• facebook
  • whatsapp
  • telegram

సాకారం కాని స్వప్నం... రెట్టింపు ఆదాయం!

రైతుల ఆదాయం రెట్టింపు (డీఎఫ్‌ఐ) కావాలని ప్రధాని మోదీ నిర్ణయించిన గడువు 2022తో ముగిసింది. మరో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని ప్రకటించినప్పుడు అన్నదాతల్లో చిగురించిన ఆశలు అడియాసలయ్యాయి. డీజిల్‌ సహా పలు రకాల వ్యవసాయ సామగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సాగు ఖర్చులు భారీగా ఎగబాకాయి. ఆదాయాలు మాత్రం పెరగలేదు.

పంట సాగువ్యయంపై మరో 50శాతం కలిపి మద్దతు ధరలు ఇస్తున్నట్లు చెబుతున్న కేంద్రం- 2022 చివరికల్లా రైతుల ఆదాయం రెట్టింపయిందా లేదా అనేది మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. డీఎఫ్‌ఐ ప్రకటించినప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్రం అమలులోకి తెచ్చిన కొన్ని పథకాలను పలు రాష్ట్రాలు అమలు చేయడం లేదు. రైతు సంక్షేమం, పంటల దిగుబడులు పెంచడానికంటూ కేంద్రం ప్రవేశపెడుతున్న కొన్ని పథకాల అమలుకు రాష్ట్రాలు నిరాకరించడం వల్ల ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో కనిపించే పరిస్థితికి చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయి. పంజాబ్‌లో 2019-20లో హెక్టారుకు 4527 కిలోల ఆహార ధాన్యాలు పండాయి. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్రలో 1163, కర్ణాటకలో 1658, ఏపీలో 3022, తెలంగాణలో 3483 కిలోల దిగుబడి వచ్చింది. ఒక హెక్టారుకు పండే సగటు పంటను ఉత్పాదకత అని పిలుస్తారు. ఇది పెరగనంతకాలం రైతుల ఆదాయం ఇనుమడించదని వ్యవసాయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒక హెక్టారు వ్యవసాయ భూమిలో సాగుచేసిన పంట నుంచి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)కి ఎంత విలువ అదనంగా కలిసిందనే దాన్నిబట్టి ఆయా రాష్ట్రాల్లో రైతుల ఆదాయంపై అంచనా ఏర్పడుతుంది. పలుచోట్ల పెద్దగా విలువ లేని పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నందువల్ల రాష్ట్రాల స్థూల ఉత్పత్తి విలువతోపాటు, రైతుల ఆదాయం కూడా పెద్దగా పెరగడం లేదని తెలుస్తోంది.

కొత్త వంగడాలతోనే...

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని 2016లో ప్రకటించిన తరవాత నీతిఆయోగ్‌ అందుకు అవసరమైన ప్రణాళికను వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి పంటలబీమా యోజన, యంత్రాలపై రాయితీ, పీఎంకిసాన్‌, ఎలెక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌) వంటి పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. ఒక వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తెచ్చిన పంటను ఆన్‌లైన్‌లో చూసి దేశంలో ఎక్కడ ఉన్న వ్యాపారైనా నేరుగా కొనుగోలు చేయాలనేది ఈ-నామ్‌ పథకం లక్ష్యం. ఇది అమలులోకి వచ్చి ఏడేళ్లయినా ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రాలేదు. విపత్తుల వేళ పంటలు దెబ్బతిని రైతు నష్టపోతే ఆదుకోవడానికి ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని తీసుకురాగా- ఏపీ, తెలంగాణ, ఝార్ఖండ్‌, పశ్చిమ్‌బెంగాల్‌ వంటి రాష్ట్రాలు దీని అమలును నిలిపివేశాయి. పురాతన విత్తనాలనే ఏటా పండిస్తుంటే ఉత్పాదకత పెరగదని, ఏటా కొత్త వంగడాల ధరలపై రాయితీ ఇవ్వాలని కేంద్రం చెబుతోంది. ఉదాహరణకు గత పదేళ్లలో శాస్త్రవేత్తలు విడుదల చేసిన కొత్త వరి వంగడాలను రైతులు కొంటే క్వింటా ధరలో వెయ్యి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా చెల్లించాలి. ఇలా విత్తనాలపై రాయితీ ఇచ్చే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా పూర్తిగా నిలిపివేసింది. ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం శాస్త్రవేత్తలు విడుదల చేసిన సాంబమసూరి వరి వంగడాన్నే తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశమంతటా లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన వందలకొద్దీ వంగడాలు సాగు చేయడానికి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కనీసం కొద్దిపాటి రాయితీనైనా విత్తన ధరలపై ఇవ్వడం లేదు. విత్తన మార్పిడి జరగకపోతే పంటల దిగుబడి పెరగదని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాలు కనీసం రాయితీలైనా ఇచ్చి కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకురావడంలేదు. అది జరగనంతవరకు ఉత్పాదకత, రైతుల ఆదాయం పెరగడం కష్టం. కూలీల కొరత కారణంగా సాగు పనులు చేసే మానవ వనరులు లభ్యంకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరుతుందని తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదు.

ప్రోత్సాహకాలతో మార్పు

హెక్టారులోపు భూమి ఉన్న చిన్నకారు రైతు కుటుంబం నెలవారీ ఆదాయం 2012-19 మధ్య రూ.5247 నుంచి రూ.8495కి పెరిగింది. ఏడాదికి 3.1 శాతం వృద్ధిరేటుతో రైతు ఆదాయం రెట్టింపు చేయాలనే కల నెరవేరడం కష్టమని నాబార్డు నివేదిక స్పష్టంచేసింది. ఆదాయం పెరగాలంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాలు రాయితీపై సమకూర్చడం మొదలుకుని, కూలీల కొరత తీర్చడానికి ఉపాధిహామీని వ్యవసాయానికి తక్షణం అనుసంధానించాలి. వ్యవసాయ యంత్రాలతో పనులు చేస్తే సమయంతో పాటు డబ్బూ ఆదా అవుతుంది. వ్యవసాయ యంత్రాలను రాయితీపై ఇవ్వడానికి, పంటలను మద్దతు ధరకు కొనడానికి కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లలో పెద్దయెత్తున నిధులు కేటాయించాలి. వ్యవసాయ పరిశోధన సంస్థలు విడుదల చేసే కొత్త వంగడాలను తప్పనిసరిగా రైతుల సాగుకు ఇవ్వాలి. వ్యవసాయ పరిశోధనలకు నిధులు పెంచాలి. దిగుబడులకు మార్కెటింగ్‌ అవకాశాలు ఇనుమడింపజేసి అధిక ధరలు రావడానికి దోహదపడేలా కొత్త పరిజ్ఞానంతో ముందుకొస్తున్న అంకుర సంస్థలకు చేయూతనివ్వాలి. వాతావరణ మండలాల ఆధారంగా ఏ జిల్లాలో ఏ భూమిలో ఏ పంట అధికంగా పండుతుందో గుర్తించి అక్కడ పంటల కాలనీలు ఏర్పాటు చేయాలి. ఈ పంటలను అధిక ధరలకు అమ్ముకోవడానికి, వాటిని సాగుచేసే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు నెలకొల్పి వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించకుండా కేవలం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం ద్వారానే పంటల దిగుబడి, ఆదాయం పెరగవన్న సంగతి గుర్తించాలి.

దక్కని మద్దతు

రైతుల ఆదాయం ఇనుమడింపజేయడానికి మద్దతు ధరలు పెంచుతున్నట్లు చెబుతున్న కేంద్రం ఆ ధరలకే పంట ఉత్పత్తులను కొనడం లేదు. ఒక రాష్ట్రంలో ఒక పంట దిగుబడిలో 25 శాతమే, అదీ కొన్ని పంటలనే పరిమితంగా కొంటామని మెలికపెట్టింది. పలు రాష్ట్రాలు పంటలను కొనడం లేదు. వరిధాన్యం, గోధుమలను మద్దతు ధరకు కొన్నట్లుగా మిగిలిన పంటల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కొనకపోవడం వల్ల మార్కెట్లలో ఎక్కువ డిమాండు, విలువ ఉన్నవాటిని సాగు చేయడానికి రైతులు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు. వంటనూనెలను విదేశాల నుంచి కొనడానికి ఏటా వెచ్చిస్తున్న నిధుల్లో కనీసం పదోవంతునైనా నూనెగింజల పంటల సాగుకు విత్తనాలపై రాయితీ, మద్దతు ధర కోసం ఖర్చుచేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దక్షిణాసియాకు వాయుగండం

‣ కృత్రిమ మేధా విప్లవం

‣ కొత్త ప్రధానికి సవాళ్ల స్వాగతం

ఓటు... ప్రజాస్వామ్య జీవనాడి!

‣ మహాసాగరంలో ఆధిపత్యపోరు

‣ పచ్చని ఉదజని తోడుంటే...

Posted Date: 28-01-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని