• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ను నిలువరించే ఎత్తుగడ

ఇండో-పసిఫిక్‌లో మౌలిక వసతులపై క్వాడ్‌ దృష్టి

 

 

ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్న వేళ టోక్యో వేదికగా ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఆవిర్భవించిన చతుర్భుజ కూటమి-క్వాడ్‌ సభ్య దేశాల (ఇండియా, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా) నేతలు అక్కడ సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపారు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరతలను పరిరక్షించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్‌ విస్తరణవాదానికి ముకుతాడు వేయాలన్న బలమైన ఆకాంక్ష వాటిలో స్పష్టంగా కనిపించింది. సదస్సులో పాల్గొనేందుకు టోక్యో వెళ్ళిన ప్రధాని మోదీ- క్వాడ్‌ దేశాల మధ్య పరస్పర సహకారం ఊపందుకుంటున్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులకు నవోత్తేజాన్నిస్తోందంటూ చేసిన ప్రసంగం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ పర్యటనలో క్వాడ్‌లోని ముగ్గురు సహచర ప్రభుత్వాధినేతలతో మోదీ విడివిడిగానూ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు. జపాన్‌ వ్యాపార ప్రముఖులతో సమావేశమై పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు.

 

కీలక నిర్ణయాలు

క్వాడ్‌ నేతలు రెండేళ్లలో నాలుగుసార్లు (రెండుసార్లు వర్చువల్‌గా) సమావేశం కావడం కూటమి బలోపేతానికి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. తాజా సదస్సులో సభ్య దేశాలు ఇండో-పసిఫిక్‌లో తమకు ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్లపై చర్చించడంతోపాటు, పరిష్కారంపై దృష్టి సారించాయి. ప్రాంతీయంగా స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేందుకు సైబర్‌ భద్రత ఎంత ముఖ్యమో చెబుతూ, ఆ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించుకున్నాయి. తీరప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ శాంతి, సుస్థిరతలను పరిరక్షించేందుకు వీలుగా ఇండో-పసిఫిక్‌ నౌకాదళరంగ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు మెరుగ్గా నిర్వహించడమే లక్ష్యంగా క్వాడ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నట్లు ప్రకటించాయి. పారిస్‌ ఒప్పందం, కాప్‌-26 సదస్సుకు సంబంధించిన తీర్మానాల అమలు కోసం ‘క్వాడ్‌ వాతావరణ మార్పుల అవగాహన, ప్రభావం తగ్గింపు ప్యాకేజీ’ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా సభ్య దేశాల్లో హరిత ఓడరేవుల నిర్మాణానికి కృషి చేయనున్నారు. పర్యావరణ హితకరమైన విధానాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. సెమీకండక్టర్ల ఉత్పత్తి, 5జీ సాంకేతికత విస్తరణ వంటి అంశాల్లో స్వీయ శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని క్వాడ్‌ తీర్మానించుకుంది. సభ్యదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంతోపాటు భావి శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఫెలోషిప్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏటా ఒక్కో సభ్యదేశం నుంచి 25 మంది చొప్పున మొత్తం వంద మందికి, అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ‘స్టెమ్‌’ కోర్సులు అభ్యసించేందుకు వీలుగా ఉపకార వేతనాలు అందజేస్తారు. కొవిడ్‌పై పోరులో క్వాడ్‌ ప్రపంచానికి మార్గదర్శనం చేసింది. మహమ్మారి నియంత్రణ చర్యలకు నిధులు సమకూర్చడంలో ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులోనూ ఇలాగే పెద్దన్న పాత్ర పోషిస్తూ మహమ్మారుల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రపంచ ఆహార భద్రతకు ఉమ్మడిగా కృషి చేయాలని క్వాడ్‌ తాజా సదస్సులో తీర్మానించింది.

 

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనపైనా క్వాడ్‌ దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం రానున్న అయిదేళ్లలో అయిదు వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్లు ప్రకటించింది. ప్రాంతీయంగా చైనా ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగానే కూటమి ఇందుకు పూనుకొన్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ద్వారా డ్రాగన్‌ కొన్నేళ్లుగా విదేశాల్లోని ప్రాజెక్టులకు భారీగా నిధులిస్తోంది. ఆయా దేశాలను రుణ ఊబిలోకి దించుతోంది. దానికి విరుగుడుగా పారదర్శక రీతిలో, సుస్థిరాభివృద్ధికి దన్నుగా నిలిచేందుకు తమ పెట్టుబడులను వినియోగించనున్నట్లు క్వాడ్‌ దేశాలు ప్రకటించాయి. ఇందుకోసం రుణ నిర్వహణ వనరుల పోర్టల్‌ను ప్రారంభించాయి. క్వాడ్‌ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో చైనా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, పారదర్శకంగా పెట్టుబడులన్న మాట ఆ దేశానికి చురకలంటించేదే. ఇండో-పసిఫిక్‌లో రెచ్చగొట్టే కార్యకలాపాలను సహించబోమని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో బలప్రయోగ ప్రయత్నాలను మానుకోవాలని చేసిన వ్యాఖ్యలూ డ్రాగన్‌కు హెచ్చరికలే. పసిఫిక్‌ ద్వీపదేశాలతో ఆర్థిక, ఆరోగ్య, మౌలిక వసతులు, నౌకాదళ భద్రత, పర్యావరణ మార్పుల వంటి రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని క్వాడ్‌ తాజాగా నిర్ణయించుకుంది.

 

ఐక్యతా రాగం

ఉగ్రభూతంపై పోరు విషయంలో క్వాడ్‌ దేశాలు ఐక్యతా రాగాన్ని ఆలపించాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు జరిపిన 26/11, పఠాన్‌కోట్‌ దాడులను ఖండించడం ద్వారా ఇండియాకు మద్దతుగా నిలిచాయి. ఉగ్రవాదం ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పాయి. ఇది కచ్చితంగా పాకిస్థాన్‌కు హెచ్చరిక వంటిదే. ఇతర దేశాలపై దాడులు జరిపేందుకు అఫ్గానిస్థాన్‌ భూభాగాన్ని ముష్కరులు ఉపయోగించుకోకుండా చూడాలంటూ తాలిబన్‌ సర్కారుకు క్వాడ్‌ హితబోధ చేసింది. పాక్‌, అఫ్గాన్‌లలో ముష్కర మూకలకు చైనా అందిస్తున్న సహకారాన్ని పరోక్షంగా తప్పుపట్టింది. టోక్యో పర్యటనలో మోదీ జపాన్‌కు చెందిన 34 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇండియాలో వ్యాపారావకాశాలు పుష్కలమని వివరించి, విస్తృత స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. షింజో అబే సహా మొత్తం ముగ్గురు జపాన్‌ మాజీ ప్రధానమంత్రులు టోక్యోలో మోదీతో భేటీ కావడం, ఆయన విశ్వసనీయతకు నిదర్శనమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన ఇండో-పసిఫిక్‌ ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈఎఫ్‌)లో భారత్‌ భాగస్వామిగా చేరడమూ కీలక పరిణామాల్లో ఒకటి. మొత్తంగా క్వాడ్‌ సదస్సు, మోదీ జపాన్‌ పర్యటన భౌగోళిక రాజకీయాల్లో భారత్‌ ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టీకరించాయి!

 

భారత్‌ వైఖరికి ఆమోదముద్ర!

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధానమంత్రి కిషిద ఇటీవలి క్వాడ్‌ సదస్సులో దూకుడుగా మాట్లాడారు. రష్యాపై దుమ్మెత్తి పోశారు. క్వాడ్‌ సంయుక్త ప్రకటనలో మాత్రం మాస్కో తీరును తీవ్రంగా వ్యతిరేకించే వ్యాఖ్యలేవీ లేవు. ఇది ముమ్మాటికీ భారత్‌ దౌత్యనీతికి దక్కిన విజయమే.

భౌగోళిక, సైనికపరమైన కారణాల రీత్యా ముందునుంచీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని దిల్లీ పెద్దగా విమర్శించడం లేదు. మాస్కో విషయంలో ఇండియా ధోరణిని తొలినాళ్లలో తప్పుపట్టిన బైడెన్‌ తరవాత తగ్గారు.

అంతర్జాతీయ చట్టాలకు లోబడి వివాదాలకు చర్చలతో దౌత్యపరమైన మార్గాల్లోనే పరిష్కారం వెతకాలని ఉమ్మడి ప్రకటనలో క్వాడ్‌ పేర్కొంది. దిల్లీ ముందునుంచీ చెబుతున్నదిదే.

ఈ పరిణామాల ద్వారా  ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో మన దేశం వైఖరికి క్వాడ్‌   ఆమోద ముద్ర వేసినట్లయింది.

 

 

- మండ నవీన్‌కుమార్‌ గౌడ్‌
 

Posted Date: 04-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం