• facebook
  • whatsapp
  • telegram

మహాసాగరంలో ఆధిపత్యపోరు

భారత్‌, చైనా ముందునుంచీ భూతల సైన్యం, గగనతల వైమానిక సేనలకు పెద్దయెత్తున సాధన సంపత్తిని సమకూర్చేందుకు ప్రాధాన్యం ఇచ్చాయి. ఇప్పుడు నౌకాదళాల బలోపేతంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. సముద్ర జలాల్లో పైచేయి కోసం పోటీ పడుతున్నాయి. ఇందుకోసం పోటాపోటీగా నావికా బలగాలను విస్తరించుకుంటున్నాయి.

ప్రస్తుతం నౌకా బలంలో అమెరికా తరవాత చైనా రెండో స్థానంలో నిలుస్తోంది. భారత్‌ ఏడోస్థానంలో ఉంది. ‘ఆధునిక యుద్ధ నౌకల ప్రపంచ డైరెక్టరీ-2022’ వెల్లడించిన వివరాలివి. ప్రజావిమోచన సైన్య నౌకా బలగం (పీఎల్‌ఏఎన్‌-ప్లాన్‌)గా చెప్పుకొనే చైనా నౌకాదళం గత పదేళ్లలో 130 యుద్ధ నౌకలు, జలాంతర్గాములను సమకూర్చుకొంది. ఇప్పుడు ఏకంగా 355 యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో సంఖ్యాపరంగా ప్రపంచంలో అతి పెద్ద నౌకా బలగంగా నిలుస్తోంది. 2025కల్లా 400 నౌకలు, జలాంతర్గాములను ప్లాన్‌ సమకూర్చుకొంటుందని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ అంచనా. మరోవైపు, ప్రస్తుతం భారత నౌకా దళానికి 139 నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. 2027కల్లా 200 నౌకలను సమకూర్చుకోవాలని ఆశిస్తున్నా- రాగల సంవత్సరాల్లో మొత్తం నౌకల సంఖ్య 170కి చేరవచ్చు. ప్రస్తుతం భారత్‌ 39 జలాంతర్గాములు, యుద్ధ నౌకలను నిర్మిస్తోంది. ప్లాన్‌కు 20వేల మంది మెరైన్‌ సైనికులు సహా మొత్తం 2,35,000 మంది సిబ్బంది ఉన్నారు. 2019 నాటికి భారత నౌకాదళ సిబ్బంది సంఖ్య 67వేలు మాత్రమే.

నిధుల పెంపు...

భారీ పరిమాణంలో ఉండే యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లుగా, మధ్యతరహా నౌకలను ఫ్రిగెట్లుగా, అంతకన్నా చిన్నవాటిని కోర్వెట్‌లుగా వ్యవహరిస్తారు. కోర్వెట్లు భూభాగానికి సమీపంలో సముద్ర తీరంలో కార్యకలాపాలు సాగిస్తే- డిస్ట్రాయర్లు, ఫ్రిగెట్లు సముద్రాల్లో బాగా దూరం వెళ్ళి దాడులు చేయగలవు. రెండు దేశాలూ డిస్ట్రాయర్‌, ఫ్రిగెట్‌, కోర్వెట్‌ నౌకలతోపాటు జలాంతర్గామి బలగాన్నీ విస్తరిస్తున్నాయి. విమాన వాహక నౌకలనూ సమకూర్చుకొంటున్నాయి. సముద్ర జలాలపై నిఘా సామర్థ్యాలను పెంచుకొంటున్నాయి. భారత రక్షణ బడ్జెట్‌లో నౌకాదళానికి ఇదివరకటికన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నా, చైనా అంతకు ఎన్నోరెట్లు వెచ్చిస్తోంది. చైనాకు లియావోనింగ్‌, షాండోంగ్‌, ఫ్యూజియాన్‌ అనే మూడు విమాన వాహక నౌకలు ఉండగా- భారత్‌ అమ్ముల పొదిలో విక్రమాదిత్య, విక్రాంత్‌ అనే రెండు విమానవాహక నౌకలు ఉన్నాయి. 2050కల్లా 10 విమాన వాహక యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలనేది చైనా ధ్యేయం. సముద్ర పరీక్షలు సాగిస్తున్న ఫ్యూజియాన్‌ అధికారికంగా 2024లో చైనా నౌకాదళంలో చేరుతుంది. మొట్టమొదటి చైనా విమాన వాహక నౌక లియావోనింగ్‌పై విమానాలు ఎగరడానికి, దిగడానికి విశాలమైన ఉపరితలం (డెక్‌) ఉంది. అది విక్రమాదిత్య డెక్‌ కన్నా పెద్దది. అందువల్ల లియావోనింగ్‌ ఎక్కువ విమానాలు, బాంబులు, క్షిపణులను తరలించగలుగుతుంది. భారత్‌ కూడా విశాల్‌ అనే భారీ విమాన వాహక నౌకను నిర్మించాలని భావిస్తున్నా- నిధుల కొరత వల్ల విక్రాంత్‌ తరహా చిన్న నౌకనే నిర్మించాలని యోచిస్తోంది.

ఆత్మనిర్భరత...

క్షిపణులను ప్రయోగించే విశాఖపట్నం తరగతి డిస్ట్రాయర్‌ నౌకలు 2024కల్లా సిద్ధమవుతాయి.7,400 టన్నుల బరువుండే ఈ నౌకలు నాలుగింటిని భారత్‌ నిర్మిస్తోంది. ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ యుద్ధనౌకను ఇటీవలే రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. మరోవైపు చైనా 7,500 టన్నుల నౌకల నుంచి 13వేల టన్నుల డిస్ట్రాయర్లకు మారిపోయింది. ఇలాంటి 12 నౌకలను నిర్మించిన తరవాత మరింత బరువైన యుద్ధ నౌకల నిర్మాణం చేపట్టాలని చైనా యోచిస్తోంది. చైనా నౌకాదళ ఫ్రిగెట్లకు నేలపైకి, నింగి, నీటిలోకి కాల్పులు జరిపే శక్తి ఉంది. భారత్‌ వద్దనున్న ఫ్రిగెట్లకూ ఈ సామర్థ్యం ఉంది. ఇప్పుడు కొత్తగా రష్యా నుంచి రెండు శక్తిమంతమైన తల్వార్‌ తరగతి ఫ్రిగెట్లను కొనుగోలు చేస్తోంది. అవి 2023, 2024లో భారత నౌకాదళానికి చేరతాయి. తల్వార్‌ తరగతి నౌక తడవకు ఒక్క క్షిపణిని ప్రయోగించగలిగితే చైనా ఫ్రిగెట్లు ఏకకాలంలో అనేక క్షిపణులను ప్రయోగించగలవు. చైనా నౌకాదళం 2013 నుంచి 50కి పైగా కోర్వెట్‌లను సమకూర్చుకొనే పనిలో ఉంది. శత్రు జలాంతర్గాముల పనిపట్టే కమోర్తా తరగతి కోర్వెట్‌లు నాలుగింటిని భారత్‌ సమకూర్చుకొంది. తీరానికి సమీపంలో లోతు తక్కువగా ఉండే జలాల్లోకి శత్రువుకు సంబంధించిన చిన్నసైజు మిడ్జెట్‌ జలాంతర్గాములు చొరబడితే, వాటిని నాశనం చేయగల 16 నౌకలను ఆత్మనిర్భర్‌ కార్యక్రమం కింద భారత్‌ నిర్మిస్తోంది. మిడ్జెట్‌ జలాంతర్గాములను అడ్డుకోకపోతే అవి మన రేవులను దెబ్బతీస్తాయి. అమెరికా నుంచి సేకరించిన బోయింగ్‌ పీ-81 నిఘా విమానాలు హిందూ మహాసముద్రంలో భారత్‌కు చైనా మీద ఆధిక్యాన్ని కట్టబెడుతున్నాయి. అమెరికా నుంచి సేకరించే 26 హెలికాప్టర్లు సాగరంలో సంచరించే శత్రు నౌకలపై నింగి నుంచి దాడి చేసే సామర్థ్యాన్ని భారత్‌కు అందిస్తాయి. చైనా నౌకాదళం భారత దళంకన్నా చాలా పెద్దదైనా, దానికి పోరాట అనుభవం లేదు. అంత భారీ సంఖ్యలో నౌకా దళాన్ని నిర్వహించే నైపుణ్యాన్నీ చైనా సంతరించుకోవలసి ఉంది. భారత్‌పై దాడి చేయాలంటే చైనా నౌకలు మలక్కా, సుండా జలసంధుల గుండా రావాలి. అవి నికోబార్‌ దీవుల వద్దకు చేరుకునే సరికి తిరిగి ఇంధనం నింపుకోవలసి వస్తుంది. ఈలోపు భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులతో, సుఖోయ్‌30 ఎం.కె.ఐ. యుద్ధవిమానాలతో చైనా నౌకలపై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. భారత నౌకాదళం ఆత్మనిర్భర్‌ కార్యక్రమం కింద నేల మీద, నింగి, నీళ్లలోనూ పోరాడగల నౌకలను సొంతంగా నిర్మించుకొంటూ శక్తిసామర్థ్యాలను ఇనుమడింపజేసుకోవాల్సిన అవసరం ఉంది.

జలాంతర్గాములపై దృష్టి

హిందూ మహాసముద్రంలో నౌకా శక్తిని, ముఖ్యంగా జలాంతర్గాములను పెంచుకోవడానికి భారత్‌, చైనా పోటీ పడుతున్నాయి. ఈ మహా సాగరంలో 79 చైనా జలాంతర్గాములు సంచరిస్తుండగా, 17 భారతీయ జలాంతర్గాములు రంగంలో ఉన్నాయని ‘గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌-2022’ నివేదిక వెల్లడించింది. గత 15 ఏళ్లలో చైనా అణుశక్తితో నడిచే 12 జలాంతర్గాములను నిర్మించింది. వాటిలో ఆరు శత్రువుపై దాడి చేసే జలాంతర్గాములు(ఎస్‌ఎస్‌ఎన్‌), మిగిలిన ఆరు దూరశ్రేణి అణు క్షిపణులను ప్రయోగించగల జలాంతర్గాములు (ఎస్‌ఎస్‌బీఎన్‌). భారత్‌ వద్ద ప్రస్తుతం ఒకే ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ అరిహంత్‌ ఉంది. రెండో ఎస్‌ఎస్‌బీఎన్‌ అరిఘాత్‌ను 2023లో సమకూర్చుకొంటుంది. మూడో ఎస్‌ఎస్‌బీఎన్‌ జలాంతర్గామి ఎస్‌4 నిర్మాణం 2021లో మొదలైంది. నాలుగోది ప్రస్తుతం విశాఖపట్నం షిప్‌యార్డులో నిర్మితమవుతోంది. ప్రస్తుతం రష్యాలో ఒక ఎస్‌ఎస్‌ఎన్‌ జలాంతర్గామిని భారతదేశ అవసరాలకు అనుగుణంగా తగిన మార్పుచేర్పులతో కూర్పుచేస్తున్నారు. దానికి చక్ర-3గా నామకరణం చేశారు. దీనికి తోడు రష్యా నుంచి మరొక ఎస్‌ఎస్‌ఎన్‌ తరగతి జలాంతర్గామిని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రాజ్యాంగమే సర్వోన్నతం!

‣ మధ్యతరగతి ఆశల పద్దు

‣ అమృత కాలానికి పటిష్ఠ మార్గం

‣ స్వావలంబనే పటుతర రక్షణ

‣ భావోద్వేగాల‌పై ప‌ట్టు పెంచుకోండి!

‣ లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

‣ మౌలిక వసతులే భవితకు బాటలు

Posted Date: 23-01-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం