• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణానికి కొండంత అండ

తవ్వేస్తే తప్పదు విపత్తు

అభివృద్ధి పేరుతో ఇండియాలోని చాలా పర్వతాలు విధ్వంసానికి గురి కావడం ఇటీవలి కాలంలో అధికమవుతోంది. ధరణి సమతౌల్యం కోసం సహజంగా పైకి పెరిగిన కఠినమైన భూభాగాలే కొండలు. ఇవి ప్రకృతి ప్రసాదించిన కానుకలు. వర్షాకాలంలో సక్రమంగా వాన కురవడానికి కొండలు ఎంతగానో తోడ్పడతాయి. భారతదేశంలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు అన్నీ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల సగటు ఎత్తు సుమారుగా 1,200 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు సుమారుగా 600 మీటర్లు. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల వల్ల వెచ్చని వాతావరణం ఉంటుంది. అది జలచక్రాన్ని వేగవంతం చేస్తుంది. ఫలితంగా మెండుగా వర్షాలు పడతాయి. ఈ వర్షపు నీరే ఎగువ నుంచి దిగువకు ప్రవహించి నదులుగా మారుతుంది. వాటికి ఆనకట్టలు కడితే, జలాశయలుగా ఏర్పడి ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తాయి. విద్యుదుత్పత్తికీ ఉపయోగపడతాయి. ఈ వర్షపునీరే భూ ఉపరితలంపై ప్రవహించి ధరణి వాలునుబట్టి లోతట్టు ప్రాంతాల్లోని గుంతలు, చెరువుల్లోకి చేరుతుంది. ఆ జలం ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ వర్షపు నీరే భూపొరల్లోకి చొచ్చుకుపోయి భూగర్భ జలంగా మారుతుంది. వాతావరణంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పులవల్ల ఇండియాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడం, వానలు అసలే కురవకపోవడం వంటివి ఇటీవలి కాలంలో సాధారణంగా మారాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసి, తీవ్ర స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి. అవి ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి అనిశ్చిత రుతుపవనాల వర్షపాతం వల్ల ఉపరితల జలాలు తరచూ ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా తాగు నీటితోపాటు, సాగుకు ప్రజలు, రైతులు భూగర్భజలాలను ఆశ్రయిస్తున్నారు. భారత్‌లో దాదాపు 80శాతానికి భూగర్భ జలాలే ఆధారం.

సహజంగా పగటిపూట కొండల ఉపరితలం వేడిగా ఉంటుంది. దానివల్ల వాటిపై ఉన్న తేమతో కూడిన గాలి పైకి కదులుతుంది. ఎత్తుకు పోయేకొద్దీ శీతలీకరణ రేటు పెరుగుతుంది. ఉష్ణోగ్రత రేటు తగ్గుతుంది. అందువల్ల పైకి వెళ్ళిన గాలి విస్తరించి, చల్లబడుతుంది. తేమతో కూడిన గాలి మంచు బిందువులుగా ఘనీభవిస్తుంది. అలా మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురుస్తుంది. కొండలు ఎత్తుగా ఏర్పడి, బాగా ఏటవాలుగా ఉంటే వర్షపాతం సైతం ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ప్రాంతంలో కొండల ఎత్తు సముద్రమట్టానికి దాదాపు 300 మీటర్లకు మించి లేదు. అరకు ప్రాంతంలో కొండల ఎత్తు 1,700 మీటర్ల వరకు ఉంది. ఈ వ్యత్యాసంవల్లే విశాఖ తీర ప్రాంతాల్లో దాదాపు 800 మిల్లీమీటర్లు, అరకు ప్రాంతంలో 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఇంత ప్రయోజనకరంగా నిలిచే కొండలను అభివృద్ధిపేరుతో విచ్చలవిడిగా తవ్వడం, వాటిని చదును చేసి భవనాలు నిర్మించడం వంటి వాటివల్ల దీర్ఘకాలికంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. కొండలకు దగ్గరగా ఉన్న నగరాలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి ఇది దారితీస్తుంది. కొండల ఎత్తు, వాలు తరిగిపోవడంవల్ల వర్షపాతం తగ్గిపోతుంది. ఇది తీవ్రమైన కరవులకు దారితీస్తుంది. కొండల ప్రాంతాల్లో కనిపించే వృక్షజాతులతో పాటు జంతుజాలంపైనా ఈ ప్రభావం ఉంటుంది. ఇది సమీప భవిష్యత్తులో పర్యావరణ విపత్తుకు కారణమవుతుంది. మొత్తంగా జీవవైవిధ్యానికి తీవ్ర భంగం వాటిల్లుతుంది.

పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కొండలపై భవన నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడంవల్ల పర్వత శిలల్లో పగుళ్లు ఏర్పడి వదులుగా తయారవుతాయి. వర్షపు నీరు వాటిలోకి చొచ్చుకుపోయి కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది. పర్వతాల పైనుంచి వర్షపునీరు దిగువ ప్రాంతాల్లోకి వరదల రూపంలో వచ్చి రోడ్లు, ఇళ్లు దెబ్బతింటాయి. ఇటువంటి విపత్తులను కేరళలో తరచూ చూస్తున్నాం. కొండలను విధ్వంసం చేయడం వల్ల- వర్షాలు సరిగ్గా పడవు. ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భ జల స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఇది దేశంలో తీవ్రమైన నీటి ఎద్దడికి దారితీస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొండలు, వాటి వాలుల క్షీణతను నివారించేందుకు ప్రభుత్వాలు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. తీవ్రమైన ప్రాథమిక పర్యావరణ సమస్యలనుË పరిష్కరించే దిశగా అడుగులు వేస్తేనే భవిష్యత్తులో తలెత్తే అనవసర ఉపద్రవాల నుంచి బయటపడటానికి ఆస్కారం లభిస్తుంది.

- ఎన్‌.సుశీల
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇటు దౌత్యరీతి... అటు ద్వంద్వనీతి!

‣ సత్వర న్యాయమే సమున్నత లక్ష్యం

Posted Date: 17-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం