• facebook
  • whatsapp
  • telegram

చైనా ముత్యాలసరంలో మాల్దీవులు



ఇటీవల ఇండియా ఇరుగు పొరుగు దేశాల్లో కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. భూటాన్‌, బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో భారత్‌ అనుకూల పార్టీలే అధికారంలోకి వచ్చాయి. తన ప్రాదేశిక జలాల్లో పరిశోధనకు విదేశీ నౌకల రాకపోకలపై శ్రీలంక ఏడాది పాటు నిషేధం విధించింది. దీనివల్ల భారత్‌ పరిసర జలాల్లో చైనా నౌకల సంచారానికి అడ్డుకట్ట పడుతుంది. మాల్దీవుల్లో డ్రాగన్‌ అనుకూల మహమ్మద్‌ ముయిజ్జ్జు సర్కారు ఏర్పడటం మాత్రం ఇండియాకు ఇబ్బందికర పరిణామమే!


హిందూ మహాసముద్రంలో 80,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన 1200 దీవుల సముదాయమే మాల్దీవులు. ఈ ద్వీప దేశం హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్‌)లో చాలా కీలకమైన ప్రదేశంలో ఉండటంవల్ల వ్యూహపరమైన ప్రాధాన్యం సంతరించుకొంది. అయితే, ఇటీవల ముయిజ్జ్జు సర్కారు చైనాకు అనుకూలంగా మారడం దిల్లీకి ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ‘పొరుగు ప్రాంతాలకు ప్రాధాన్యం’ విధానం కింద మాల్దీవులను భారత్‌ దగ్గర చేసుకుంది. ఇప్పుడా ద్వీప దేశ ప్రభుత్వం భారత్‌ను దూరం చేసుకోవాలని కంకణం కట్టుకుని చైనా, తుర్కియేలకు దగ్గరవుతోంది. గతంలో భారత్‌తో కలిసి సముద్ర పహరా నిర్వహించిన మాల్దీవులు ఇప్పుడు తుర్కియే నుంచి 3.7 కోట్ల డాలర్లతో డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. పహరా బాధ్యతనూ ఆ దేశానికే అప్పగించదలచింది. ఈ క్రమంలోనే మార్చి 15కల్లా భారత సైనిక దళాలు తమ భూభాగాన్ని విడిచి వెళ్ళాలని ఇటీవల ఆదేశించింది. గత డిసెంబరులో కొలంబోలో జరిగిన భద్రతా సంఘం సదస్సుకు మాల్దీవుల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. భారత్‌, శ్రీలంక, మారిషస్‌, మాల్దీవులతో కొలంబో భద్రతా సంఘం ఏర్పడింది. ఇండియా అభ్యంతరపెడుతున్నా లెక్కచేయకుండా ముయిజ్జు సర్కారు తమ సమీప జలాల్లో పరిశోధనకు చైనా నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌కు అనుమతి ఇచ్చింది.


అనుమానాస్పద కార్యకలాపాలు

చైనా ముత్యాల సరాల ప్రాజెక్టులో జిబూటీ రేవు కీలకమైనది. మాల్దీవులు కూడా చైనా ప్రాబల్యంలోకి వెళ్ళడంవల్ల జిబూటీ, సీషెల్స్‌, గ్వాడర్‌ రేవులతో అనుసంధానం సులువు అవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా యుద్ధ, పరిశోధక నౌకల సంచారం మరింత ముమ్మరమవుతుంది. ఈ నౌకలు భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలం సమీపానికి వస్తున్నాయి. 2020 నుంచి 13 చైనా నౌకలు హిందూ మహాసముద్రంలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అమెరికాకు చెందిన సీఎస్‌ఐఎస్‌ సంస్థ హెచ్చరించింది. చైనా పరిశోధక నౌకలు, ఉపగ్రహ సాయంతో నడిచే ట్రాకింగ్‌ నౌకలు, చేపల పడవలు, అణు జలాంతర్గాములు ఐఓఆర్‌లో కార్యకలాపాలను ఉద్ధృతం చేయడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నౌకలు హిందూ మహాసముద్ర గర్భాన్ని శోధించడంతో పాటు సాగర జలాల లవణీయత, అంతర్వాహినుల వేగాలను గణిస్తున్నాయి. ఈ సమాచారం చైనా జలాంతర్గాములకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సముద్రం లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళగల చైనా చేపల పడవలు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో నౌకల కదలికలను కనిపెడుతున్నాయి. భారత నౌకాదళ స్థావరాలు, క్షిపణి ప్రయోగాలపై నిఘా వేస్తున్నాయి. ఉత్తర హిందూ మహాసముద్ర జలాల్లో 392 చైనా చేపల పడవలు అక్రమంగా సంచరించాయని 2021లో భారత నౌకాదళం నివేదించింది. హిందూ మహాసముద్రంలో యువాన్‌ వాంగ్‌-5, యువాన్‌ వాంగ్‌-6 నౌకలు తిరుగుతున్నందువల్లే 2022లో భారత్‌ క్షిపణి పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. అంతకుముందు 2020 ఆగస్టులో తూర్పు లద్దాఖ్‌ సరిహద్దులో భారత్‌-చైనా దళాలు సంఘర్షించుకొంటున్న సమయంలో యువాన్‌ వాంగ్‌ శ్రేణికి చెందిన పరిశోధక నౌక ఒకటి హిందూ మహాసముద్రంలో తిరిగింది. ఇకపై మాల్దీవుల పరిసర జలాల్లోనూ డ్రాగన్‌ నౌకల సంచారం పెరగనుండటం ఆందోళనకర పరిణామం. హిందూ మహాసముద్రం గుండా చమురు, సహజవాయు రవాణా నౌకల ప్రయాణం చాలా ఎక్కువ. సరకుల ఎగుమతి, దిగుమతులూ పెద్దయెత్తున జరుగుతుంటాయి. అందువల్ల ఐఓఆర్‌ వాణిజ్యపరంగా భారత్‌, చైనాలకు ఆయువుపట్టు. భారత్‌ సాగర మార్గంలో జరిపే వాణిజ్యంలో 95శాతం ఐఓఆర్‌ ద్వారానే నడుస్తోంది. తనకు కావలసిన చమురును పర్షియన్‌ సింధు శాఖ ద్వారా తెచ్చుకొంటోంది.


నౌకాదళానికి సవాలు

ఆఫ్రికా తూర్పు తీరం నుంచి ఆస్ట్రేలియా వరకు విస్తరించిన ప్రదేశాలన్నీ హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్‌) కిందకు వస్తాయి. దీని తూర్పు భాగంలో భారత నౌకాదళానికి పట్టుంది. అయితే, పశ్చిమ హిందూ మహాసముద్రం బాగా దూరంలో ఉన్నందువల్ల అక్కడ తనకు ప్రాబల్యం తక్కువ. ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై ఈ మధ్య దాడులు పెరగడం భారత నౌకాదళానికి సవాలుగా మారింది. ఐఓఆర్‌లో నౌకాదళం మరింత పట్టు పెంచుకోవడం తప్పనిసరి. కాబట్టి నౌకా బలాన్ని, పహరాను పటిష్ఠపరచుకోవడం అత్యంత ఆవశ్యకం. చైనా మాత్రం భారీ బడ్జెట్‌తో తన నౌకాదళ పరిధిని అంతకంతకు విస్తరిస్తోంది. డ్రాగన్‌ దేశం 2025కల్లా 395 నౌకలను, 2030కల్లా 435 నౌకలను సమకూర్చుకొంటుందని అమెరికా నిరుడు అంచనా వేసింది. చైనా నౌకాదళంలో ఇప్పటికే మూడు విమాన వాహక నౌకలు, పెద్దసంఖ్యలో జలాంతర్గాములు, యుద్ధనౌకలు ఉన్నాయి. భారత నౌకాదళం నిధుల కొరతవల్ల చైనాకు దీటుగా బలగాన్ని సమకూర్చుకోలేకపోతోంది.


చైనా మాల్దీవులతో సంబంధాలను వృద్ధి చేసుకుంటున్న సమయంలోనే అమెరికా సైతం ఆ ద్వీప దేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌ జనవరి మొదటివారంలో మాల్దీవుల విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక రంగాల్లో సహకారం, వాతావరణ మార్పుల నిరోధం, ప్రజాస్వామ్యం, న్యాయపాలన గురించి చర్చించారు. చైనాతో ఇప్పటికే భూతల సరిహద్దు వివాదాన్ని ఎదుర్కొంటున్న భారత్‌కు సముద్రంలోనూ ఆ దేశం నుంచి సవాలు ఎదురవుతోంది. మాల్దీవుల్లో డ్రాగన్‌ హస్తమే ఇందుకు నిదర్శనం. చైనా ఐఓఆర్‌ దేశాలను రుణ ఊబిలోకి లాగి వాటిపై పట్టు బిగిస్తోంది. క్వాడ్‌, అమెరికా, ఐరోపాల సహకారంతో భారత్‌ హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా పన్నాగాలను సమర్థంగా ఎదుర్కోవాలి.


డ్రాగన్‌ చిరకాల వాంఛ

భారత్‌ మాదిరిగానే చైనా కూడా ఆఫ్రికా, ఐరోపా, పశ్చిమాసియాలకు ఎగుమతి దిగుమతులను హిందూ మహాసముద్ర ప్రాంతం ద్వారానే జరుపుతోంది. చమురునూ ఈ మార్గం గుండానే తెచ్చుకొంటోంది. ఐఓఆర్‌ చైనాకు దూరంగా ఉన్నందువల్ల ఇక్కడ స్థావరాలను ఏర్పరచుకోవాలని బీజింగ్‌ చిరకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే 1986 నుంచి మాల్దీవులను తన పలుకుబడిలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ఆ ప్రయత్నం ఇప్పుడు ఫలిస్తోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

‣ కాటేస్తున్న కాంతి కాలుష్యం

‣ ముందుచూపుతో తప్పిన ముప్పు

‣ డిజిటల్‌ బాటలో సత్వర న్యాయం

‣ మాల్దీవులతో పెరుగుతున్న అంతరం

Posted Date: 07-02-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం