• facebook
  • whatsapp
  • telegram

సాగుభూమికి రసాయనాల ముప్పు

దేశంలో ఒకప్పుడు పశువుల పేడ, పంట వ్యర్థాలతోనే వ్యవసాయం సాగేది. హరిత విప్లవం తెచ్చిన మార్పులతో రసాయనాల వాడకం పెరిగింది. తెగుళ్లతో పంటలకు నష్టం జరుగుతోందనే ఉద్దేశంతో అవసరానికి మించి రసాయనాలు వాడేస్తున్నారు. సారవంతమైన సాగు భూముల్లో టన్నులకొద్దీ రసాయన మందుల్ని గుమ్మరిస్తున్నారు. ఇప్పుడు పురుగు మందులు, కలుపు నివారిణులు, క్రిమిసంహారకాలు, రసాయనిక ఎరువుల తయారీ పరిశ్రమలు వ్యవసాయ రంగాన్ని శాసిస్తున్నాయి. దీనివల్ల జీవావరణానికి ఎనలేని హాని కలుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎడాపెడా రసాయనాల వాడకం కారణంగా దాదాపు అన్ని వర్గాల ప్రజలపై వివిధ స్థాయుల్లో దుష్ఫలితాలు ఉన్నా- సాగులో ప్రత్యక్షంగా పాలుపంచుకొనే రైతులు, కూలీలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.

ప్రపంచంలో సుమారు 64శాతం సాగు భూమి- స్థాయికి మించిన రసాయనాలతో నిండిపోయింది. ఆసియా ఖండంలోని ప్రకృతి వనరుల్లో పురుగు మందుల అవశేషాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు ‘నేచర్‌ జియోసైన్స్‌’ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. పురుగు మందుల ఉత్పత్తిలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో రసాయన ఎరువులను గణనీయంగా వినియోగిస్తున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉపయోగించే సేంద్రియ ఎరువుల పరిమాణం తక్కువగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రసాయనాలు తగ్గించి ఆ మేరకు రైతులను ప్రకృతిహిత కరమైన ఎరువుల వైపు మళ్ళించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్నవాటిలోనే నకిలీల బెడద నివారించలేకపోతున్న వ్యవస్థ- రైతులను సేంద్రియాలవైపు మళ్ళించేందుకు మరింతగా కృషి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో గ్రామీణ స్థాయిలో వేళ్లూనుకొన్న రసాయన ఎరువుల ప్రభావాన్ని తగ్గించడమూ కత్తిమీద సామే.

నిషేధం ఉత్తిదేనా?

ఏటా వ్యవసాయ సీజన్‌ ముమ్మరంగా ఉన్నప్పుడు కొన్ని పురుగు మందులను నిషేధిస్తున్నా, అవి అప్పటికే రైతుకు చేరి భూమిలో కలిసిపోతున్నాయి. ఇలా ఏటా అంతా అయిపోయాక నిషేధం అని ప్రకటించడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండటం లేదు. పైగా నిషేధం ఉన్న రసాయనిక మాతృకతో తయారైన మందులే, తరవాత వచ్చే సీజన్‌కు మరో బ్రాండ్‌, బ్యాచ్‌ నంబర్లతో కొత్తగా విపణిలోకి వస్తున్నాయి. మళ్ళీ వ్యవసాయ అధికారులు తనిఖీలు చేసి, నమూనాలు సేకరించే సరికి దుకాణాల్లో సరకంతా రైతు చేతికి చేరుతోంది. దీనికి తోడు నమూనాలు సేకరించడానికి సరిపడా సిబ్బంది లేకపోవడం, ఉన్నవారికి అదనపు విధుల భారం పెరగడం, ప్రయోగశాలలు పరిమిత సంఖ్యలో ఉండటం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి అక్రమ, నకిలీ పురుగు మందుల తయారీదారులకు సదవకాశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, ప్రత్యామ్నాయాల వైపు రైతులను మళ్ళించాలని ‘ప్రధానమంత్రి ప్రమోషన్‌ ఆఫ్‌ ఆల్టర్నేట్‌ న్యూట్రియంట్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ (పీఎం-ప్రణామ్‌)’ అనే పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిద్వారా ఎరువులపై కేంద్రం ఏటా భరిస్తున్న సుమారు రూ.1.50 లక్షల కోట్ల రాయితీల భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. రసాయనాలకు ప్రత్యామ్నాయంగా చెప్పుకొనే సేంద్రియ, ప్రకృతిహితకరమైన ఎరువుల ఉత్పత్తి దేశంలో చాలినంతగా లేదు. ఒకవైపు రాయితీలు తగ్గించి, ప్రత్యామ్నాయం లేకపోతే రైతులు తిరిగి నకిలీల బారినపడక తప్పదు. దీనివల్ల నకిలీ ఎరువులు తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఆదిలోనే గండిపడినట్లవుతుంది. ఎరువుల కోసం కొన్ని రాష్ట్రాలు నేరుగా రైతుకు నగదు బదిలీ చేస్తున్న క్రమంలో కేంద్ర నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశమూ లేకపోలేదు. వివిధ రాష్ట్రాల్లోని ప్రయోగశాలలు గత అయిదేళ్లలో ఏ సంవత్సరమూ సామర్థ్యం మేర పురుగు మందుల పరీక్షలు నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని ప్రయోగశాలలు ఏడాదికి చేపట్టాల్సిన నమూనాల విషయంలో సామర్థ్యం మేరకు పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇవి ఏ సంవత్సరమూ లక్ష్యాన్ని అందుకోవడం లేదనే విమర్శలున్నాయి. దేశంలోని అన్ని ప్రయోగశాలల్లో చేపట్టిన పరీక్షల్లో  ఏటా పెద్దసంఖ్యలో నకిలీ బ్రాండ్లను గుర్తిస్తూ వస్తున్నారు. బయట పడుతున్న నకిలీ బ్రాండ్ల సంఖ్య ఏటికేడూ పెరుగుతూనే ఉంది. తనిఖీలు చేపడుతూ, నిషేధాలు విధిస్తున్నా నకిలీల బెడద తగ్గడం లేదు. నకిలీ మందుల కేసులు ప్రతి గ్రామంలో చోటుచేసుకుంటున్నా, కొన్నిసార్లు సమస్య వ్యవసాయ అధికారుల వరకూ చేరడం లేదు. నకిలీ బ్రాండ్లు ఉన్నట్లు బయటపడుతున్నా నిందితులను మాత్రం గుర్తించడంలేదు. ఈ ఉదాసీనతే నాణ్యతలేని మందులు, నకిలీల ఉత్పత్తికి ఊతం ఇస్తోంది. విక్రేతలు మొదలు ఆయా కంపెనీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బలంగా నాటుకుపోవడమే ఇందుకు కారణం. రసాయన ఎరువుల కంపెనీ, దుకాణదారులు గ్రామానికో ఏజెంటును నియమించుకుని రైతులతో వారి ఉత్పత్తులు కొనుగోలు చేయించేలా ప్రేరేపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వినియోగంపై పరిమితులు

పురుగు మందుల వినియోగంపై విధించే పరిమితులు నిర్దిష్టంగా అమలయ్యేలా వ్యవస్థలను పటిష్ఠం చేయాలి. ప్రయోగశాలలు పెరగాలి. విచ్చలవిడిగా వాడుతున్న క్రిమిసంహారకాల వల్ల ప్రకృతి వనరులు దెబ్బతినడమే కాకుండా మన పంటను తీసుకోవడానికి ఇతర దేశాలూ వెనకంజ వేస్తున్నాయనే యథార్థం గ్రహించాలి. క్రిమిసంహారకాలు, కలుపు నివారిణులు, పురుగు మందుల వినియోగాన్ని నిర్దేశిత మోతాదులకు పరిమితం చేస్తూ- సేంద్రియ, ప్రకృతి పద్ధతులతో అధిక దిగుబడులు సాధించడంపై ప్రయోగాలు విస్తృతం చేయాలి. రసాయన రహిత సాగును ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటిస్తే రైతులూ ఆసక్తి చూపుతారు. వ్యవసాయాధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలి. పంట వేసే ముందు భూసార పరీక్షలు తప్పనిసరి చేయాలి. రైతులే చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. ఇందుకు గ్రామసభలు, అధికారుల క్షేత్రపర్యటనలు వేదికలు కావాలి. నకిలీ మందులు విక్రయించే ఉత్పత్తిదారులు, దుకాణదారులు, కొనుగోళ్లను ప్రోత్సహించే మధ్యవర్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి.

ప్రయోగశాలలు అరకొరే...

పురుగు మందులపై పర్యవేక్షణ సాగించే ఇన్‌స్పెక్టర్ల కొరత కూడా అధికంగానే ఉంది. క్షేత్రస్థాయిలో అవసరం మేరకు అధికారులు కరవయ్యారు. పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన రాష్ట్రస్థాయి ప్రయోగశాలలు కూడా అవసరాల మేరకు లేవనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా 71 ప్రయోగశాలలే ఉండటంతో ఏడాదికి సుమారు 77వేల నమూనాలు మాత్రమే పరీక్షించే అవకాశం ఉంది. ఇవి ప్రస్తుత అవసరాలను ఎంతమాత్రం తీర్చలేవు. జీవ ఎరువుల పరీక్ష కేంద్రాలు సైతం దేశంలో అరకొరగానే ఉండటంతో- వ్యవసాయ, రసాయన నిపుణులు ప్రస్తుతం మార్కెట్లో దొరికే జీవ ఎరువుల్లో నాణ్యతను నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది.

- బండపల్లి స్టాలిన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మనోవర్తి... గౌరవ జీవన హక్కు!

‣ వ్యర్థాల దహనం... అనర్థదాయకం!

‣ మరణశిక్షే పరిష్కారమా?

‣ భారత దౌత్యనీతికి పరీక్ష

‣ అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

Posted Date: 23-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని