• facebook
  • whatsapp
  • telegram

Constable Jobs: కష్టాలను అధిగమించి.. కొలువు సాధించి

 

పోలీస్‌ కొలువు సాధించాలన్నది వారి కల. అందుకు తగ్గట్టుగా కఠోర శిక్షణ తీసుకోవడమే కాకుండా రాత్రింబవళ్లు శ్రమించారు. దేహదారుఢ్య పరీక్షలతో పాటు రాత పరీక్షల్లోనూ సత్తా చాటారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వం తాజాగా పోలీసు కానిస్టేబుళ్ల పరీక్ష ఫలితలను విడుదల చేసింది. ఒకే కుటుంబంలో నలుగురు కొలువులు సాధించారు. దంపతులు, అన్నాచెల్లెళ్లు సైతం ఎంపికవడం విశేషం. ఈ నేపథ్యంలో వారిపై ‘న్యూస్‌టుడే’ స్ఫూర్తిదాయక కథనం.

అమ్మానాన్నల కష్టాన్ని తీర్చాలని..
సిద్దిపేట గ్రామీణ మండలం రావురూకుల గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు. తండ్రి రాములు మేస్త్రీ, తల్లి వ్యవసాయ కూలీ. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరి కుమార్తెలకు వివాహాలు జరిగాయి. వచ్చే అరకొర సంపాదనతో కుటుంబ పోషణకు అమ్మానాన్నలు పడుతున్న కష్టాన్ని గమనించారు కుమారుడు భగవాన్, కుమార్తె మౌనిక. వారి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో సర్కారు కొలువుకు సన్నద్ధమయ్యారు. డిగ్రీ పూర్తిచేశారు. రెండు సార్లు కానిస్టేబుల్‌ పరీక్ష రాయగా విఫలమయ్యారు. మూడోసారి పట్టుదలతో శ్రమించి విజయం సాధించారు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. సిద్దిపేటలో దేహదారుఢ్య పరీక్షలకు శిక్షకుడు ప్రభాకర్‌ వద్ద తర్ఫీదు పొందారు. మౌనిక ఏఆర్, భగవాన్‌ బెటాలియన్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.

ముగ్గురు సోదరులు కలిసి..
సాధారణంగా ఒక ఇంట్లో ఒక ఉద్యోగం రావడమే కష్టమవుతున్న తరుణంలో ముగ్గురు కొలువులు దక్కడం విశేషం. నిజాంపేట మండలం నందిగామకు చెందిన సంగు దుర్గయ్య, లక్ష్మి దంపతులకు కుమారులు ప్రశాంత్, శ్రావణ్, సందీప్‌లు ఉన్నారు. దుర్గయ్య, లక్ష్మిలు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ పిల్లలను చదివించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే ముగ్గురు పదో తరగతి వరకు చదివారు. డిగ్రీ చదువుతూనే మరోవైపు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఓ కంపెనీలో పని చేశారు. 2018లో ప్రశాంత్, శ్రావణ్‌ కానిస్టేబుల్‌ పరీక్ష రాయగా స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగాలు దక్కించుకోలేకపోయారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిని వదిలేసి శ్రమించారు. సందీప్‌ సైతం సోదరులతో కలిసి సన్నద్ధమయ్యారు. వారి కష్టానికి ఫలితం దక్కింది. ముగ్గురూ కొలువులు సాధించడం విశేషం.

వ్యవసాయ కుటుంబం  నుంచి..
సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌కు చెందిన కొల్పుల ప్రకాశ్, లావణ్య ఇద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరిద్దరిది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాలే. తొలిసారి కానిస్టేబుల్‌ ఉద్యోగానికి యత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు ఇంటి వద్దే సొంతంగా సన్నద్ధమయ్యారు. ప్రకాశ్‌ సిద్దిపేటలోని శిక్షకుడు ప్రభాకర్‌ వద్ద, లావణ్య మంత్రి హరీశ్‌రావు ఏర్పాటుచేసిన ఉచిత శిబిరంలో శిక్షణ పొందారు. ఇలా రెండో ప్రయత్నంలో ఉద్యోగాలు సాధించారు. ప్రకాశ్‌ బెటాలియన్, లావణ్యకు ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగాల్లో కొలువులు దక్కించుకున్నారు. ఎస్‌ఐ కొలువుల సాధనే లక్ష్యమని చెబుతున్నారు వీరిద్దరు.

ఒకే ఇంట్లో నలుగురికి..
సిర్గాపూర్‌ మండలం జెమ్లా తండకు చెందిన నెహ్రూనాయక్, మారోనిబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం. నెహ్రూనాయక్‌ దంపతులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గమనించిన వారంతా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తగ్గట్టుగా శ్రమించారు. రమేష్‌కు రోజా అనే యువతితో వివాహం జరిగింది. సర్కారు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా.. వారంతా దరఖాస్తు చేసుకొని సన్నద్ధమయ్యారు. వారి కష్టానికి ఫలితం దక్కింది. అందరూ ఉత్తీర్ణులవడం విశేషం. మెగావత్‌ రమేష్‌ (టీఎస్‌ఎస్పీ), సంతోష్‌ (ఏఆర్‌), కుమార్తె రేణుక (సివిల్‌), రమేష్‌ భార్య రోజా (ఏఆర్‌)లు  కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.

దంపతులిద్దరూ..
సిర్గాపూర్‌ మండలం తొల్యా తండాకు చెందిన దంపతులు రాథోడ్‌ రాజు, సక్కుబాయిలు కానిస్టేబుల్‌ కొలువులు సాధించారు. రాథోడ్‌ రాజు మూడో ప్రయత్నంలో ఉద్యోగం దక్కించుకున్నారు. వీరి కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. ఇద్దరి కుటుంబాలో ఎవరూ సర్కారు కొలువు చేసిన వారు లేకపోవడంతో రాజు ఈ దిశగా అడుగేయాలని నిర్ణయించుకున్నారు. ఐదేళ్లుగా ఇందుకు సన్నద్ధమయ్యారు. కానిస్టేబుల్‌ ప్రకటన వెలువడగానే హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. రెండేళ్ల కిందట సక్కుబాయితో పెళ్లి జరిగింది. ఇక ఇద్దరూ కలిసి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. ఏడాదికాలంగా ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ సిద్ధమయ్యారు. ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసి సత్ఫలితాన్ని దక్కించుకున్నారు.

అన్న ఎస్సైగా.. చెల్లెలు కానిస్టేబుల్‌గా
కల్హేర్‌ మండలం బీబీపేటకు చెందిన కుర్మ పూజ సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఆమె సోదరుడు నవీన్‌చంద్ర ఇటీవల ఎస్‌ఐగా ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. వీరి తండ్రి తోడు లేకపోగా తల్లి గంగామణి అన్ని తానై పోషించారు. ఈమె మెదక్‌ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పిల్లలను శ్రమించి చదివించారు. తల్లిలాగే పోలీసు శాఖలో చేరాలని పూజ, నవీన్‌చంద్ర నిర్ణయించుకున్నారు. ఇందుకు ఎంతో శ్రమించారు. సొంతంగానే సన్నద్ధమయ్యారు. దేహదారుఢ్య పరీక్షలకు సైతం ఇంటి వద్దే సిద్ధమయ్యారు. అన్ని విధాలుగా శ్రమించి నవీన్‌చంద్ర ఎస్‌ఐ ఉద్యోగం సాధించారు. పూజ ప్రస్తుతం కానిస్టేబుల్‌ కొలువు దక్కించుకోవడం విశేషం.

ఖానాపూర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబ‌రు 4న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఖానాపూర్‌ యువకులు సత్తాచాటారు. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో సత్తాచాటారు. ఖానాపూర్‌కు చెందిన గడుగు నిఖిల్, సల్కం శ్రావణి, మస్కాపూర్‌ గ్రామానికి చెందిన జిల్ల శ్రీజ సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన బెజ్జారపు అనిల్, దిలావర్‌పూర్‌ గ్రామానికి చెందిన కామాజి హిటేష్, ఓరగంటి రాకేష్, మేడంపల్లె గ్రామానికి చెందిన అజ్మీరా లత ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన విభూతి ఉపేందర్, నాయిడి సూర్య, ఖానాపూర్‌కు చెందిన శెట్టి శ్రీకాంత్, కొంపెల్లి గణేష్, పాతఎల్లాపూర్‌కు చెందిన రాకేష్‌ టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు. పట్టణంలోని రక్ష డిఫెన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో గురువారం మిఠాయిలు పంచుకుని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 

హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు..
ఖానాపూర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేసి ప్రస్తుతం జన్నారం ఠాణాలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ భుక్య తుకారం కొడుకు భుక్య వంశీకృష్ణ రామగుండం కమిషనరేట్‌ పరిధిలో టీఎస్‌ఎస్‌పీ ఓపెన్‌ విభాగంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. తల్లితండ్రులు తుకారాం-కళావతి దంపతులు ఇచ్చిన ప్రోత్సాహంతో కొలువు సాధించానన్నారు.

‘లక్ష్మీ’ పుత్రులు ఎంపిక
ఒకే గ్రామానికి చెందిన నలుగురు సత్తా చాటి కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఆశ్చర్యమేంటంటే వీరి నలుగురి తల్లులు లక్ష్మి పేరుగల వారే.. నిర్మల్‌ గ్రామీణ మండలం వెంగ్వాపేట్‌ గ్రామానికి చెందిన వీరమల్ల గంగయ్య, లక్ష్మిల కుమారుడు హరీష్‌ జైలు వార్డన్‌గా, గడ్డం చిన్నయ్య, లక్ష్మిల పుత్రుడు దయాకర్, ఆడెపు రాజశేఖర్, లక్ష్మిల కుమారుడు రజనీకాంత్, అంబకంటి రాజేశ్వర్, లక్ష్మిల కొడుకు ప్రణీత్‌లు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సాధించారు. వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు. 

మాదాపూర్‌లో ఆరుగురు..
మండలంలోని మాదాపూర్‌ గ్రామంలో ఆరుగురు ఎంపికయ్యారు. ఎచ్‌. ప్రశాంత్‌ ఏఆర్, ఎం.సాగర్‌రెడ్డి ఏఆర్, ఎ. సురేష్‌ టీఎస్పీ,  ఎ.హరీష్‌ సివిల్,  ఎస్‌.సాయి పరిమళ సివిల్, ఎం.సిందూజ సివిల్‌కు ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు.

అన్నదమ్ములు అనుకున్నది సాధించారు
చేపలవేట వృత్తిగా జీవించే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. కడెంకు చెందిన దీటి తుకారాం, ప్రమీలకు ముగ్గురు కుమారులు. కడెం జలాశయంలో చేపలవేట వీరి ప్రధాన వృత్తి. తండ్రి తుకారాం అనారోగ్య కారణాలతో మూడేళ్ల క్రితం మరణించారు. పెద్ద కుమారుడు రాజు చేపల వేట సాగిస్తున్నారు. రెండో కుమారుడు సాయిచరణ్, మూడో కుమారుడు శివకుమార్‌లు చదువుపై ఉన్న ఆసక్తితో ముందుకు సాగారు.  అన్నదమ్ములూ ఒకేసారి ఉద్యోగం సాధించడంతో ఆ కుటుంబంలో హర్షం వ్యక్తం అవుతోంది. సాయిచరణ్‌ అగ్నిమాపకశాఖలో, శివకుమార్‌ అబ్కారీశాఖలో ఉద్యోగం సాధించారు. వీరిని గురువారం కడెంకు చెందిన పలువురు అభినందించారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని