• facebook
  • whatsapp
  • telegram

లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

భూమి తప్ప మరో బతుకుతెరువు లేదని నమ్మే తరం దేశీయంగా ఇంకా మిగిలే ఉంది. అందుకే ఆటుపోట్లు ఎదురైనా ఎంతోమంది కర్షకులు సేద్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకోకపోవడం, రైతులు సంఘటితంగా లేకపోవడం వంటివి సాగులో ప్రతికూలంగా మారాయి. ఫలితంగా వ్యవసాయంతో ముడివడిన సంక్రాంతి పండుగ నాటి సంతోషకర వాతావరణం పల్లె సీమల్లో కనుమరుగవుతోంది.

ఒకప్పుడు పాడి-పంటలతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు గుండెల నిండా సంతోషం     నింపుకోలేకపోతున్నాయి. రైతు గుండెల్లో నిజమైన పండుగ ఆనందం  కనిపించడం లేదు. ఖర్చులు పెరిగి సాగు గిట్టుబాటు కాక ఇరవై ఎకరాలున్న మోతుబరి రైతు సైతం సేద్యం వదిలేసే పరిస్థితులు దాపురించాయి. దీన్నిబట్టి సాగురంగ సంక్షోభ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు కొంతమేర చర్యలు తీసుకుంటున్నాయి. వారి అసలైన పురోగతికి నిర్దిష్ట వ్యూహాలను మాత్రం అవి అమలు చేయలేకపోతున్నాయి. ఇలాంటి సంక్షుభిత సమయంలోనూ లాభసాటి విధానాల ఆచరణతో సేద్యాన్ని పండుగలా మలచుకున్న వారి నుంచి రైతులు స్ఫూర్తి పొందడం నేడెంతో అవసరం.

సాగులో వైవిధ్యం

రైతువారీగా చూస్తే పంటల సాగులో సంప్రదాయ విధానాలు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మేలైన విత్తనం ఎంపిక నుంచి ఎరువులు, పురుగు మందుల వాడకం దాకా ప్రతి అంశంలో డీలర్లపై ఆధారపడే ధోరణి అధికమైంది. ఒక అధ్యయనం ప్రకారం 70-80శాతం రైతులు అవే పంటలను మళ్ళీ మళ్ళీ సాగు చేస్తున్నారు. దాంతో సేద్యంలో వైవిధ్యం లోపిస్తోంది. క్షేత్రస్థాయిలో సలహాలు అందించేవారు లేక డీలర్లు సరఫరా చేసిన ఎరువులు, విత్తనాలనే అన్నదాతలు ఆశ్రయిస్తున్నారు. ఆ క్రమంలో వారి జేబులు గుల్ల అవుతున్నాయి. ఎరువుల డీలర్లు కోట్లు గడిస్తున్నారు. వ్యవసాయ విభాగంలో పట్టభద్రులైన వారికే డీలర్‌షిప్‌ ఇచ్చే అంశంపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఈ దోపిడి నిరాటంకంగా సాగుతోంది. రైతుల్లో ఐక్యత లేకపోవడం వల్ల లాభసాటి సేద్యానికి వారు దూరం కావాల్సి వస్తోంది.

అన్నదాతల్లో ఒకప్పుడున్న సహకార ధోరణి రాజకీయ జోక్యంతో నాశనమైంది. ఒక్కరుగా సాధించలేనిది సమష్టిగా పొందడం అనే నినాదంతో సహకార, ఉమ్మడి వ్యవసాయ విధానాలు అయిదు దశాబ్దాల క్రితం ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఎంతో విజయవంతమైన ఆ విధానాలు రాజకీయ జోక్యం, సభ్యుల మధ్య అనైక్యత, ప్రభుత్వాల తోడ్పాటు లేకపోవడంతో నీరుగారిపోయాయి. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన సహకార ఉద్యమం తరవాతి కాలంలో కనుమరుగైంది. అక్కడక్కడా ఒకటి రెండు సహకార సంఘాలు నాటి వైభవానికి చిహ్నంగా మిగిలాయి. సంఘటితంగా సేద్యం చేసే పరిస్థితులు లేకపోవడంతో విత్తన సేకరణ నుంచి ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించుకొనే దాకా రైతులు ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదు. మహారాష్ట్రలో విజయవంతమైన ఉత్పత్తిదారుల సహకార సంఘాల స్ఫూర్తితో నేడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ) దేశంలో ఒక ఉద్యమంలా ఏర్పాటవుతున్నాయి. కమ్యూనిటీ వ్యవసాయం అన్నది సహకార సేద్యానికి నేడు పర్యాయపదంగా మారింది. ఒకే తరహా భావజాలం కలిగిన కొందరు రైతులు ఒక బృందంగా ఏర్పడి ఒక ప్రాంతంలో పంటలు సాగు చేసి, తమ వాటాల మేరకు వచ్చిన లాభాన్ని పంచుకోవడమే కమ్యూనిటీ వ్యవసాయం. ఈ పద్ధతిలో కొందరు సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మరికొందరు వాణిజ్య పంటలు పండిస్తున్నారు. ఎగుమతుల్ని దృష్టిలో ఉంచుకొని ఒక బ్రాండ్‌ పేరుతో ఆయా ఉత్పత్తులకు విలువ సైతం జోడించి లాభాలు గడిస్తున్నారు. ఈ తరహా సేద్యం ఇజ్రాయెల్‌లో సత్ఫలితాలు అందిస్తోంది. ఇలాంటి కమ్యూనిటీ వ్యవసాయ సమూహాలను ఇజ్రాయెల్‌లో ‘కిబుట్జ్‌’ అంటారు. ఉత్పత్తి, సాంకేతికత కలబోతగా కిబుట్జ్‌లు ఆ దేశపు మొత్తం వ్యవసాయోత్పత్తుల్లో దాదాపు సగం వాటా కలిగి ఉన్నాయి. సభ్యులందరూ పరస్పర సహకారంతో ఎల్లలెరగని సాంకేతికతను సొంతం చేసుకుని అద్భుతాలను సృష్టిస్తున్నారు. భారత్‌లోనూ ఎఫ్‌పీఓలకు తోడు కమ్యూనిటీ వ్యవసాయ విధానాలు విస్తృతంగా అమలైతే తప్ప రైతుల పరిస్థితిలో మార్పు సాధ్యం కాదు.

స్వయంపోషకంగా...

ఒక గ్రామంలో వెయ్యి కుటుంబాలకు సరాసరిన ఒక్కో కుటుంబానికి నెలకు నిత్యావసర సరకులకు మూడు వేల రూపాయల దాకా ఖర్చువుతాయనుకుంటే, వారంతా కలిసి మాసానికి రూ.30 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు లెక్క. రైతు ఉత్పత్తిదారుల సంఘమే ఆ సరకులను సరఫరా చేయగలిగితే ఉభయతారక ప్రయోజనం దక్కుతుంది. తాము పండించిన వాటికి తోడు తమ వద్ద లేని వాటిని సరకు మార్పిడి పద్ధతి ద్వారా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకొని గ్రామ అవసరాలు తీర్చవచ్చు. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తుల విక్రయాలకు బయటి ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఉత్పత్తిదారుల సంఘంగా రైతులు ఈ దిశగా వేసే ప్రతి అడుగూ అద్భుత విజయాలకు నాంది పలికే అవకాశం ఉంది. గ్రామంలో మొదట అందరూ కలిసి రాకపోయినా, ఇతరుల విజయాలను చూశాక వారిలో మార్పు వస్తుంది. అప్పుడు ప్రతి పల్లె స్వయం పోషకంగా మారుతుంది. తద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుంది. ప్రతి ఒక్కరిలో నిజమైన సంక్రాంతి సంతోషం వెల్లివిరుస్తుంది.

విలువ జోడించేలా...

సాగును దండగలా కాకుండా పండుగలా మార్చడం పాలకుల వల్ల కాదని పదే పదే నిరూపితమవుతోంది. అందుకే రైతులు ఎవరికివారు సంఘటితం కావాల్సిందే. ఒక్కరుగా సేద్యంలో నిత్యం సంఘర్షణ అనుభవిస్తూ నష్టాలతో చెలిమి చేసేకంటే సంఘటితంగా తమ ఉత్పత్తికి మంచి ధర వచ్చే నైపుణ్యాలకు సానపట్టడం ఉత్తమం. ప్రతి పంటకూ విలువ జోడించేలా రైతులందరూ కలిసి నడిస్తే స్థానిక ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులోకి తేవచ్చు. రైతులు సంఘంగా ఏర్పడినప్పుడే ఉభయతారకంగా ఉండే ఇలాంటి ఆలోచనలు ఫలిస్తాయని గ్రహించాలి. ఒక వ్యక్తిగా రాని రుణాలు సంఘంగా సులువుగా లభిస్తాయి. అప్పు తీర్చే శక్తి సైతం పెరుగుతుంది. కొత్తగా ఆలోచించే విధానం తెలుస్తుంది. ఆయా సంఘాలలో చదువుకున్న రైతులు ఉంటారు కాబట్టి మార్కెట్ల అన్వేషణ, చిన్న తరహా స్థాయిలో ఆహారశుద్ధి వంటివి సాధ్యమై ఆదాయం వృద్ధి చెందుతుంది. అంకుర సంస్థల తోడ్పాటుతో సాంకేతికతను అందిపుచ్చుకొంటూ మార్కెట్‌ నైపుణ్యాలతో సాగితే రైతులకు అన్ని రకాలుగా లాభం కలుగుతుంది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మౌలిక వసతులే భవితకు బాటలు

‣ నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు

‣ మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!

‣ ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతి

‣ తుర్కియే జిత్తులకు పైయెత్తు!

Posted Date: 14-01-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని