• facebook
  • whatsapp
  • telegram

ఆహార భద్రతకు భూసార పరిరక్షణ



ప్రపంచ మృత్తికా దినోత్సవం. సారవంతమైన నేల, సురక్షితమైన జలవనరుల ద్వారానే ఆహార, నీటి, పర్యావరణ భద్రతకు భరోసా దక్కుతుంది. భారత్‌లోని చాలా సాగు భూములు నిస్సారమవుతున్నాయి. కోతకుగురవుతున్న భూమి పైపొరల్లోని రసాయనాలు సమీపంలోని చెరువులు, నదులను కలుషితం చేస్తున్నాయి.


పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలతోపాటు నూనె గింజలు, పండ్లు, కూరగాయలనూ ఉత్పత్తి చేసుకోవాలి. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదం కోసం హరిత వనాలనూ పెంచుకోవాలి. ఇందుకు సారవంతమైన నేల, నాణ్యమైన నీరు ఎంతో అవసరం. జీవుల మనుగడకు కీలకమైన ఈ రెండు సహజ వనరులు ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయి. సృష్టిలోని సమస్త జీవరాశికి ఆహారంతోపాటు ఆశ్రయం కల్పిస్తాయి. వాతావరణ మార్పులను సైతం నియంత్రిస్తాయి. రాళ్లు, గుట్టలు కొన్ని లక్షల సంవత్సరాలపాటు విచ్ఛిత్తి చెంది ఇసుక, రేగడి రేణువులుగా ఏర్పడతాయి. అవి జీవులు, మొక్కల నుంచి వచ్చే సేంద్రియ పదార్థంతో కలిసి సారవంతమైన భూమి పైపొర ఏర్పడుతుంది. నేలలోని రేణువుల మధ్య ఉండే ఖాళీల్లోకి వర్షపు నీరు, గాలి చేరతాయి. తద్వారా మొక్కల వేళ్లు, సూక్ష్మజీవులు, వానపాములు, చీమలు, చెదపురుగులు వంటివి జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి.


చౌడుబారుతున్న పంట భూములు

ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, గుప్పెడు మట్టిలో వెయ్యి కోట్ల వరకు సూక్ష్మజీవులు నివశిస్తాయి. నేలలో ఉండే మొక్కల వేళ్లు, జీవాల్లోని సేంద్రియ కర్బనం- భూమిపై పెరిగే అడవులు, తోటలు, జంతువుల్లోని ఆ పదార్థం కంటే సుమారు రెండు రెట్లు ఎక్కువ! సారవంతమైన నేలలు వాతావరణంలోని కర్బనాన్ని స్థిరీకరించి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న నష్టకరమైన సాగు విధానాలు, అధిక మోతాదులో రసాయన ఎరువులను వాడటం, సేంద్రియ ఎరువుల లభ్యత తగ్గడం, ఒకే తరహా పంటను పండించడం, సాగునీటి పద్ధతుల్లో లోపాలు నేల కోతకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సాగుభూములు కాలుష్యానికి గురై, నిస్సారంగా మారుతున్నాయి. ఉత్పాదక శక్తినీ కోల్పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50శాతం సాగు భూముల్లో ఉత్పాదకత క్షీణించినట్లు అంచనా. భారత్‌లో 30శాతం పైచిలుకు సాగు భూములు సారం కోల్పోయి, కోతకు గురైనట్లు నిపుణులు చెబుతున్నారు. కోతకు గురైన నేల పైపొరలోని రసాయనాలు దగ్గరలోని కుంటలు, చెరువులు, నదులు వంటి జలవనరుల్లోకి చేరి కలుషితం చేస్తున్నాయి. దేశంలో 8.5 కోట్ల హెక్టార్ల పంట భూములు నీరు, గాలి ద్వారా కోతకు గురయ్యాయని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ అధ్యయనం తేల్చింది. కోతకు గురైన భూముల్లో సహజ ఉత్పాదక శక్తితోపాటు కార్బన్‌ స్థిరీకరణ క్షీణిస్తుంది. ఫలితంగా ప్రతికూల మార్పులు చోటుచేసుకుని ఆహార కొరత ఏర్పడుతుంది. నిస్సారమైన నేలలు వాన నీటిని అంతగా ఒడిసి పట్టలేవు. అందువల్లే చాలాచోట్ల పంటచేలు ముంపునకు గురవుతున్నాయి. పంటకు నీటిని కట్టడంలో అస్తవ్యస్త విధానాలకు తోడు నాణ్యతలేని జలాలను సాగుకు వినియోగించడంవల్ల పంటభూములు చౌడుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల హెక్టార్ల మేర సాగు భూమి చౌడుబారింది. ఇండియాలో సుమారు 70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చౌడు భూములు ఉన్నట్లు కేంద్రం అంచనా వేసింది. ఇలాంటి భూముల్లో పంట దిగుబడి 70శాతం వరకు కోసుకుపోతుంది.


భారత్‌లో అనేక జీవనదులు ఉన్నప్పటికీ, వ్యవసాయానికి ప్రధాన ఆధారం మాత్రం వర్షపు నీరే. దాదాపు 60శాతం విస్తీర్ణంలో వర్షాధార పంటలు సాగవుతున్నాయి. గంగ,  బ్రహ్మపుత్ర, రావి, జీలం, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర వంటి నదుల్లోని నీటిని రిజర్వాయర్లలో నింపి కాలువల ద్వారా పంట భూములకు అందిస్తున్నారు. ఇండియాలో ఏటా కురిసే మొత్తం వాన నీటిలో మూడో వంతే చెరువులు, నదులు, రిజర్వాయర్లలోకి చేరుతుంది. మరికొంత నేలలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతుంది. సృష్టిలోని జీవరాశికి ఆధారం నేల, నీరే. దీన్ని గుర్తించిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)- ఈ ఏడాది ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా ‘జీవానికి ఆధారం నేల, నీరే’నని పిలుపిస్తోంది. భూ, జలవనరుల సద్వినియోగానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కోరుతోంది.


బహుముఖ చర్యలు అవసరం

భూ సారాన్ని పెంపొందించుకోవడంతో పాటు సాగునీటి సద్వినియోగానికి, చౌడు భూముల్ని బాగుచేసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు ఎంతో అవసరం. రైతులు క్షేత్రస్థాయిలో వాటిని అనుసరించేలా విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. నేలకోతను అరికట్టడం కోసం కాంటూరు సేద్యం, అంతర, మిశ్రమ పంటల సాగును ఇతోధికంగా ప్రోత్సహించాలి. వర్మీ, నాడెప్‌ కంపోస్టుల వినియోగాన్ని పెంచాలి. పంట వ్యర్థాలను నేలలో కలియదున్నడంవల్ల సేంద్రియ పదార్థాలు కలిసి నేల సారం పెరుగుతుంది. పచ్చిరొట్ట, జీవ ఎరువులతో కూడిన భూ సమగ్ర పోషక యాజమాన్యానికి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఎరువులను వినియోగించుకోవాలి. సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే తుంపర సేద్య విధానాలను అనుసరించాలి. చౌడు సమస్య ఉన్న రేగటి భూముల్లో మురుగు వ్యవస్థను ఏర్పాటుచేసి, జిప్సం, సూపర్‌ ఫాస్ఫేట్‌ ఎరువులను వాడాలి. తద్వారా చౌడును తగ్గించడానికి అవకాశం కలుగుతుంది. వాననీటి సంరక్షణ విధానాలపై అన్నదాతలకు శిక్షణ ఇవ్వడం తప్పనిసరి. సాగునీటి నాణ్యతనూ పరీక్షించాలి. దాని శాస్త్రీయ వినియోగ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి. భూ సారాన్ని పెంచేందుకు, శాస్త్రీయమైన సాగునీటి వినియోగానికి అవసరమైన ప్రోత్సాహకాలను రైతులకు అందించాలి.


విచ్చలవిడి వినియోగం

భూగర్భ జలాల సక్రమ వినియోగమూ సాగులో కీలక అంశం. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, తమిళనాడుల్లో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంటోంది. వాటితో పోలిస్తే ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భూగర్భ జలాల వినియోగం తక్కువే. రాయలసీమ ప్రాంతంలో వినియోగం ఎక్కువ. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కృష్ణా, గోదావరి, నెల్లూరు తదితర చోట్ల నదుల్లోని నీరు అందుబాటులో ఉంటోంది. రసాయన ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల భూగర్భ జలాలూ కలుషితం అవుతున్నాయి. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సేంద్రియ వ్యవసాయంతో లాభాలెన్నో!

‣ అసమాన పోరాట శక్తిగా నౌకాదళం

‣ ఇరాన్‌ అమ్ములపొదిలో సరికొత్త క్షిపణి

‣ వర్సిటీ ర్యాంకింగుల్లో మెరుగయ్యేదెన్నడు?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం