• facebook
  • whatsapp
  • telegram

నాసిరకం విత్తు.. రైతన్న చిత్తు!

దేశంలో కొత్త ఖరీఫ్‌ (వానాకాలం) పంటల సీజన్‌ ప్రారంభమవుతోంది. విత్తనాల కోసం రైతుల వేట మొదలైంది. దేశంలో విత్తన వ్యాపారమంతా ప్రైవేటు కంపెనీల చేతుల్లో చిక్కింది. చిన్నాచితకా కంపెనీలు సైతం నాసిరకం విత్తనాలను ప్రముఖ బ్రాండ్ల పేరిట అమ్మేస్తూ అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విత్తనాలు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ప్రత్యేక ప్రణాళికలే కరవయ్యాయి.

అన్ని రకాల పంటలకు రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసే పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విత్తన సంస్థలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పంటల విత్తనాల ధరలపై భరించే రాయితీని పూర్తిగా రద్దు చేసింది. కొత్త సీజన్‌లో ఏపీలో రైతులకు ఏం ఇస్తారనేది ఇంతవరకూ స్పష్టత లేదు. మరోవైపు అర్ధ శతాబ్దం కింద దేశ రైతుల అవసరాల కోసం ఏర్పాటైన ‘జాతీయ విత్తన సంస్థ’ (ఎన్‌ఎస్‌సీ) ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడం లేదని కేంద్రం గుర్తించింది. ఈ సంస్థ పనితీరు మెరుగు పడేందుకు, నాణ్యమైన విత్తనాల సరఫరా లక్ష్యాన్ని సాధించే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం తాజాగా జాతీయస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇదంతా విత్తన సరఫరా ప్రక్రియలోని డొల్లతనాన్నే చాటుతోంది.

యథేచ్ఛగా విక్రయాలు

గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే విత్తన వాహనాలను తనిఖీచేసి నకిలీ, నాసిరకాలను పట్టుకోవాలని పోలీసు, వ్యవసాయశాఖ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. పలు రాష్ట్రాల నుంచి నాసిరకం విత్తనాలను తెలంగాణలోకి పంపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తనిఖీలకు ఆదేశించడం మోసాల తీవ్రతను చాటుతోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పర్యావరణానికి విఘాతం కలిగించే ‘హెర్బిసైట్‌ టాలరెంట్‌’(హెటీ) పత్తి విత్తనాలను ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలను వాడిన రైతులు తరవాత కలుపు మొక్కలను చంపడానికి ‘గ్లైఫోసెట్‌’ అనే విషపూరిత రసాయనాన్ని పంటచేలల్లో పిచికారీ చేస్తున్నారు. ఇది చల్లిన ప్రాంతాల్లో హెచ్‌టీ పత్తి మొక్కలు తప్ప మిగతా అన్ని మొక్కలు, చెట్లు నల్లగా మాడిపోయి చనిపోతాయి. ఈ రసాయనాన్ని వాడితే పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందనే ఉద్దేశంతో హెచ్‌టీ పత్తి విత్తనాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. అయినా కొన్ని ప్రైవేటు కంపెనీలు మారుపేర్లతో వాటిని రైతులకు నేరుగా అమ్మేస్తున్నారు. ఏటా లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నా పట్టుకోవాల్సిన వ్యవస్థలు పటిష్ఠంగా లేవు.

జన్యుమార్పిడి(జీఎం) విత్తనాలను మనదేశంలో సాగు చేయాలంటే కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన ‘జన్యు ఇంజినీరింగ్‌ మదింపు సంఘం (జీఈఏసీ)’ అనుమతి తప్పనిసరి. ఈ అనుమతి లేకుండానే హెచ్‌టీ పత్తి విత్తనాలను కంపెనీలు అమ్మేస్తున్నాయి. రైతులు కొనేస్తున్నారు. వీటిని సాగుచేసి విషపూరిత రసాయనాలు చల్లిన భూములు దెబ్బతింటున్నాయి. మరోవైపు జీఈఏసీ నుంచి ఒక పత్తి సంకరజాతి (హైబ్రీడ్‌) విత్తనం కోసం లైసెన్సు తీసుకున్న కంపెనీలు- మరో అయిదారు కంపెనీలను లోపాయికారీగా అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో అవి ఇతర రకాల హైబ్రీడ్‌ పత్తి విత్తనాలను అమ్ముతున్నట్లు ప్రధాన ప్రైవేటు కంపెనీలే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుండటం- మోసాల తీవ్రతకు నిదర్శనం.

ముమ్మర పరీక్షలు

నాణ్యమైన విత్తనాలు అందించడాన్ని ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలి. రైతులు అధిక దిగుబడులిచ్చే పంటలను పండించాలంటే తొలకరి వాన పడగానే నాణ్యమైన విత్తు దొరుకుతుందనే భరోసా వారికి కల్పించాలి. జాతీయ ఆహార భద్రతా మిషన్‌ కింద ప్రధాన ఆహార, కూరగాయల పంటలకైనా రాయితీపై విత్తులు సరఫరా చేయాలి. మార్కెట్లలో రైతులకు అమ్మే విత్తనాల నమూనాలను పక్కాగా సేకరించి పరీక్షించి వాటి ఫలితాలను ప్రకటించే వ్యవస్థలను వ్యవసాయ శాఖలు ఏర్పాటు చేయాలి. నాణ్యత కొరవడిన విత్తనాలు అమ్మేవారిని పట్టుకోవడమే కాకుండా అవి మార్కెట్లలోకి రాకుండా విత్తనోత్పత్తి కేంద్రాల వద్దే తనిఖీలు, పరీక్షలు నిర్వహించాలి. తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చినందువల్ల దీని ఆధ్వర్యంలో మరిన్ని ప్రయోగశాలలు నెలకొల్పి విత్తన పరీక్షలను ముమ్మరం చేయాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తేనే మెరుగైన దిగుబడులు వస్తాయి. అప్పుడే దేశానికి ఆర్థిక, ఆహార భద్రత సమకూరుతుంది. ప్రభుత్వ యంత్రాంగాలు ఈ అంశాన్ని గుర్తిస్తేనే- సాగుకు మేలు జరుగుతుంది. రైతుల కష్టాలు కడతేరతాయి.

కంపెనీల మోసాలు

మనదేశంలో విత్తన చట్టం 1966 నాటిది. తిరిగి 1983లో విత్తన నియంత్రణ ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో వచ్చింది. ఈ మూడింటికి విరుద్ధంగా జీఈఏసీ ఇచ్చే లైసెన్సులను సాకుగా చూపి హైబ్రీడ్‌ విత్తనాల పేరిట ఇతర రకాలను విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖల అధికారులు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షిస్తే తప్ప విత్తనాల అక్రమ వ్యాపారం బయటపడదు. వ్యవసాయశాఖ సిబ్బంది లంచాలకు ఆశపడటం, పెద్దసంఖ్యలో విత్తన ప్యాకెట్లను తనిఖీ చేసే ప్రయోగశాలలు లేకపోవడం వంటి అనేక క్షేత్రస్థాయి సమస్యలు పీడిస్తున్నాయి. వాటివల్ల విత్తన నాణ్యత నిర్ధారణ పరీక్షలు మొక్కుబడిగా మారి, అక్రమ కంపెనీల మోసాలకు ఊతమిస్తున్నాయి. ‘మొక్కల రకాలు, రైతుల హక్కుల పరిరక్షణ చట్టం’ 2001లో వచ్చినా ప్రయోజనం కరవైంది. కనీసం నమూనాలను సేకరించి పరీక్షలు చేసే యంత్రాంగమైనా లేదు. ఊరు పేరులేని చిన్న కంపెనీలకు ఉన్న ప్రయోగశాలలెన్ని, పరిశోధన సామర్థ్యమెంత, అవి కనిపెట్టిన కొత్త వంగడాలేమిటి, ఎన్ని రకాలకు లైసెన్సులు పొందాయి, ఏయేబ్రాండ్ల పేర్లతో రైతులకు అమ్ముతున్నాయనేది నిర్ధారించే తనిఖీలే లేవు. పక్క రాష్ట్రాల్లో కంపెనీ ప్లాంట్లు ఉన్నాయంటూ దొంగ చిరునామాలతో విత్తనాలు అమ్మేస్తూ రైతులను మోసగిస్తున్నారు. బీటీ పత్తి విత్తన ప్యాకెట్‌లో తప్పనిసరిగా అయిదు శాతం ఇతర విత్తనాలు ఉంచి అమ్మాలనే కేంద్రం ఉత్తర్వులను సైతం పలు కంపెనీలు అమలు చేయడం లేదు. ఏపీ, తెలంగాణలలో ఏటా వానాకాలం సీజన్‌లో సుమారు రెండు కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు రైతులకు విక్రయిస్తున్నాయి. వీటిపై దాదాపు రెండువేలకోట్ల రూపాయలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ వీటి నాణ్యతను పరీక్షించడానికి రూ.10 కోట్లు కూడా తెలుగు రాష్ట్రాలు వెచ్చించడం లేదు.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రానున్నది.. ఏఐ శకం!

‣ సమాఖ్య విధానమే శ్రీరామరక్ష

‣ వ్యర్థాల నిర్వహణలో సమస్యల మేట

‣ జీవ వైవిధ్యంతోనే సుస్థిర అభివృద్ధి

‣ డిజిటల్‌ సాగుతో లాభాల పంట

‣ జీఎస్టీ ఎగవేతకు కళ్ళెం

‣ ప్రపంచ సవాళ్లకు జీ7 పరిష్కారాలు

Posted Date: 07-06-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని