• facebook
  • whatsapp
  • telegram

రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?



డాలర్‌ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్‌కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.


ప్రపంచ వాణిజ్యం వృద్ధిచెందే క్రమంలో విదేశ మారక ద్రవ్య వినియోగం పెరుగుతూ వస్తోంది. 1950 దశకంలో భారతీయ రూపాయి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కువైట్‌, బహ్రెయిన్‌, ఒమన్‌, ఖతార్‌లలో చట్టబద్ధ కరెన్సీగా చలామణీ అయ్యేది. 1966లో రూపాయి విలువ తగ్గింపుతో ఈ దేశాలు సొంత కరెన్సీలవైపు మళ్ళాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిసినప్పటి నుంచి 1971 వరకు అమెరికన్‌ డాలర్‌, బ్రిటిష్‌ పౌండ్‌ ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలుగా ఉండేవి. 1971 ఆగస్టు 15న డాలర్‌ విలువను బంగారం ఆధారంగా నిర్ణయించే పద్ధతికి అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ స్వస్తి పలికారు. అప్పటి నుంచి జర్మన్‌ మార్క్‌, జపనీస్‌ యెన్‌ కూడా డాలర్‌, పౌండ్లతో పోటీ పడసాగాయి. 1974 చమురు సంక్షోభం ప్రపంచ కరెన్సీలన్నింటిపైనా ప్రభావం చూపింది. 1994లో వస్తుసేవలకు సంబంధించిన కరెంటు ఖాతా లావాదేవీల్లో భారతీయ రూపాయిని రిజర్వు బ్యాంకు పూర్తి పరివర్తనీయ (కన్వర్టబుల్‌) కరెన్సీగా ప్రకటించింది. పూర్తి పరివర్తనీయత అంటే అంతర్జాతీయ విపణిలో భారతీయ రూపాయిని ఉపయోగించి ఏ విదేశీ కరెన్సీనైనా కొనుగోలు చేయవచ్చని అర్థం. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా రూపాంతరం చెందించడం ప్రపంచంలో భారతదేశ రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యాన్ని పెంచుతుంది. ఇతర దేశాలతో వాణిజ్యం పెరుగుతుంది.


భారత్‌కు లాభదాయకం

ప్రస్తుతం అమెరికా డాలర్‌ ఒక్కటే అంతర్జాతీయ కరెన్సీగా చలామణీలో ఉంది. డాలర్‌ విలువలో హెచ్చుతగ్గులు ఇతర దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వర్ధమాన దేశాలు డాలర్లలో తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ భారం పెరిగిపోతున్నాయి. దాంతో డాలర్‌కు ప్రత్యామ్నాయం కోసం ఆసియా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వర్ధమాన దేశాలు డాలర్‌ బదులు సొంత కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు జరపాలని భారత్‌, బ్రెజిల్‌, రష్యా, చైనా తదితర దేశాలతో కూడిన ‘బ్రిక్స్‌’ కూటమి పిలుపిచ్చింది. సభ్యదేశాలతోపాటు వ్యాపార భాగస్వాములతోనూ స్థానిక కరెన్సీలలో లావాదేవీలు జరపాలని నిరుడు కేప్‌టౌన్‌లో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సభ తీర్మానించింది. చైనా యువాన్‌తోపాటు భారతీయ రూపాయికీ అంతర్జాతీయ కరెన్సీగా రూపాంతరం చెందే సత్తా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ పేర్కొంది. రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారితే భారతీయులు, ఇతర దేశాలవారు వ్యాపారంలో రూపాయిని స్వేచ్ఛగా వినియోగించగలుగుతారు. ఎగుమతులు, దిగుమతులకు రూపాయల్లో చెల్లింపులు జరపగలుగుతారు. పెట్టుబడుల ప్రవాహానికీ రూపాయి తోడ్పడుతుంది. నిరుడు జులైలో రిజర్వు బ్యాంకు అంతర్విభాగ బృందం (ఐడీజీ) రూపాయి అంతర్జాతీయీకరణకు రోడ్‌మ్యాప్‌ ప్రకటించింది. భారతీయ కార్పొరేట్‌ సంస్థలు విదేశాల్లో వాణిజ్య రుణాలు సేకరించడానికి, మసాలా బాండ్ల జారీకి పచ్చజెండా ఊపింది. భారతీయ కంపెనీలు రూపాయల్లో మసాలా బాండ్లను జారీ చేయడం ద్వారా విదేశాల్లో నిధులు సేకరించవచ్చని తెలిపింది. విదేశీ వాణిజ్యానికి రూపాయల్లో చెల్లింపులు జరపవచ్చని, విదేశీ వాణిజ్యం ద్వారా ఆర్జించిన సొమ్ములో మిగులును భారతీయ బాండ్ల మార్కెట్‌లో మదుపు చేయవచ్చని రిజర్వు బ్యాంకు 2022 జులైలో ప్రకటించింది. సోవియట్‌ యూనియన్‌, భారత్‌లు రూపాయి- రూబుళ్లలో వర్తకం జరిపేవి. సోవియట్‌ విచ్ఛిన్నం కావడంతో ఈ పద్ధతికి తెరపడింది. తరవాత రష్యా నుంచి చమురు దిగుమతులకు రూపాయల్లో చెల్లింపులు జరపడం ద్వారా భారత్‌ 3,000 కోట్ల డాలర్లను మిగుల్చుకోగలిగింది. ఇతర చమురు ఎగుమతి దేశాలకు డాలర్లలో చెల్లింపులు జరపాల్సి రావడంవల్ల భారత్‌కు వాణిజ్య లోటు పెరిగిపోతోంది. అలా కాకుండా రూపాయల్లోనే చెల్లింపులు జరపడం ఇండియాకు ఎంతగానో లాభిస్తుంది.


అవకాశాలు పుష్కలం

భారత్‌ ‘యూపీఐ’ ద్వారా ఇతర దేశాలతో జమ, చెల్లింపులను విస్తరించడానికి కృషి చేస్తోంది. నిరుడు ఫిబ్రవరి 1న భారతీయ ‘యూపీఐ’, సింగపూర్‌ ‘పే నౌ’ యంత్రాంగాలు అనుసంధానమయ్యాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య తక్కువ కమిషన్‌తోనే లావాదేవీలు జరుగుతున్నాయి. భారత్‌, యూఏఈల మధ్యా ఇటువంటి ఒప్పందమే కుదిరింది. ఇలా సీమాంతర లావాదేవీలు పెరిగేకొద్దీ భారతీయ క్లియరింగ్‌ సిస్టమ్‌ (ఐసీఎస్‌) ఏర్పడటం సులభమవుతుంది. ఇలాంటి లావాదేవీలను పరిష్కరించడానికి ఇప్పటికే ఆసియన్‌ క్లియరింగ్‌ యూనియన్‌ (ఏసీయూ) ఏర్పడింది. దాంతో స్థానిక కరెన్సీలలో లావాదేవీలు పెరుగుతున్నాయి. భారత్‌ సహా మరిన్ని దేశాలను ఏసీయూలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటివల్ల డాలర్‌ ఆధిపత్యం దెబ్బతినకపోవచ్చు. కానీ, భారత జీడీపీ వేగంగా వృద్ధి చెందుతున్న దృష్ట్యా రానున్న సంవత్సరాల్లో రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విత్త లోటు, ద్రవ్యోల్బణం, బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులను తగ్గించడం- రూపాయికి బలిమిని చేకూర్చి అంతర్జాతీయ కరెన్సీగా ఎదగడానికి దోహదం చేస్తుంది. ప్రస్తుతానికి డాలర్‌కు పూర్తిగా స్వస్తి చెప్పడంకన్నా మొదట కొంత వాణిజ్యాన్ని రూపాయల్లో జరపాలి. క్రమంగా ఎగుమతులను పెంచుకుంటూ, రూపాయి విలువను స్థిరంగా ఉంచుకుంటూ అంతర్జాతీయ కరెన్సీ హోదాను సాధించాలి.


చెల్లింపుల కోసం ప్రత్యేక ఖాతాలు

వ్యాపార లావాదేవీల కోసం ఇతర దేశాలు రూపాయల్లో చెల్లింపులు జరపడానికి వీలుగా ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరవడానికి భారతీయ రిజర్వు బ్యాంకు 22 దేశాల బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల భారతీయ వర్తకులు దిగుమతుల కోసం రూపాయల్లో చెల్లింపులు జరపగలుగుతారు. ఎగుమతిదారులు వోస్ట్రో ఖాతాల నుంచి చెల్లింపులు స్వీకరించగలుగుతారు. 2018లో భారత్‌, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కింద ఇరానియన్‌ బ్యాంకులు భారతీయ బ్యాంకుల్లో వోస్ట్రో ఖాతాలు తెరిచాయి. ఇరాన్‌కు చేసిన ఎగుమతులకు చెల్లింపులు ఈ ఖాతాల్లో జమ అయ్యాయి. క్యూబా, లగ్జెంబర్గ్‌లు సైతం భారత్‌తో రూపాయల్లో వ్యాపార లావాదేవీలు జరపడానికి సముఖత వ్యక్తం చేశాయి. కానీ, భారత్‌ ఆయా దేశాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటోంది. వాటికి రూపాయల్లో చెల్లింపులు స్వీకరించడానికి అన్ని దేశాలూ సిద్ధంగా లేవు. సింగపూర్‌, మలేసియా, ఇండొనేసియా, హాంకాంగ్‌, శ్రీలంక, యూఏఈ, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, బ్రిటన్‌ వంటి దేశాలు కొంతవరకు రూపాయలను స్వీకరిస్తున్నాయి. నేపాల్‌, భూటాన్‌, మలేసియా కేంద్ర బ్యాంకులు భారత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేశాయి. భారత్‌, జపాన్‌ మధ్య 7,500 కోట్ల డాలర్ల వరకు పరస్పర కరెన్సీలలో వ్యాపారానికి వెసులుబాటు ఉంది. మరిన్ని దేశాలతో సొంత కరెన్సీలలో వాణిజ్య వృద్ధికి కృషి జరగాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అయోమయంలో అమెరికా ఓటరు

‣ మాట మార్చిన ముయిజ్జు

‣ నైపుణ్యాలే ఉపాధి సోపానాలు

‣ పట్టాలెక్కని మహిళా కోటా

‣ వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి

‣ మసిబారుతున్న ప్రజారోగ్యం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

Posted Date: 12-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం