• facebook
  • whatsapp
  • telegram

ఆహారభద్రతకు విఘాతం



దేశంలో ఆహారభద్రత పథకానికి ఆయువుపట్టుగా ఉన్న గోధుమల సేకరణ ఏటేటా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. మద్దతు ధరతో పాటు బోనస్‌ను ప్రభుత్వాలు అందిస్తున్నా, ప్రభుత్వ సంస్థలకు గోధుమలను విక్రయించేందుకు రైతులు ముందుకు రావడం లేదు.  


ప్రపంచంలో వరి తరవాత ఎక్కువగా వినియోగించే ఆహారధాన్యం గోధుమ. విశ్వవ్యాప్తంగా ఏటా 55కోట్ల టన్నులకు పైగా గోధుమలు అవసరం. ఇందులో మూడింట రెండొంతులు ఆహారానికి, ఆరింట ఒక వంతు పశువుల దాణాకు, మిగిలినవి విత్తనాలు తదితరాలకు వాడుతున్నారు. ప్రస్తుతం ఎనభై దేశాల్లో గోధుమ పండుతోంది. చైనా తరవాత ప్రపంచంలో రెండో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు భారత్‌. 2022-23లో ఇండియాలో 32.35 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. అందులో గోధుమల వాటా దాదాపు 11కోట్ల మెట్రిక్‌ టన్నులు. ఇండియాలో బియ్యం తరవాత గోధుమలు రెండో ప్రధాన ఆహారం. దక్షిణాదిలో అధికశాతం ప్రజలు బియ్యంతో వండిన అన్నం తింటే, ఉత్తరాదిలో గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఎక్కువగా భుజిస్తారు. గోధుమ పిండిని చపాతీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. 1951లో ఇండియాలో ఒక వ్యక్తికి సంవత్సరానికి 24కిలోల గోధుమలే అందుబాటులో ఉండేవి. 2020 నాటికి అది 65 కిలోలకు చేరింది. గోధుమ సాగులో ఉత్తర్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లు ఆ తరవాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. 


ఎక్కువ ధర రావడంతో..

దేశీయంగా ప్రజాపంపిణీ వ్యవస్థ గోధుమలతోనే ప్రారంభమైంది. క్రమేణా అది ఆహారభద్రతా పథకంగా రూపుదిద్దుకొంది. దేశంలో 80 కోట్ల మందికి ఈ పథకం కింద గోధుమలు పంపిణీ అవుతున్నాయి. దీనికోసం రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కేంద్రం గోధుమలను సేకరించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో నిల్వ చేస్తోంది. వీటిని గరీబ్‌ కల్యాణ్‌ యోజన ఇతర సంక్షేమ పథకాల రూపేణా ప్రజలకు అందిస్తున్నారు. ప్రతి మార్కెటింగ్‌ సీజన్‌ ప్రారంభంలో రాష్ట్రాలను, ఎఫ్‌సీఐని సంప్రతించి గోధుమ సేకరణ లక్ష్యాలను కేంద్రం నిర్దేశిస్తుంది. ఆది నుంచి ఈ ప్రక్రియ సజావుగానే సాగింది. మూడేళ్ల క్రితం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. క్వింటా గోధుమకు మద్దతు ధరను కేంద్రం రూ.2,275కి పెంచింది. దానికంటే ఎక్కువ ధర రావడంతో రైతులు మార్కెట్ల వైపు మొగ్గుతున్నారు. 2024-25 సంవత్సరానికి 372లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఎఫ్‌సీఐ 257 లక్షల మెట్రిక్‌ టన్నులనే సేకరించింది. గత రెండేళ్లలోనూ లక్ష్యం మేరకు గోధుమల సేకరణ జరగలేదు. 2022-23లో 440 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని నిర్ణయించారు. 187 లక్షల మెట్రిక్‌ టన్నులే (42శాతమే) సేకరించగలిగారు. 2023-24లో 341 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికిగాను, 262 లక్షల మెట్రిక్‌ టన్నులే సేకరించారు. దాంతో ఎఫ్‌సీఐలో గోధుమల నిల్వలు ఏడేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. జాతీయ ఆహార భద్రతా పథకం కింద సంవత్సరానికి 184 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు అవసరం. భవిష్యత్తులో ఆ మేరకు నిల్వ చేయడం కష్టసాధ్యమవుతుందనే భావన నెలకొంది. గోధుమల సేకరణ లక్ష్యసాధన కోసం మార్కెట్లలో కొనుగోళ్లను ప్రభుత్వం నియంత్రించింది. వాటి ఎగుమతులనూ నిషేధించింది. 


అధ్యయనం అవసరం..

ఇండియాలో ఇటీవల గోధుమ, పిండి ధరలు అనూహ్యంగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. ప్రస్తుతం దేశంలో గోధుమలకు క్వింటాలుకు రూ.2275 మద్దతు ధర ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు అదనంగా రూ.125 బోనస్‌గా అందజేస్తున్నాయి. అయినా, రైతులు ప్రభుత్వ ఏజెన్సీలకు విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. దీనికి కారణాలను కేంద్రం అధ్యయనం చేయాలి. రాబోయే నెలల్లో గోధుమ ధరలు పెరుగుతాయని, తమకు మరింత లాభం వస్తుందని వారు నిల్వ చేసుకున్నారు. దేశీయ అవసరాల దృష్ట్యా నిర్ణీత లక్ష్యం మేరకు గోధుమలను సేకరించడం గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సేకరణ జరగాల్సిన అవసరం ఉంది. బహిరంగ మార్కెట్లో గోధుమ పిండి ధరలను నియంత్రించాలి. పంటల వైవిధ్యం, మెరుగైన పోషకాహారం కోసం చిరుధాన్యాల సేకరణపై దృష్టి సారించడం మరో కీలకాంశం. 


- ఆకారపు మల్లేశం 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇజ్రాయెల్‌ అమానుష హత్యాకాండ

‣ కృత్రిమ మేధ ప్రభావమెంత?

‣ పర్యావరణానికి యుద్ధ గాయాలు

‣ రష్యా - చైనా చెట్టపట్టాల్‌.. భారత్‌పై ప్రభావమెంత?

‣ ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?

Posted Date: 01-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం