• facebook
  • whatsapp
  • telegram

అయోమయంలో అమెరికా ఓటరు



భారత్‌ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికాలోనూ ఎన్నికల వేడి రాజుకొంది. నవంబరు 5న (2024) జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారు. కానీ, ఈసారి ఎన్నికలపై అమెరికన్లలో నిరాసక్తత వ్యక్తమవుతోంది.


ప్రపంచ రాజకీయాలను శాసించగల అగ్రరాజ్యం అమెరికాలో ఈ దఫా అధ్యక్ష ఎన్నికలు ఊహించినంత ఉత్కంఠ రేపడం లేదు. నాలుగేళ్ల కిందటిలానే డెమొక్రాట్ల తరఫున 81 ఏళ్ల జో  బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరఫున 77 ఏళ్ల ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పీఠం కోసం ముఖాముఖి తల పడనున్నారు.ఇప్పటికే వారిద్దరూ తమ పార్టీల ‘ప్రైమరీ’ పోరులో అభ్యర్థిత్వాలకు అవసరమైన మద్దతు కూడగట్టుకున్నారు. అమెరికా చరిత్రలో అత్యధిక వయసున్న అధ్యక్ష అభ్యర్థులు బరిలో నిలవడం ఇదే తొలిసారి కానుంది.


బైడెన్‌లో తడబాటు

డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష ‘ప్రైమరీ’లో అధ్యక్షుడు బైడెన్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. అలాగని ఆయన అభ్యర్థిత్వంపై మద్దతుదారులు, ఓటర్లలో అంతగా ఆసక్తి ఏమీ కనిపించలేదు. ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రత, పశ్చిమాసియా సంక్షోభం తదితర అంశాల్లో అధ్యక్షుడి వైఖరిపై వారు అసంతృప్తితో ఉన్నారు. అన్నింటికంటే వారిని ఆందోళనకు గురిచేస్తున్న అంశం- ఆయన వయసు. 81 సంవత్సరాల వయసులో బైడెన్‌ నెగ్గి మళ్ళీ పగ్గాలు చేపడితే నాలుగేళ్లు అధికారంలో ఉంటారు. అంతకాలం ఆయన సమర్థంగా పాలించగలుగుతారా అన్న ప్రశ్న సగటు ఓటరును తొలుస్తోంది. బహిరంగ వేదికలపై బైడెన్‌ పదేపదే చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి తావిస్తున్నాయి. రహస్యపత్రాలపై విచారణకు న్యాయవిభాగం నియమించిన అటార్నీ రాబర్ట్‌హర్‌ తన నివేదికలో అధ్యక్షుడి జ్ఞాపకశక్తిపై పలు సందేహాలను లేవనెత్తారు. తన కుమారుడు చనిపోయిన సంవత్సరం గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా బైడెన్‌ ఇబ్బంది పడ్డారని నివేదికలో ప్రస్తావించారు. ఇటీవల విలేకరుల సమావేశాల్లో అధ్యక్షుడు తడబడిన సందర్భాలు అనేకం. ఆయనను సమర్థించేవారు మాత్రం వయసు అంశాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆర్థికంగా దేశం బలోపేతమవుతుండటం, నిరుద్యోగం తగ్గడం, ప్రత్యర్థి ట్రంప్‌ ఎదుర్కొంటున్న న్యాయ సమస్యలు వంటి కారణాలవల్ల ఓటర్ల అభిప్రాయాలు బైడెన్‌కు అనుకూలంగా మారతాయని వారు విశ్వసిస్తున్నారు.


ట్రంప్‌ సైతం అనేక సందర్భాల్లో తడబడిన దాఖలాలు ఉన్నాయి. బైడెన్‌ను బరాక్‌ ఒబామాగా పలుమార్లు పేర్కొన్నారు. ‘ప్రైమరీ’లో తనతో తలపడిన నిక్కీ హేలీని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ పెలోసీగా ప్రస్తావించిన సందర్భాలున్నాయి. గతంలో ఏ అధ్యక్ష అభ్యర్థిపైనా లేనన్ని నేరాభియోగాలను ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. తన ఆస్తుల లెక్కలను తప్పుగా చూపినందుకు న్యాయస్థానం ఇటీవల భారీ జరిమానా విధించింది. దానిపై ట్రంప్‌ అప్పీలుకు వెళ్ళారు. రచయిత జీన్‌ కెరోల్‌ వేసిన పరువునష్టం కేసులో ఆయన 81 మిలియన్‌ డాలర్ల విలువైన బాండును ఇటీవల కోర్టుకు సమర్పించాల్సి వచ్చింది. 2020లో క్యాపిటల్‌ భవనంపైకి తన అనుచరులను పురిగొల్పిన కేసుల్లోనూ ఈ మాజీ అధ్యక్షుడు న్యాయవిచారణను ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల వేళ నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌ నోరు మూయించడానికి భారీగా డబ్బు చెల్లించడం, రహస్యపత్రాలను అనధికారికంగా ఉంచుకోవడం వంటి 80కు పైగా అభియోగాలు ట్రంప్‌పై నమోదై ఉన్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే, మరోవైపు న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారాయన!


దిల్లీకి ధీమా

పరస్పర ఆరోపణలతో బైడెన్‌, ట్రంప్‌ ప్రచారంలో దూసుకుపోతున్నా, వారిద్దరూ తలపడటాన్ని చాలామంది అమెరికన్లు కోరుకోవడంలేదు. తాజా సర్వేలో 53శాతం ట్రంప్‌ అభ్యర్థిత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేయలేదు. బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని 55శాతం వ్యతిరేకించారు. అధికారంలోకి ఎవరొచ్చినా భారత్‌ పట్ల అనుసరించే విధానాల్లో పెద్ద మార్పులేమీ ఉండవు. కాకపోతే ఇండియా పట్ల బైడెన్‌ ప్రభుత్వ వైఖరిలో ఇటీవల కొంత తేడా కనిపిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులో అరెస్టయిన ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అంశాన్ని ఆ దేశ విదేశీ వ్యవహారాలశాఖ ప్రస్తావించింది. పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కొలువుదీర్చిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు బైడెన్‌ స్వయంగా లేఖ రాశారు. భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెటి- ఇఫ్తార్‌ విందుకు ప్రత్యేకించి కశ్మీరీ ఉద్యమ నేతలను ఆహ్వానించారు. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాలతో కూడిన చతుర్భుజ కూటమి (క్వాడ్‌) సమావేశాల విషయంలోనూ మునుపటి ఆసక్తిని అగ్రరాజ్యం కనబరచడంలేదు. అత్యధిక సర్వేలు చెబుతున్నట్లు ట్రంప్‌ మళ్ళీ అధ్యక్ష పగ్గాలు చేపడితే తమ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఐరోపా, నాటో దేశాల పెద్దల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటువంటి భయాలైతే దిల్లీకి లేవనే చెప్పాలి!


- మొకర శ్రీనివాస్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాట మార్చిన ముయిజ్జు

‣ నైపుణ్యాలే ఉపాధి సోపానాలు

‣ పట్టాలెక్కని మహిళా కోటా

‣ వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి

‣ మసిబారుతున్న ప్రజారోగ్యం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

Posted Date: 12-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం