• facebook
  • whatsapp
  • telegram

అన్నదాతకు అండగా కిసాన్‌ కేంద్రాలుఅన్నదాతలకు అండగా నిలిచేలా మరో నూతన వ్యవస్థ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వారికి అవసరమైన సేవలన్నింటినీ ఒకేచోట అందించేందుకు వీలుగా ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు’ ఏర్పాటు చేస్తోంది. ఇవి సమర్థంగా పనిచేస్తే వ్యవసాయ రంగం బలోపేతమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.


రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, భూసార పరీక్షకు అవసరమైన పరికరాలు వంటివాటిని తక్కువ ధరకే అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ యోచన. దీన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు తొలిదశలో దేశవ్యాప్తంగా 1.25లక్షల పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. మొత్తం 2.80లక్షల ఎరువుల దుకాణాలను కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా మార్చాలన్నది ప్రభుత్వ యోచన. వీటిలో రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. అన్నదాతలు ఏయే పంటలను పండిస్తే లాభసాటిగా ఉంటాయి, అందుకోసం ఎలాంటి విత్తనాలు, ఎరువులు వాడాలి అనే విషయాలపై సూచనలు సలహాలు ఇస్తారు. పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లను సైతం వీటిలో అందుబాటులో ఉంచుతారు.


నకిలీల నుంచి విముక్తి

కిసాన్‌ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పటికప్పుడు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ప్రతి కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుంటుంది. ఈ కేంద్రాల్లో ‘కిసాన్‌బాత్‌’ పేరుతో ప్రతినెలా రెండో ఆదివారం రైతు బృందాలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా, సాగులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, పరిష్కారాలు సూచిస్తారు. వాతావరణం, వ్యవసాయం, మార్కెట్‌ స్థితిగతుల వివరాలను పంచుకునేందుకు ప్రతి కేంద్రం పరిధిలో సామాజిక మాధ్యమ గ్రూపులను ఏర్పాటు చేస్తారు.


తొలివిడతలో భాగంగా తెలంగాణలో నాలుగు వేల పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ‘ఒకే దేశం-ఒకే ఎరువు’ పథకం కింద భారత్‌ బ్రాండ్‌ పేరుతో ఎరువులను వీటిలో విక్రయిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు వీలుగా గంధకం(సల్ఫర్‌) పూసిన యూరియాను సరఫరా చేస్తారు. పలు రాష్ట్రాల్లో ఏటా అధికారుల తనిఖీల్లో భారీయెత్తున నకిలీ పురుగుమందులు, విత్తనాలు వెలుగుచూస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు ఉత్పత్తిచేసే నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులను కిసాన్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచడంవల్ల అన్నదాతలకు నకిలీల బెడద తప్పుతుంది. సాగు లాభసాటిగా మారాలంటే యాంత్రీకరణ తప్పనిసరి. దీనివల్ల ఖర్చు తగ్గి, ఉత్పాదకత పెరుగుతుంది. ఆధునిక యంత్రాలను ఈ కేంద్రాల ద్వారా తక్కువ రుసుముకే వినియోగించుకునే అవకాశం కల్పించడం చిన్న సన్నకారు రైతులకు ఎంతగానో మేలు చేస్తుంది. అధికశాతం పొలాల్లో ప్రస్తుతం భూసార పరీక్షలు జరగడం లేదు. దాంతో రసాయన, సేంద్రియ ఎరువుల వాడకంలో శాస్త్రీయత లోపించి భూసారం క్షీణిస్తోంది. భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా అనుకూలమైన పంటలను సాగు  చేసేలా రైతులను ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఇందుకు కిసాన్‌ కేంద్రాలు దోహదపడతాయి.


సమర్థ నిర్వహణే కీలకం

సేద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, అన్నదాతలకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. అయితే, వాటి అమలు అంతంత మాత్రంగానే ఉంటోంది. దేశంలోని ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాలు(ప్యాక్స్‌) కూడా అన్నదాతలకు సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 95వేల ప్యాక్స్‌ ఉండగా, సుమారు 46వేల సంఘాలే లాభాల్లో కొనసాగుతున్నాయి. అక్రమాలు, నిర్వహణ లోపాల కారణంగా మిగతావి నష్టాల్లో కూరుకుపోయాయి. అలాంటి పరిస్థితి పీఎం కిసాన్‌ కేంద్రాలకు రాకుండా చూడాలి. రైతులు సాధారణంగా ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అరువుపై తెచ్చుకుంటారు. పంట చేతికొచ్చిన తరవాత చెల్లింపులు జరుపుతారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కనప్పుడు వారు అప్పుల్లో కూరుకుపోతారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే పెట్టుబడుల కోసం అన్నదాతలకు సులభంగా రుణాలు అందజేయాలి. పీఎం కిసాన్‌ కేంద్రాలు రైతుల ఆదాయాన్ని పెంచేలా కార్యకలాపాలు సాగిస్తేనే- ప్రభుత్వ ప్రవచిత లక్ష్యం నెరవేరుతుంది.


- డి.సతీష్‌బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రాంప్ట్‌ ఇంజినీర్‌.. కోట్లలో ప్యాకేజీ!

‣ బీటెక్‌తో హెచ్‌ఏఎల్‌లో ఉద్యోగాలు

‣ 'క్యాట్‌ 2023' సన్నద్ధత ఇలా..

‣ 'పది' మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం

‣ తండ్రి కష్టం.. తనయ విజయం

‣ ఇంటర్‌తో కేంద్ర కొలువులు

‣ 'నాసా' మెచ్చిన కుర్రాడు!

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని