• facebook
  • whatsapp
  • telegram

కొత్త ప్రధానికి సవాళ్ల స్వాగతం

కొవిడ్‌ కష్టకాలంలో న్యూజిలాండ్‌ను సమర్థంగా నడిపించిన జెసిండా ఆర్డర్న్‌ ప్రధాని పీఠం నుంచి ఇటీవల ఆశ్చర్యకర రీతిలో వైదొలగారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆమె రాజీనామా లేబర్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయడంతోపాటు ఇండియా వంటి కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం కొత్త ప్రధాని ఎదుట నిలిచిన సవాళ్లు!

పసిఫిక్‌ ద్వీపదేశమైన న్యూజిలాండ్‌ రాజకీయాల్లో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయిదేళ్లుగా ఆ దేశ ప్రధాని పదవిలో కొనసాగిన జెసిండా ఆర్డర్న్‌ రాజీనామా చేయడం, ఆమె సహచర నేత క్రిస్‌ హిప్‌కిన్స్‌ ఆ పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. 2017లో న్యూజిలాండ్‌ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టే నాటికి జెసిండా వయసు కేవలం 37 ఏళ్లు. అప్పటికి ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రభుత్వాధినేతగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రధానిగా జెసిండా ప్రగతిశీల విధానాలను అనుసరించారు. ముఖ్యంగా కొవిడ్‌ కాలంలో దేశాన్ని సమర్థంగా నడిపించారు. 2019లో క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో కాల్పులతో మారణహోమం చోటుచేసుకున్నప్పుడు ఆమె స్పందించిన తీరూ అందరినీ ఆకట్టుకుంది. దేశంలో తుపాకుల వినియోగాన్ని పరిమితం చేసేలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో విద్వేష ప్రసంగాలను అరికట్టేలా చర్యలు చేపట్టారు. వీటన్నింటి ఫలితంగా జెసిండా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కొవిడ్‌ కట్టడిలో...  

న్యూజిలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం అనివార్యమవుతుంటుంది. కానీ జెసిండాకు ఉన్న అమిత ప్రజాదరణ కారణంగా- ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్‌ పార్టీ 2020లో ఒంటరిగా గద్దెనెక్కేందుకు సరిపడా స్థానాలను దక్కించుకుంది. అదే ఏడాది జెసిండా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తరవాత కొన్ని నెలలపాటు అంతా సవ్యంగానే సాగినా- క్రమంగా ప్రతికూల పవనాలు మొదలయ్యాయి. కరోనా విజృంభణ తొలినాళ్లలో దేశాన్ని ముందుకు నడిపించినంత సమర్థంగా చివరి దశల్లో ఆమె వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి. కొవిడ్‌ కట్టడిలో ఆమె తీరుపై నిరసన ప్రదర్శనలు కూడా చోటుచేసుకున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు పెరిగిపోయాయి. మాంద్యం ముంచుకొస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే ఆ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించడం సులువుకాదని సర్వేలు అంచనా వేశాయి. విపక్ష నేషనల్‌పార్టీకి ఆదరణ పెరిగిందని తేల్చాయి. వీటికితోడు జెసిండాకు కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌లో వేధింపులు, బెదిరింపులు పెరిగాయి. ఈ పరిస్థితులన్నీ జెసిండా రాజీనామాకు దారితీసి ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

జెసిండా తరవాత ప్రధాని పగ్గాలు చేపట్టిన క్రిస్‌ హిప్‌కిన్స్‌ ముందు ప్రస్తుతం కఠిన సవాళ్లున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, లేబర్‌ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం వాటిలో ముఖ్యమైనవి. ఇండియాతో సంబంధాల విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారన్నదానిపైనా ఆసక్తి నెలకొంది. వ్యూహాత్మక ప్రాముఖ్యం కలిగిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో న్యూజిలాండ్‌ కీలకం. ఆ దేశంలో ప్రవాస భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రధానంగా సాంకేతిక, సైబర్‌, పరిశోధన-అభివృద్ధి వంటి రంగాల్లో మన దేశం నుంచి నిపుణులు అక్కడికి వలస వెళ్తున్నారు. వ్యాపారాలను విస్తరింపజేస్తున్నారు. అయినప్పటికీ ఇరుదేశాల బంధం ఇంకా పూర్తిస్థాయిలో బలపడలేదనే చెప్పాలి.

స్తబ్ధత వీడుతుందా...

కొన్నేళ్ల క్రితం ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సెప్‌)’లో ఇండియా భాగస్వామిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరే దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. ఆర్‌సెప్‌ నుంచి మన దేశం బయటికొచ్చాక ఆ విషయంలో స్తబ్ధత నెలకొంది. డిజిటల్‌ సర్వీసులు సహా కొన్ని రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్ళడంపైనే ప్రధానంగా సమాలోచనలు జరుపుతున్నాయి. కరోనా విజృంభణ కాలంలో స్వదేశానికి తిరిగివచ్చిన భారతీయ విద్యార్థులను మళ్ళీ తమ దేశంలోకి అనుమతించడంలో న్యూజిలాండ్‌ చేసిన తాత్సారం ఇరు దేశాల మధ్య కొంతమేర దూరాన్ని పెంచింది. నిరుడు అక్టోబరులో న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ ఈ విషయంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ సౌరకూటమిలో ఇప్పటికి వందకుపైగా దేశాలు చేరాయి. వెల్లింగ్టన్‌ మాత్రం దానికి దూరంగానే ఉంది. ఈ నేపథ్యంలో హిప్‌కిన్స్‌ క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇండో-పసిఫిక్‌లో బలమైన శక్తుల్లో ఒకటైన ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తూ, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నెలకొల్పాలి. రక్షణ, విద్య, పర్యావరణం వంటి రంగాల్లో కలిసి నడవడం ద్వారా పరస్పర ప్రయోజనాలు పొందవచ్చు. పెట్టుబడులను ఎరగా వేస్తూ పసిఫిక్‌ ద్వీపదేశాలపై పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీతో బంధాన్ని బలోపేతం చేసుకొంటూ, ప్రాంతీయంగా పట్టును నిలుపుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వావలంబనే పటుతర రక్షణ

‣ భావోద్వేగాల‌పై ప‌ట్టు పెంచుకోండి!

‣ లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

‣ మౌలిక వసతులే భవితకు బాటలు

Posted Date: 27-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం