• facebook
  • whatsapp
  • telegram

TS Police Jobs: కష్టపడ్డారు.. కలల కొలువు సాధించారు

 

చంద్రుగొండ, న్యూస్‌టుడే: గానుగపాడు గ్రామానికి చెందిన బెజవాడ కోటేశ్వరరావు కానిస్టేబుల్‌ కొలువు సాధించాడు. తల్లిదండ్రులు వెంకన్న, రమాదేవిలు చదువుకోలేదు. వ్యవసాయ పనులు చేస్తూ కుమారుణ్ని చదివించి ప్రయోజకుణ్ని చేశారు. 

హమాలీ కూతురు కానిస్టేబుల్‌గా.. 
మండల కేంద్రానికి చెందిన జీసీసీ హమాలీ బి.సత్యం కూతురు సమ్మక్క కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. సమ్మక్క తల్లి రమణ దమ్మపేటలో అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా విజేతను పలువురు అభినందించారు.

పేదింటి కుసుమాలు
గుండాల మండల కేంద్రానికి చెందిన దేవసాని అనిల్‌కుమార్‌ రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. అనారోగ్యంతో తండ్రి శ్రీను చిన్నతనంలో మృతి చెందాడు. తల్లి కూలి పనులకు వెళ్తూ చదివించింది. పట్టుదలతో చదివి కానిస్టేబుల్‌ ఉద్యోగం పొందాడు. గుండాలకే చెందిన మరో యువకుడు గుండెబోయిన రాకేష్‌. ఈయన తండ్రి నాగరాజు సైకిల్‌షాపు నడుపుకుంటూ చదివించాడు. అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించాడు. సాయనపల్లి గ్రామానికి చెందిన ఇర్ప నాగేశ్వరావు కుమార్తె కల్పన కూడా నిరుపేద వ్యవసాయ కుటుంబం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చదివి కానిస్టేబుల్‌ ఉద్యోగం సంపాదించింది. పేదరికానికి ఉన్నత చదువులు అడ్డుకాదని నిరూపించింది. ఉద్యోగాలు సాధించడం పట్ల బంధువులు, గ్రామస్తులు, మండలవాసులు పలువురు అభినందనలు తెలిపారు.

దేశ సేవలో తరించాడు..
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు దేశసేవ చేయాలనే తపనతో కష్టపడి ఆర్మీ జవానుగా ఉద్యోగం సాధించాడు. దేశ సేవలో 17 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్నాడు. చలిని సైతం లెక్కచేయక సుమారు 10 సంవత్సరాలు జమ్ముకశ్మీర్‌లో దేశరక్షణ విధులు నిర్వరించాడు. ఉద్యోగ విరమణ అనంతరం విశ్రమించక కృషి చేసిన ఆ యువకుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. ఆయనే పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన ఇల్లందుల శ్రీనివాస్‌. 2005 మార్చిలో జవానుగా విధుల్లో చేరిన అతడు గతేడాది మార్చిలో పదవీ విరమణ పొందాడు. 2022మే లో ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. శారీరక దారుఢ్య, రాతపరీక్షలో విజయం సాధించి కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం శ్రీను ఖమ్మం జిల్లా బూడిదంపాడు పవర్‌గ్రిడ్‌లో డీఆర్‌జీ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్మీజవానుగా దేశసేవ చేసిన శ్రీను ప్రస్తుతం కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడంపై గ్రామస్థులు అభినందిస్తున్నారు.

వరుసగా మూడు పోస్టులకు..
అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన చిన్నూరి రామకృష్ణ ప్రస్తుతం భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంలో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన మళ్లీ కానిస్టేబుల్‌ పరీక్షలు, ఎంపికలకు హాజరయ్యారు. బుధవారం విడుదలైన కానిస్టేబుల్‌ పరీక్షల ఫలితాల్లో రామకృష్ణ వరుసగా టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఏఆర్‌ పోస్టులకు ఎంపికయ్యారు. చిన్నూరి రామకృష్ణ తండ్రి వెంకన్న ఓ రైతు కూలీ. తల్లి నాగమ్మ సాధారణ గృహిణి. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని పేర్కొంటున్నారు.
కరకగూడెం, న్యూస్‌టుడే: కరకగూడెం మండలం కొర్నవల్లి గ్రామానికి చెందిన మాటూరి రాజు ఏఆర్, మాటూరి కోటేశ్వరరావు బెటాలియన్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అనంతారంలోని రైతు కుటుంబానికి చెందిన అత్తె సాయి కుమార్‌ కూడా బెటాలియన్‌ కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు.

ఏడుగురు ఎంపిక
బూర్గంపాడు మండలానికి చెందిన ఏడుగురు కొలువు సాధించారు. మోరంపల్లి బంజరకు చెందిన మారుడి వెంకటేశ్వరరెడ్డి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. ఇదే గ్రామానికి చెందిన ఆర్మీ విశ్రాంత జవాన్‌ పేరం వెంకట్రామిరెడ్డి ఫైర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. బూర్గంపాడుకు చెందిన నర్సింహారావు 2020లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జైలు వార్డెన్‌ ఉద్యోగం పొందారు. బూర్గంపాడుకు చెందిన రఘు, అనూప్‌తోపాటు అంజనాపురం గ్రామానికి చెందిన వినోద్‌ కొలువు సాధించిన వారిలో ఉన్నారు. పోలవరం గ్రామానికి చెందిన శ్వేత ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు.

 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని