• facebook
  • whatsapp
  • telegram

మాట మార్చిన ముయిజ్జు



అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్‌ పట్ల ప్రతికూల వైఖరి కనబరచిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఇటీవల బెట్టు సడలించారు. భారత్‌ తమ దేశానికి అన్నివిధాలా తోడ్పడటమే కాకుండా, ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిందని వ్యాఖ్యానించారు. తాము చెల్లించాల్సిన రుణం విషయంలో ఇండియా ఉదారంగా వ్యవహరించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.


మాల్దీవులకు ఏ కష్టమొచ్చినా మొదటినుంచీ ఆదుకుంటూ వచ్చింది భారతదేశమే. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్‌ ముయిజ్జు మాత్రం చైనా అనుకూల పంథాను అనుసరిస్తూ ఇండియా ప్రాముఖ్యతను విస్మరించారు. తమ భూభాగం నుంచి భారత సైనిక దళాలు వెళ్ళిపోవాలంటూ మొదట్లో కఠినంగా వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల ఆయన స్వరంలో మార్పు కనిపిస్తోంది. మార్చి 22న స్థానిక దినపత్రిక ‘మిహారు’కు ఇచ్చిన ముఖాముఖి ద్వారా ముయిజ్జు తొలిసారి భారత్‌కు స్నేహహస్తం సాచారు. మాల్దీవులకు భారత్‌ అన్నివిధాలా తోడ్పడుతోందని, తమ దేశంలో అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులను నిర్మించిందని ఆయన అంగీకరించారు. వాటి విషయమై అబూధాబీ ‘కాప్‌’ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తాను ధన్యవాదాలు తెలిపానని వెల్లడించారు. తమ దేశంలో ఆరంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను ఆపకుండా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలని మోదీని కోరినట్లు తెలిపారు.


రుణ భారంతో ఉక్కిరిబిక్కిరి

తమ దేశానికి ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో భారత్‌ ఉదారంగా వ్యవహరించాలంటూ ఇంటర్వ్యూ సందర్భంగా ముయిజ్జు విజ్ఞప్తి చేశారు. మాల్దీవులు ఈ సంవత్సరం ముగిసేసరికి భారత్‌కు సుమారు 40కోట్ల డాలర్ల బకాయిని చెల్లించాల్సి ఉంది. కేవలం 600 కోట్ల డాలర్ల పైచిలుకు జీడీపీ కలిగిన మాల్దీవులకు ఇంత మొత్తాన్ని చెల్లించడం కష్టసాధ్యం. ఆ దేశం ఇప్పటికే 357 కోట్ల డాలర్ల విదేశీ రుణభారంతో కుంగిపోతోంది. అందులో 42శాతాన్ని ఒక్క చైనాకే చెల్లించాల్సి ఉంది. భారత్‌కు మాల్దీవులు మొత్తం 51.7 కోట్ల డాలర్లు బకాయిపడింది. గడచిన ఆర్థిక సంవత్సరంలోనే ఇండియా 9.3 కోట్ల డాలర్లను మాల్దీవుల అభివృద్ధి ప్రాజెక్టులపై వెచ్చించింది. భారత్‌ ఎప్పటికప్పుడు ఆ దేశాన్ని ఆదుకుంటూ వచ్చింది. 1988 నవంబరులో మాల్దీవులలో తిరుగుబాటు జరిగిన వెంటనే భారత్‌ సైనిక దళాలను పంపింది. 1980, 90 దశకాల్లో అక్కడ 200 పడకల ఆస్పత్రిని, పాలిటెక్నిక్‌ కళాశాలను నెలకొల్పింది. 2004లో మాల్దీవులను సునామీ తాకినప్పుడు మొట్టమొదట స్పందించి సహాయం అందించింది భారతదేశమే. 2008 నుంచి అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులపై భారత్‌ రూ.2,454 కోట్లకు పైగా వెచ్చించింది. వాటిలో 500 గృహాల నిర్మాణం, టెక్నాలజీ అన్వయ కేంద్రం, పోలీసుల శిక్షణకు జాతీయ కళాశాల స్థాపన, తాగునీరు, పారిశుద్ధ్య కేంద్రం, హోటల్‌-టూరిజం శిక్షణ కేంద్రం తదితరాలు ఉన్నాయి. మాల్దీవుల జాతీయ రక్షణ బలగంలో ఇరవై వేల మందికి భారత్‌ శిక్షణ ఇచ్చింది. ఆ దేశ సముద్ర రక్షణ బలగంతో కలిసి భారత నౌకాదళం, తీర రక్షక దళం సంయుక్త అభ్యాసాలు నిర్వహించాయి. అయితే, తమ దేశం నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించాలంటూ తాను కోరడాన్ని ముయిజ్జు సమర్థించుకున్నారు. ఇది ఒక్క భారత్‌కే కాకుండా అన్ని దేశాలకూ వర్తిస్తుందన్నారు.


ఇండియా పట్ల ముయిజ్జు వైఖరి మారడానికి పలు కారణాలున్నాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే భారత్‌కు 40కోట్ల డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించడం మాల్దీవుల వంటి చిన్న దేశానికి సాధ్యంకాదు. మరోవైపు చైనా అదేపనిగా మాల్దీవులకు రుణాలివ్వడానికి సిద్ధంగా లేదు. ఇటీవల ముయిజ్జు చైనాను సందర్శించినప్పుడు 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ దేశం నుంచి 13కోట్ల డాలర్ల గ్రాంటునూ పొందారు. అయితే డ్రాగన్‌ సాయం అందుకున్న దేశాలు రుణ ఊబిలో కూరుకుపోతాయనేది జగమెరిగిన సత్యం. ఇందుకు శ్రీలంకే నిదర్శనం.


హితబోధను తలకెక్కించుకుంటారా?

మాల్దీవుల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇటీవల హెచ్చరించింది. భారత్‌ పట్ల మొండి వైఖరి తగదని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ సోలీ ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జుకు హితవు పలికారు. హిందూ మహాసముద్రంలో తమకు అత్యంత సమీపంలో ఉన్న ఇండియా ఏ కష్టమొచ్చినా ఆదుకొంటోందని ముయిజ్జు గ్రహించాలి. అందరికన్నా ముందుగా సహాయానికి సిద్ధమయ్యే భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీన్ని గుర్తించి ఇక ముందైనా భారత్‌ పట్ల ముయిజ్జు సహేతుకమైన, ఆచరణాత్మక పంథాను అనుసరిస్తారేమో చూడాలి!


- జె.కె.త్రిపాఠి (మాల్దీవుల్లో మాజీ దౌత్యాధికారి)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నైపుణ్యాలే ఉపాధి సోపానాలు

‣ పట్టాలెక్కని మహిళా కోటా

‣ వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి

‣ మసిబారుతున్న ప్రజారోగ్యం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

Posted Date: 06-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం