• facebook
  • whatsapp
  • telegram

పెను ప్రమాదంలో జీవ వైవిధ్యం



విచ్చలవిడిగా సాగుతున్న మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దానివల్ల జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా మనుషులతో పాటు ఇతర ప్రాణులు, చెట్ల మనుగడ ప్రమాదంలో పడుతోంది.


దాదాపు వెయ్యి పరిశోధనా పత్రాల విశ్లేషణతో ‘నేచర్‌’ పత్రికలో ఇటీవల ఒక వ్యాసం ప్రచురితమైంది. మానవ చర్యల మూలంగా తీవ్రమవుతున్న జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పులు, ఆవాసాల్లో మార్పు, రసాయన కాలుష్యం తదితరాలు మనుషులతో పాటు, వన్యప్రాణులు, భూమి మీది వివిధ ప్రకృతి ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశోధన వెల్లడించింది. వీటన్నింటిలోకీ జీవ వైవిధ్య నష్టం వల్ల వ్యాధులు మరింతగా పేట్రేగుతాయని హెచ్చరించింది. భూమిపై సహజంగా జీవవైవిధ్యం వ్యాపించి ఉన్న ప్రాంతాలతో పోలిస్తే, మానవ చర్యల వల్ల అది దెబ్బతిన్న చోట వ్యాధులు, అకాల మరణాలు తొమ్మిది రెట్లు ఎక్కువని పరిశోధన తెలియజెప్పింది. 


అడవుల నరికివేత, ఒకే రకమైన పంటలు పండించడం, పట్టణీకరణ, వనరుల విచ్చలవిడి దోపిడి, వాతావరణ మార్పులు, కాలుష్యం, పరదేశి జాతుల చొరబాటు వంటివి ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణాలు. జీవ వైవిధ్యం, ఆవరణ వ్యవస్థల నివేదిక-2019 గత అయిదు దశాబ్దాల కాలంలో జీవ వైవిధ్యంలో వచ్చిన మార్పులు, ధోరణులను అంచనా వేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా నేడు జీవవైవిధ్యం క్షీణిస్తోందని, ప్రధాన ఆవాసాల్లో సగటు స్థానిక జాతులు 1990 నుంచి కనీసం 20శాతం మేరకు కనుమరుగైనట్లు అది వెల్లడించింది. ప్రస్తుతం సుమారు పది లక్షల వృక్ష, జంతు జాతులు మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వాటిలో చాలావరకు రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే అంతర్ధానమయ్యే అవకాశం ఉంది. పదహారో శతాబ్దం నుంచి నేటి వరకు కనీసం 680 వెన్నెముక కలిగిన (సకశేరుక) జాతులు నశించాయి. ప్రపంచవ్యాప్తంగా 41 వేలకు పైగా జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (ఐయూసీఎన్‌) హెచ్చరించింది. ఉభయచరాలు 41శాతం, పగడపు దీవులను ఏర్పరచే జీవులు 33శాతం, క్షీరదాలు 27శాతం, మూడో వంతు సముద్ర జాతులు, నేటి వరకు తెలిసిన పక్షి జాతుల్లో 13శాతం మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.


కాలుష్యం, భూ వినియోగంలో మార్పులు, వాతావరణ మార్పులు వంటివి జీవ వైవిధ్య క్షీణతకు ప్రత్యక్ష కారణాలు. జనాభా పెరుగుదల, ఉత్పత్తి, వినియోగ విధానాల్లో మార్పులు వంటివి పరోక్ష కారణాలు. 1980 నుంచి సముద్ర కాలుష్యం పది రెట్లు పెరగడం వల్ల కనీసం 267 జాతులు ప్రభావితమయ్యాయి. వాటిలో 86శాతం సముద్ర తాబేళ్లు, 44శాతం సముద్ర పక్షులు, 43శాతం సముద్ర క్షీరదాలున్నాయి. కలప కోసం చెట్లను నరకడం, గనుల తవ్వకం, తీరప్రాంత అభివృద్ధి పనుల వంటి మానవ కార్యకలాపాలు భూ, సముద్ర ఆవరణ వ్యవస్థలను, ఆవాసాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వన్యప్రాణి, వృక్ష జాతుల్లో దాదాపు సగం పారిశ్రామిక విప్లవం తరవాత నశించిపోయాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. 

జీవ వైవిధ్య నష్ట తీవ్రతను తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య ఒప్పందంలో 20 లక్ష్యాలు నిర్దేశించారు. 2020 నాటికి వాటిని సాధించాలని తీర్మానించారు. జీవవైవిధ్య నష్టానికి కారణాలను గుర్తించి సరిచేయడం, అందుకు ప్రభుత్వ అజెండాలో ప్రాధాన్యం కల్పించడం, ఆవరణ వ్యవస్థలను, జాతులను, వైవిధ్యాన్ని పరిరక్షించడం తదితరాలు ఆ లక్ష్యాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి 2020లో ప్రచురించిన ప్రపంచ జీవవైవిధ్య నివేదిక ప్రకారం 20 జీవ వైవిధ్య లక్ష్యాల్లో ఏ ఒక్కటీ ప్రపంచ స్థాయిలో సాకారం కాలేదు. ఇరవైలో ఆరు లక్ష్యాలు పాక్షికంగా సాకారమయ్యాయి. జీవవైవిధ్య నష్టాన్ని తిరిగి భర్తీ చేయడం అంత తేలిక కాదు. జీవజాతులు నశిస్తే వాటిని తిరిగి పొందలేం. అందువల్ల నష్ట నివారణే సరైన పరిష్కారం. నష్టానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. జీవ వైవిధ్య ఒప్పంద లక్ష్యాలను సాధించడానికి ఆయా ప్రభుత్వాలు ఇప్పటికైనా పూనుకోవాలి.


- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫ్రాన్స్‌ దారెటు?

‣ విశాఖ ఉక్కు నిలదొక్కుకుంటుందా?

‣ సాంస్కృతిక వెలుగులో జనగణన

‣ పర్యావరణ పరిరక్షణ కోసం... వెదురు పెంపకం!

Posted Date: 23-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని