• facebook
  • whatsapp
  • telegram

సాగు మారితేనే ఆహార భద్రత

వాతావరణ మార్పుల ప్రభావం పంట దిగుబడిపై తీవ్రంగా పడుతోంది. ఇది ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు తెస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని నివారించేందుకు వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలపై ప్రపంచ దేశాలు మరింత దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పర్యావరణ మార్పులు ఇప్పటికే పంటల దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల పంజాబ్‌లో 2050 నాటికి అన్ని ప్రధాన పంటల దిగుబడి తగ్గుతుందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. మొక్కజొన్న 13శాతం, పత్తి 11శాతం, గోధుమ, బంగాళాదుంప పంటలకు అయిదు శాతం మేర నష్టం వాటిల్లుతుందని అది అంచనా వేసింది. వరి దిగుబడి ఒక శాతానికి పైగా తగ్గుతుందని వెల్లడించింది. వ్యవసాయ ఆర్థికవేత్తలు, పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అధ్యయనంలో అయిదు ప్రధాన పంటల దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేశారు. దానికోసం 34 సంవత్సరాల(1986-2020) వర్షపాతం, ఉష్ణోగ్రతల గణాంకాలను ఆధారంగా తీసుకున్నారు. 2080 నాటికి పంటల దిగుబడుల తగ్గుదల దాదాపు రెట్టింపవుతుందని నివేదిక వెల్లడించింది. దీన్ని నివారించేందుకు వాతావరణ మార్పులకు అనుగుణమైన (క్లైమేట్‌-స్మార్ట్‌) వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించింది.

వాతావరణ మార్పులు పంజాబ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రకాల పంటలపై ఏటా ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు దీనిపై హెచ్చరిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు దీన్ని ఎదుర్కొనేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టడంలేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులవల్ల వ్యవసాయోత్పత్తులు తెగ్గోసుకుపోవడం, ఆహార సరఫరా గొలుసుల్లో అంతరాయం కారణంగా 2030 నాటికి దాదాపు తొమ్మిది కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించవచ్చని నిరుడు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ(ఐఎఫ్‌పీఆర్‌ఐ) హెచ్చరించింది. భారత్‌లో 1-4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల వరి దిగుబడి 10-30శాతం, మొక్కజొన్న 25-70శాతం తగ్గవచ్చని వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల సంఘం (ఐపీసీసీ) అంచనా వేసింది. ఇండియా జనాభాలో సగం మందికి వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల ఈ గణాంకాలు ఆందోళన కలిగించేవే.

పెరుగుతున్న ప్రపంచ జనాభా వల్ల ఆహారానికి గిరాకీ అధికమవుతోంది. వాతావరణ మార్పులు ఆహార భద్రతను మరింత సంక్లిష్టంగా మారుస్తాయి. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు, తుపానులు, నేలకోత, కరవు, కొత్త రకాల చీడ పీడలు తదితర రూపాల్లో వాతావరణ మార్పుల ప్రభావం పంటలపై ఉంటుంది. పర్యావరణ మార్పుల వల్ల పశువుల పాల దిగుబడి సైతం తగ్గుతుంది. చిరుధాన్యాల్లో పోషక విలువలపైనా ప్రభావం పడుతుంది. దీని నుంచి బయటపడాలంటే పంటలను వాతావరణ ప్రభావాలకు అనుగుణంగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనే వంగడాలను ఉత్పత్తి చేయాలి. నీటి నిర్వహణలో మార్పులు తీసుకురావాలి. పాలీహౌస్‌లలో సాగు వంటి విధానాలను అమలు చేయాలి. చైనా సహా పలు దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందిని ప్రస్తుతం పోషకాహార సమస్య వేధిస్తోంది. 200 కోట్ల మందికి పైగా సూక్ష్మ పోషకాల లోపాలతో బాధపడుతున్నారు. అందరికీ మెరుగైన పౌష్టికాహారం అందించడంలో ప్రపంచం ఇప్పటికీ వెనకబడే ఉంది. విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వంటివీ భూమి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి. ఇండియాలో 18శాతం హరిత గృహ వాయు ఉద్గారాలకు వ్యవసాయం, పశు సంపద కారణం. దీన్ని నివారించేందుకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆచరించాలి.

వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును కొనసాగించడం చాలా సంక్లిష్టమైన అంశం. ఇది అనేక పద్ధతుల సమ్మేళనం. ప్రాంతాలను బట్టి విధానాలు మారతాయి. వర్షాధార ప్రాంతాల్లో, నీరు సమృద్ధిగా ఉన్నచోట్ల వేర్వేరు విధానాలను పాటించాలి. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ విధానాలను రైతులు ఆచరించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కమతాల పరిమాణం తక్కువగా ఉండటం, నిరక్షరాస్యత, ప్రభుత్వాల ప్రోత్సాహలేమి వంటివి ఆటంకాలుగా నిలుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఔత్సాహిక రైతులు, ప్రైవేటు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద, కార్పొరేట్‌ సంస్థలు అన్నదాతలకు అండగా నిలిస్తే ఇండియాలో వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును కొనసాగించడం సాధ్యమవుతుంది. తద్వారా ఆహార భద్రతకు భరోసా దక్కుతుంది.

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వివాదాల సేతుసముద్రం

‣ భగ్గుమంటున్న పుడమి

‣ భద్రతామండలి ప్రక్షాళన ఇంకెప్పుడు?

‣ వ్యూహాత్మక ముందడుగే ఉపయుక్తం

‣ తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ తెలంగాణ బ‌డ్జెట్ 2023-24

Posted Date: 11-02-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని