• facebook
  • whatsapp
  • telegram

TS Jobs: గురిపెట్టి.. కలల కొలువు సాధించి

హాజీపూర్, న్యూస్‌టుడే: వారు పోలీసు కొలువు సాధనే లక్ష్యంగా ఎంచుకున్నారు. అందుకు తగ్గట్టుగా సన్నద్ధమయ్యారు. పక్కా ప్రణాళిక రూపొందించుకొని పోలీసు ఉద్యోగాలు సాధించిన యువతపై కథనం. 

క్రీడా కోటాలో.. 
రామకృష్ణాపూర్‌ పట్టణానికి చెందిన కలవంద శివకృష్ణ స్పోర్ట్స్‌ కోటాలో సివిల్‌ విభాగంలో ఉద్యోగం సాధించారు. తండ్రి శ్రీనివాస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఉండటంతో బాస్కెట్బాల్‌లో జాతీయస్థాయిలో పలుమార్లు పాల్గొన్నారు. 

కల సాకారమైంది..
పోలీసు ఉద్యోగం సాధించాలనే చిన్ననాటి కల సాకారమైందని టీఎస్‌పీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికైన గెల్లు మహేష్‌ తెలిపారు. హాజీపూర్‌ మండలం పెద్దంపేట పంచాయతీ గొల్లపల్లికి చెందిన గెల్లు లక్ష్మి - రామన్న దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో మొదటి, మూడో కుమారులు సైన్యంలో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు మహేష్‌ తాజాగా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. నెల క్రితం ఐటీబీపీ పోలీసు ఉద్యోగం వచ్చింది.

అన్నదమ్ములు సాధించారు.. 
నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన కామెర సత్యం భాగ్య దంపతుల ఇద్దరు కుమారులు శ్యాంసుందర్, రాజేందర్‌ పోలీసు కొలువులకు ఎంపికయ్యారు. తండ్రి సొంత గ్రామంలోనే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు శ్యాంసుందర్‌ ఎంఫార్మసీ, చిన్న కుమారుడు రాజేందర్‌ ఎంఎస్సీ అగ్రి కల్చర్‌ పూర్తి చేశారు. గతేడాది నుంచి ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలో పోలీస్‌ శాఖలో నోటీఫికేషన్‌ రావడంతో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. పెద్ద కుమారుడు అగ్నిమాపక శాఖలో, చిన్న కుమారుడు సివిల్‌ పోలీస్‌గా ఎంపికయ్యారు. సత్యం తమ్ముడు శ్రీనివాస్‌ కుతురు రమ్య ఏఆర్‌ పోలీస్‌గా ఎంపికయ్యారు. 

బీటెక్‌ చదివి.. 
జనగామ జిల్లా వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన బుడ్డి సంతోష్‌ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ సన్నద్ధమయ్యాడు. సంతోష్‌ పెద్దనాన్న పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఏఎస్సై(ఏఆర్‌)గా విధులు నిర్వహిస్తుండటం, తన సోదరులు సైతం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటంతో వారిని ఆదర్శంగా తీసుకున్నాడు. 2021లో బీటెక్‌ పూర్తి చేసిన సంతోష్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఫైర్‌ విభాగంలో ఉద్యోగం సాధించాడు.

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్‌ గ్రామానికి  చెందిన  కొడిచర్ల రాజ్‌కుమార్‌ గురువారం విడుదలైన కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అంతకు ముందు ఆర్మీకి సంబంధించి సహస్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ)కు ఎంపికయ్యారు. ఏక కాలంలో రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం. 
లక్షెట్టిపేట పురపాలిక పరిధిలోని ఊత్కూరుకు చెందిన దర్శనాల రాకేష్‌ టీఎస్‌ఎస్‌పీˆ ద్వారా నిర్వహించిన కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. దీంతో పాటు గతంలో ఆర్మీ కోసం నిర్వహించిన ఎస్‌ఎస్‌బీకి ఎంపిక కావడం విశేషం. 

ఆ కుటుంబంలో ముగ్గురూ పోలీసులే..
హాజీపూర్‌ మండలం పెద్దంపేటలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొండ గొర్ల మల్లేష్‌ - గంగు దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సివిల్‌ కానిస్టేబుల్, రెండో కొడుకు ఎస్‌ఎస్‌సీ జనరల్‌ గార్డు, మూడో కుమారుడు రాకేష్‌ తాజా ఫలితాల్లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికవడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

అమ్మానాన్నా లేకపోయినా.. 
జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పాదం గట్టుస్వామి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. పాదం సత్యన్న-రాజ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు రాకేశ్, గట్టుస్వామి, మధుకర్‌. తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. అండగా ఉంటుందని ఆశపడిన నానమ్మ మృతిచెందటంతో ప్రస్తుతం తపాల్‌పూర్‌లోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.

చెన్నూరు: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాల పూర్వ విద్యార్థులు అయిదుగురు కొప్పుల వెంకటేశ్, దాసరి వినోద్, బాచు సాయికిరణ్, తోట శ్రీనివాస్, బుద్దారపు దీక్షితలు పోలీసు ఉద్యోగాలు సాధించారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని