రీకాకుళం అమ్మాయిలు తమ గెలుపు కథని వసుంధరతో చెప్పుకొచ్చారిలా...
ఇద్దరూ ఆడపిల్లలే పుడితే అమ్మానాన్నల మాటేమోకానీ.. ఇరుగుపొరుగు ఒత్తిడి మామూలుగా ఉండదు. ఆ ఒత్తిళ్లను జయించి, కోరుకున్నట్టుగా యూనిఫాం సర్వీసుల్లో అడుగుపెట్టారీ అక్కాచెల్లెళ్లు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని కొర్లకోట వీళ్లది. అమ్మానాన్నలు.. పేడాడ అప్పారావు, సుగుణవేణి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. పిల్లలిద్దరికీ చదువులో, నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వాళ్ల అంచనాలకు తగ్గకుండా వీళ్లూ చదువులో రాణించి బీటెక్‌ పూర్తిచేశారు. ఇక తెలిసినవాళ్లంతా ‘బాగా చదువుతారు కాబట్టి పెద్దగా శ్రమ ఉండని ఐటీ ఉద్యోగమో, బ్యాంకు ఉద్యోగమో ఎంచుకొమ్మ’ని సలహా ఇచ్చారు. కానీ పెద్దమ్మాయి ప్రదీప్తి పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనుకుంటే ...చిన్న అమ్మాయి ప్రతిభ ఆర్మీలోకి వెళ్లాలనుకుంది. ఇందుకు మొదట ఇంట్లోంచే అభ్యంతరం ఎదురైనా.. తర్వాత వాళ్ల ఇష్టానికే వదిలేశారు అమ్మానాన్నలు. కానీ ఈ ఉద్యోగాలకు ఫిట్‌నెస్సేగా కీలకం. ఇందుకోసం గ్రౌండ్‌లో సాధన చేస్తున్నప్పుడు.. ‘హాయిగా పెళ్లిళ్లు చేసుకోక.. ఎందుకొచ్చిన బాధలు’ అంటూ.. అంతా దెప్పిపొడిచినా లక్ష్య సాధనే ధ్యేయంగా శ్రమించారీ అమ్మాయిలు.

 

రెండో ప్రయత్నంలో.....


ప్రదీప్తి 2020లో గ్రూప్‌ 2 పరీక్ష రాసి ఎక్సైజ్‌ శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించింది. విధులు నిర్వహిస్తూనే మరోసారి పరీక్షలు రాసి.. తాజాగా విడుదలైన గ్రూప్‌-1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యింది. ఇక ప్రతిభ 2015లో.. 21 ఏళ్లకే లెఫ్టినెంట్‌గా భారత సైన్యంలో చేరింది. ‘మా అన్నయ్య ఒకరు ఆర్మీలో పని చేస్తున్నారు. ఆయన ద్వారానే అమ్మాయిలు కూడా సైన్యంలో చేరొచ్చన్న విషయం తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నించా. ఆర్మీలో చేరాలంటే ఎస్‌ఎస్‌బీ పాస్‌ అవ్వాలి అన్నారు. రెండు సార్లు ప్రయత్నించాక.. లెఫ్టినెంట్‌గా సెలెక్ట్‌ అయ్యా. శిక్షణ తర్వాత జమ్మూ కశ్మీర్‌, బారాముల్లా బెటాలియన్‌లో పనిచేశా. తర్వాత సిక్కిం, గుజరాత్‌ ప్రాంతాల్లోనూ సేవలందించి కెప్టెన్‌గా, మేజర్‌గా పదోన్నతి సాధించా’అనే ప్రతిభ.. ఇండియన్‌ ఆర్మీ అందించే ప్రత్యేక సైనిక శిక్షణ తీసుకుని కమాండేషన్‌ కార్డ్‌తో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా దళాల విభాగంలో పనిచేసే అవకాశం దక్కించుకుంది. సౌత్‌ సుడాన్‌లో శాంతి స్థాపన కోసం మనం దేశం తరఫున విధులు నిర్వహించేందుకు వెళ్తోంది. ‘అమ్మాయిలు తమకు నచ్చిన రంగం వైపు భయపడకుండా అడుగులు వేసేందుకు కావాల్సిన ధైర్యాన్నివ్వండి. ఆ తర్వాత అద్భుతాలు జరుగుతాయి’ అంటోంది ప్రతిభ.


ఇప్పుడు వాళ్లే ప్రశంసిస్తున్నారు..


‘పిల్లలిద్దరూ ఆర్మీ, పోలీస్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి ఊళ్లో వాళ్లంతా సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెట్టారు. ఆడపిల్లలకి ఇలాంటి ఉద్యోగాలు అవసరమా? అన్నారు. వాటిని మేం లక్ష్యపెట్టలేదు. మాపిల్లలకి మొదటి ప్రయత్నంలోనే ఈ విజయాలు రాలేదు. మధ్యలో ఓటమి ఎదురైంది. ఆ ఒత్తిడి వాళ్లపై పడకుండా జాగ్రత్తపడ్డాం. ఇప్పుడు ఇద్దరూ రాష్ట్రానికీ, దేశానికీ సేవలు అందిస్తుంటే తల్లిదండ్రులుగా మాకు గర్వంగా ఉంది. మొదట దెప్పిపొడిచిన వాళ్లే.. ఇప్పుడు మేం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ సమర్థిస్తున్నారు. మా పిల్లల్నీ ఆర్మీకి పంపిస్తామంటున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఈ మార్పు మాకు సంతోషంగా ఉంది’ అంటున్నారు ప్రతిభ, ప్రదీప్తిల అమ్మానాన్నలు.
 


 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

 

Posted Date: 14-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని