• facebook
  • whatsapp
  • telegram

పట్టాలెక్కని మహిళా కోటారాజకీయ నాయకుల మాటలకు చేతలకు పొంతన లేకపోవడం భారత్‌లో రివాజు. మహిళలకు చట్టసభల్లో మూడో వంతు సీట్లను కేటాయించే 106వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు నిరుడు ఆమోదించింది. ఇది అమలు కావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళలకు ఎన్ని సీట్లు కేటాయిస్తాయన్నది ఆసక్తిగా మారింది.


దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో- చట్టసభల్లో మహిళల కోటా అమలు విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు వారికి ఎన్ని సీట్లు ఇస్తాయన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. చట్టసభల్లో మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయించే రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటు నిరుడు ఆమోదించింది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తరవాత ఈ బిల్లు అమలులోకి వచ్చే అవకాశముంది. అసలు అప్పటివరకు ఎందుకు ఆగాలని బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు మహిళా కోటాను అమలు చేయకుండా భాజపా ఎత్తులుజిత్తులు పన్నుతోందని ఆ పార్టీ దుమారం రేపింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడం ద్వారా భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టవచ్చు కదా? కానీ, ఆ పార్టీ అలా చేయడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో మూడో వంతు సీట్లను మహిళలకు ఎందుకు కేటాయించడంలేదో కాంగ్రెస్‌ పార్టీ జవాబు చెప్పుకోవాల్సి వస్తోంది. మరోవైపు దేశంలోని 97 కోట్ల ఓటర్లలో సగం మంది మహిళలే అయినప్పుడు వారికి 50శాతం సీట్లు కాకుండా 33శాతంతో సరిపెట్టడమేమిటని చాలామంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


ప్రాతినిధ్యం పెరుగుతుందా?

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ప్రకటించిన లోక్‌సభ సీట్లలో 17శాతం వరకు మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. భాజపా తుది జాబితా వెలువడిన తరవాత మొత్తం మహిళా అభ్యర్థులెందరో తెలుస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 428 మంది భాజపా అభ్యర్థులలో 38 మంది మహిళలు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ మహిళా అభ్యర్థుల సంఖ్య 55కు పెరిగింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థులలో మహిళలు 13శాతం లోపే. అయినాసరే, అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33శాతం సీట్లను కేటాయిస్తామని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. గడువు ముగుస్తున్న ప్రస్తుత లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యులలో 78 మంది మహిళలు ఉన్నారు. కొత్త లోక్‌సభలోనైనా మహిళల సంఖ్య ఏమైనా పెరుగుతుందేమో చూడాలి.


ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో మొదటి నుంచీ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే. ఈ విషయంలో ప్రపంచ సగటు 26.9శాతం. భారత్‌లో అది కేవలం 14.3శాతమే. చాలా సంపన్న దేశాలకన్నా ఎంతో ముందుగానే భారత్‌ మహిళలకు ఓటు హక్కు కల్పించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. అసలు చట్ట సభలను మహిళలు అలంకరించడమనేదే సాధారణ స్త్రీలకు ఎంతగానో స్ఫూర్తినిస్తుంది. ఇంతవరకు పురుషాధిక్యతకు ఆలవాలమైన దేశ రాజకీయాల్లో స్త్రీలు రాణిస్తే అది యావత్‌ మహిళా లోకాన్ని ఉత్తేజపరుస్తుంది. మహిళలకు చట్టసభల్లో సమ ప్రాతినిధ్యమివ్వని రాజకీయ పార్టీలు- వారికి ఉద్యోగాల్లో కోటాలను, నెలవారీ పింఛన్లను, ఇతర ఉచిత వరాలను మాత్రం ప్రసాదిస్తున్నాయి. రెండేళ్ల క్రితం పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) ఘన విజయం సాధించిందంటే కారణం- 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలనెలా రూ.1,000 భృతి ఇస్తామని వాగ్దానం చేయడమే. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే భృతిని చెల్లిస్తామన్న ఆప్‌, రెండేళ్లు గడచిపోయినా దాని ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా అమలు చేయలేని హామీలను ఎడాపెడా గుప్పిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో ఏటా లక్ష రూపాయలు జమ చేస్తామని; అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 50శాతాన్ని మహిళలకు కేటాయిస్తామని వాగ్దానం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగా మహిళా ఓట్లు ఎక్కువగా భాజపాకు బదిలీ అవుతాయేమోనన్న భయమే కాంగ్రెస్‌ను ఇటువంటి హామీలకు పురిగొల్పుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలు కూడా మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతాదళ్‌ వంటి పార్టీల్లో మహిళా ప్రతినిధుల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మహిళలకు సీట్లు ఇచ్చినా వారు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారని నేతలు సాకులు చెబుతున్నారు. మహిళలు రాజకీయాల్లో ప్రవేశించి, ముందుగా స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో తలపడాలి. తద్వారా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో రాణించడానికి వారికి అనుభవం వస్తుంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు పురపాలక సంఘాలను మహిళలకు శిక్షణ క్షేత్రాలుగా ఉపయోగించాలి. అక్కడి అనుభవంతో వారు చట్టసభల్లోనూ సత్తా చూపగలుగుతారు.


చట్టసభల్లో అడుగు

భారతీయ సమాజంలో వివిధ సంప్రదాయాలు, పాతకాలపు భావజాలాలు, సామాజిక- ఆర్థిక కారణాలు మహిళలను వెనక్కిలాగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఈ 75 ఏళ్లలో పాత దృక్పథాలు, అలవాట్లు చాలావరకు మారిపోవడం స్వాగతించాల్సిన అంశం. నేడు బాలికలు ఉన్నతవిద్యలో ముందడుగు వేస్తున్నారు. విద్యారంగంలో లింగ సమానత్వం సాధిస్తున్నారు. క్రికెట్‌లో భారత మహిళా జట్టు విజయాలు వారు నేర్వలేని విద్య లేదని చాటుతున్నాయి. పురుషులకు దీటుగా తాము విజయాలు సాధించగలమని అంతరిక్ష రంగంలో మహిళలు నిరూపిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పలువురు మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చంద్రయాన్‌-3 విజయంలో మహిళా శాస్త్రవేత్తలు నిరుపమాన పాత్ర పోషించారు. ఎన్నో ఘన విజయాలను నమోదు చేస్తున్న మహిళలు చట్టసభల్లో మాత్రం అడుగు మోపరాదని రాజకీయ నాయకులు భావిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. రాకెట్‌ సైన్స్‌కు విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలు కావాలి. రాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రత్యేక నైపుణ్యాలు, విద్యార్హతలు ఏమీ అక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం లభించాలి.


ఎన్నో ఉద్యమాల ఫలితం

దేశంలో దశాబ్దాల తరబడి మహిళా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వాటి ఫలితంగానే నేడు అనేక రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. న్యాయ, గణాంక శాఖలు... కంపెనీలు, ప్రభుత్వ విభాగాల నిర్వహణతో పాటు సమాచార సాధనాలు, హైటెక్‌ రంగాల్లో మహిళలు అసమాన ప్రతిభ కనబరుస్తున్నారు. వివిధ వృత్తుల్లోనూ అగ్రగాములుగా రాణిస్తున్నారు. అయితే, ఉన్నతస్థాయి పదవుల్లో పురుషులతో సమానంగా వారికి ఇంకా సమధిక వాటా దక్కాల్సి ఉంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి

‣ మసిబారుతున్న ప్రజారోగ్యం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ మహాలయం ముప్పున హిమాలయం

‣ సంరక్షణ కొరవడి సంక్షోభం

‣ స్వావలంబనలో కీలక మైలురాయి

‣ మద్దతుకు భరోసా.. రైతుకు దిలాసా!

Posted Date: 06-04-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని