• facebook
  • whatsapp
  • telegram

క్రిప్టోలకు మళ్ళీ రెక్కలు



బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలు నల్లధన చలామణీకి తోడ్పడతాయని, మదుపరులు మోసపోవడానికి దారితీస్తాయనే కారణంతో ప్రభుత్వాలు ప్రతికూల వైఖరి అవలంబిస్తూ వచ్చాయి. చాలా దేశాలు వీటిని నిషేధించాయి. క్రిప్టో చెల్లింపులను ఆమోదించవద్దని బ్యాంకులను ఆదేశించాయి. అయినప్పటికీ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ ధర ఇటీవల 72,000 డాలర్లకు ఎగబాకింది.


ఈ ఏడాది ప్రారంభంలో 42,000 డాలర్లు మాత్రమే ఉన్న బిట్‌ కాయిన్‌ ధర భారీగా పెరిగింది. దీనితోపాటు ప్రపంచంలో రెండో పెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఈథర్‌ సైతం 16శాతం పెరిగింది. ఇతర క్రిప్టోల విలువా పెరిగిపోయింది. అమెరికా, బ్రిటన్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయాలే క్రిప్టోల విజృంభణకు కారణమయ్యాయి. క్రిప్టో ఆధారిత ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)లకు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) మొట్టమొదటిసారిగా ఈ జనవరిలో అనుమతి ఇచ్చింది. దాంతో ఫిడెలిటీ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ వంటి సంస్థలు క్రిప్టో ఈటీఎఫ్‌లను మదుపరులకు అందుబాటులోకి తెచ్చాయి. మొత్తం తొమ్మిది ప్రముఖ క్రిప్టో ఈటీఎఫ్‌లలోకి కేవలం ఏడువారాల్లో 1000 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి.


నిపుణుల హెచ్చరిక

అమెరికా తరవాత బ్రిటిష్‌ ఆర్థిక నియంత్రణ సంస్థ ఎఫ్‌సీఏ ఈ నెలలో బిట్‌ కాయిన్‌ ఆధారిత సెక్యూరిటీలు స్టాక్‌ మార్కెట్లో నమోదు కావడానికి అనుమతించింది. క్రిప్టో ఆస్తులపై ఆధారపడిన ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ నోట్స్‌ (సీఈటీఎన్‌) అమ్మకాలు, కొనుగోళ్లకు అభ్యంతరం పెట్టబోనని ప్రకటించింది. దీంతో సీఈటీఎన్‌లు విరివిగా మార్కెట్లో చలామణీ కానున్నాయి. సీఈటీఎన్‌లు సైతం ఈటీఎఫ్‌ల వంటివే. దీనికితోడు విదేశీ క్రిప్టో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులను అనుమతిస్తున్నట్లు థాయ్‌లాండ్‌ ఇటీవల ప్రకటించడమూ బిట్‌ కాయిన్‌ ధర పెరగడానికి దోహదం చేస్తోంది. ట్రేడర్లు క్రిప్టోలను కొనకుండానే క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి సీఈటీఎన్‌లు, బిట్‌ కాయిన్‌ ఈటీఎఫ్‌లు వీలుకల్పిస్తాయి. రిటైల్‌ మదుపరులకు మాత్రం ఇవి అందుబాటులో ఉండవు. క్రిప్టోలలో నష్టభయం విపరీతమని, వీటిలో పెట్టుబడి పెట్టేవారు మొత్తం డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని ఎఫ్‌సీఏ సైతం హెచ్చరించింది. బిట్‌ కాయిన్‌ను స్వయంగా కొనకుండానే దాని ధర పెరుగుతుందనో, తగ్గుతుందనో మదుపరులు పందెం కాయడానికి ఈటీఎఫ్‌ వీలు కల్పిస్తుంది. ఈటీఎఫ్‌లో మదుపరి పెట్టుబడి పెట్టగానే సంబంధిత ఫండ్‌ ఆ డబ్బుతో బిట్‌ కాయిన్లను కొనుగోలు చేస్తుంది. అదే బిట్‌ కాయిన్‌ ధర పెరగడానికి కారణమవుతోంది. కానీ, ఈ క్రిప్టో ధర ఎంత వేగంగా విజృంభిస్తుందో అంతే వేగంగా పతనం కాగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిట్‌ కాయిన్‌కు గిరాకీ పెరగడానికి క్రిప్టో ఈటీఎఫ్‌లు, సీఈటీఎన్‌లు మాత్రమే కారణం కావు. ఈ ఏప్రిల్‌లో బిట్‌ కాయిన్‌ మైనింగ్‌ సగానికి సగం తగ్గిపోనున్నందువల్ల వాటి సరఫరా మందగిస్తుంది. ఫలితంగా దానికి గిరాకీ విజృంభిస్తుంది. బిట్‌ కాయిన్ల సరఫరాను 2.1 కోట్లకు పరిమితం చేయాలని ముందే నిశ్చయించారు. కొత్త బిట్‌ కాయిన్లను మైనింగ్‌ అనే ప్రక్రియ ద్వారా ఉత్పన్నం చేస్తారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కొత్త బిట్‌ కాయిన్ల మైనింగ్‌కు ప్రతిఫలం తగ్గిపోతుంది. ఇంతవరకు మూడుసార్లు ఈ ప్రక్రియ జరిగింది. ఏప్రిల్‌లో నాలుగోసారి జరగబోతోంది. దానివల్ల మైనర్లు సృష్టించే బిట్‌ కాయిన్లు సగానికి సగం తగ్గిపోతాయి. అంటే వాటి గిరాకీ అమాంతం పెరిగి ధర విజృంభిస్తుంది.


భారీగా పతనం

తాజాగా బిట్‌ కాయిన్‌ ధర విజృంభణ వల్ల రోజుకు 1,500 మంది కొత్త క్రిప్టో కోటీశ్వరులు తయారవుతున్నారని అంచనా. అయితే, క్రిప్టోల విలువ స్థిరంగా ఉంటుందనే హామీ లేదు. నిరుడు నవంబరులో ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ కుప్పకూలిన సంగతి తెలిసిందే. 2022 నుంచి పలు క్రిప్టోల విలువ భారీగా పతనమవుతూ వచ్చింది. 2023లో అమెరికా ఎస్‌ఈసీ పలు క్రిప్టో కంపెనీలు, ఎక్స్ఛేంజీలపై కోర్టుల్లో దావాలు వేసింది. ఆ సంవత్సరం బిట్‌ కాయిన్‌ విలువ 65,000 డాలర్ల నుంచి 16,000 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం బిట్‌ కాయిన్‌ ధర 72,000 డాలర్లకు పెరిగినా, అది అక్కడే స్థిరంగా ఉంటుందనే భరోసా లేదు. కాబట్టి మదుపరులు జాగరూకతతో మెలగాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. 


- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ గాలి నాణ్యతకు హరిత ఇంధనం

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Posted Date: 20-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం