• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగమే సర్వోన్నతం!

శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ... మూడింటిలో ఏది ఎక్కువ?  ఇటీవల కొంతమంది నేతల  వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ... వీటన్నింటి ఉనికికీ రాజ్యాంగమే మూలాధారం. ఈ మూడు వ్యవస్థలు తాను విధించిన పరిధిలోనే పనిచేయాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది.

రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించే ప్రజాస్వామ్య దేశాల్లో చట్టాలు చేయడానికి పార్లమెంటుకున్న అధికారంపై రెండు పరిమితులు విధించారు. మొదటిది- పార్లమెంటు చేసిన చట్టాలు రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఉన్నాయా అనేది సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండటం. రెండోది- రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తే ఆ సవరణను కొట్టివేసే అధికారం రాజ్యాంగ కోర్టులైన సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉండటం. దీన్నే న్యాయ సమీక్ష అంటారు. పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు కట్టుతప్పకుండా తగిన నియంత్రణలు, సంతులనాలను 50వ రాజ్యాంగ అధికరణలో పొందుపరిచారు. ఏతావతా పార్లమెంటు చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా చూసే స్వతంత్ర వ్యవస్థగా న్యాయవ్యవస్థను రాజ్యాంగం ప్రతిష్ఠించింది.

పార్లమెంటే అధికమా?

ఇటీవల జైపుర్‌లో 83వ అఖిల భారత సభాపతుల సమావేశంలో ప్రసంగిస్తూ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్‌ ధన్‌ఖడ్‌ పార్లమెంటే సర్వోన్నతమని, రాజ్యాంగ మౌలిక స్వరూప రక్షణపై 1973నాటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను ఏకీభవించడం లేదని విపరీత వాదన చేశారు. పార్లమెంటు తెచ్చిన రాజ్యాంగ సవరణలను సుప్రీం, హైకోర్టులు సమీక్షించి తోసిపుచ్చినట్లయితే అది ప్రజాభిమతాన్ని, అంటే వారు ఎన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమే అవుతుందని ధన్‌ఖడ్‌ భాష్యం చెప్పారు. న్యాయమూర్తుల నియామకానికి 2015లో తెచ్చిన న్యాయనియామకాల సంఘ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, కొలీజియం పద్ధతిని పునరుద్ధరించడం అనేది ప్రపంచంలో మరే ప్రజాస్వామ్యంలోనూ లేదన్నారు. ఇది పార్లమెంటుకన్నా తానే అధికమని సుప్రీంకోర్టు చెప్పడమేనని విమర్శించారు. ఈ ఏడాది జనవరి ఏడోతేదీన రాజ్యసభ సమావేశాలను ప్రారంభించినప్పుడు కూడా ఇదే వాదన ముందుకుతెచ్చారు.

కేశవానంద భారతి వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించకూడదనే సూత్రాన్ని ముందుకుతెచ్చింది. ప్రభుత్వ, పార్లమెంటు నిర్ణయాలు, చట్టాలపై న్యాయ సమీక్ష జరపడానికి కోర్టులకున్న అధికారాన్ని సమర్థించింది. 368వ అధికరణ కింద రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకున్న అధికారాలపై పరిమితి విధించింది. పార్లమెంటులో మెజారిటీ ఉందనే కారణంతో నిరంకుశంగా రాజ్యాంగాన్ని సవరించే ధోరణిని అరికట్టడానికి, కీలక రాజ్యాంగ విలువలను సంరక్షించడానికి తోడ్పడుతున్న ఈ తీర్పును గతంలో భాజపాతోపాటు అన్ని రాజకీయ పార్టీలూ బలపరచాయి. ఈ తీర్పు రాజ్యాంగ విలువలను కాపాడటమే కాదు, సత్పరిపాలనకు దిక్సూచిగానూ నిలిచింది.

మార్చకూడని స్వరూపం

పార్లమెంటులో పాలక పార్టీలకు మెజారిటీ వస్తుంటుంది, పోతుంటుంది. రాజ్యాంగం, దాని స్ఫూర్తి మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, అధికారాల విభజన, పౌరులకు సమానత్వం, న్యాయసమీక్ష, లౌకికవాదం, స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికల నిర్వహణ అనేవి రాజ్యాంగ మౌలిక విలువలు. వీటికి పార్లమెంటరీ చట్టాలు భంగం కలిగించకూడదని కేశవానంద భారతి కేసులో తీర్పు స్పష్టీకరించింది. అందువల్ల పార్లమెంటుకన్నా రాజ్యాంగమే సర్వోన్నతమైనది. పార్లమెంటు చేసే చట్టాలు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదు. కులం, మతం, భాష, లింగ భేదాలను పాటించే చట్టాలను తీసుకురావడం రాజ్యాంగ మౌలిక విలువైన పౌరుల సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఏదిఏమైనా, రాజ్యాంగ మౌలిక విలువలకు పార్లమెంటులో మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు భంగం కలిగించకూడదనే సూత్రం ప్రతిష్ఠితంకావడం వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపం శాశ్వతమని, దాన్ని అసలు మార్చనేకూడదని భావించరాదు. భారతదేశంలో కాలంతోపాటు వచ్చే సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు అనుగుణంగా రాజ్యాంగ మౌలిక విలువలను, మౌలిక స్వరూపాన్ని మార్చుకోవలసి రావచ్చు. అలాంటి సందర్భం ఎదురైనా కూడా పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వానికి సైతం రాజ్యాంగంలో మార్పులుచేర్పులు చేసే అధికారం ఉండదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం మరో రాజ్యాంగ నిర్మాణ సభకు మాత్రమే ఉంటుంది. ప్రజాభీష్టం, ప్రజలిచ్చిన అధికారంతో కొత్త రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పూర్వ రాజ్యాంగ విలువల స్థానంలో కొత్తవి ప్రతిష్ఠించే అధికారం ఆ సభకు మాత్రమే ఉంటుంది. అలాంటి మార్పులు జరిగే వరకు ఎంత మెజారిటీ ఉన్న ప్రభుత్వాలైనా పూర్వ రాజ్యాంగ విలువలకు, మౌలిక స్వరూపానికి బద్ధమై నడుచుకోవలసిందే. దీన్ని కాదని ఎవరు ఎంతగా ఘోషించినా ఉపయోగం ఉండదు!

న్యాయ సమీక్ష... మౌలిక లక్షణం!

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలపై వివాదాలు న్యాయసమీక్షకు అతీతమైనవని, వాటిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదనేది ఇందిర సర్కారు చేసిన 39వ రాజ్యాంగ సవరణ సారాంశం. కానీ, న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి అంటూ 1975 నాటి ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి, 39వ రాజ్యాంగ సవరణను కొట్టివేసింది. అలాగే పార్లమెంటు చట్టాలను న్యాయ సమీక్షకు అతీతంగా ఉంచడం కోసం ఆ చట్టాలను రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడాన్ని కూడా 2007లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయ సమీక్ష అనేది పార్లమెంటు అధికారాలను సంగ్రహించడానికి, కత్తిరించడానికి ఉద్దేశించినది కాదని, రాజ్యాంగం ప్రబోధించిన నియంత్రణలు, సంతులనాలకు లోబడి పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి ఒక సాధనమని వివరించింది. న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం తనపై పెట్టిన బాధ్యతను న్యాయస్థానాలు నెరవేర్చడమే తప్ప పార్లమెంటుపై తనదే పైచేయి అని నిరూపించుకోవడానికి కాదని 1952లో స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ వెర్సస్‌ వి.జి. రావు కేసులో జస్టిస్‌ పతంజలి శాస్త్రి ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అమృత కాలానికి పటిష్ఠ మార్గం

‣ స్వావలంబనే పటుతర రక్షణ

‣ లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

‣ మౌలిక వసతులే భవితకు బాటలు

Posted Date: 20-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం