• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు



భారత్‌తో సరిహద్దుల విషయంలో చైనా వైఖరి ఎంతమాత్రం మారడం లేదు. ఇటీవల ప్రధాని మోదీ అరుణాల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అరుణాచల్‌ తమ దేశంలో అంతర్భాగమంటూ ఇండియా ఘాటుగానే బదులిచ్చింది. సరిహద్దుల్లో చైనా దూకుడును నిలువరించడానికి భారత్‌ మౌలిక వసతుల నిర్మాణాన్ని జోరుగా కొనసాగిస్తోంది.


భారత్‌-చైనాల మధ్య వాస్తవాధీన రేఖను పశ్చిమ (లద్దాఖ్‌), తూర్పు (సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌), మధ్య (ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌) విభాగాలుగా విభజించారు. వీటిలో పశ్చిమ (లద్దాఖ్‌) విభాగంలోనే చైనా దురాక్రమణల ముప్పు అధికం. 2020 గల్వాన్‌ ఘర్షణల తరవాతా భారత్‌, చైనా మధ్య 2021, 2022 సంవత్సరాలలో వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అరుణాచల్‌లోని యాంగ్‌ ట్సే పీఠభూమిలో 2022 డిసెంబరు తొమ్మిదిన ఇరుదేశాల సైనికులు తలపడ్డారు. ఈ పీఠభూమి బాగా ఎత్తులో ఉన్నందువల్ల వ్యూహపరంగా కీలకమైనది. వాస్తవాధీన రేఖ వెంబడి, లద్దాఖ్‌ వద్ద 2020లో సంఘర్షణలు సంభవించి భారత్‌, చైనాల మధ్య సంక్షుభిత వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్తతల ఉపశమనానికి రెండు దేశాలు సైనికంగా, దౌత్యపరంగా చర్చలు జరుపుతూ వస్తున్నాయి. గల్వాన్‌ లోయ, ప్యాంగ్యాంగ్‌ త్సో, గోగ్రా పోస్ట్‌, హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతాల నుంచి రెండు దేశాలు సైనికులను, ఆయుధాలను ఉపసంహరించినా- ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్‌, డెమ్‌చోక్‌ ప్రాంతాలలో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. డెప్సాంగ్‌ వద్ద భారత భూభాగంలోకి చైనా సైనికులు చొరబడ్డారు. అక్కడ భారత సైనికులు పహరా తిరగకుండా అడ్డుకుంటున్నారు. ఫిబ్రవరిలో భారత్‌-చైనా కోర్‌ కమాండర్ల మధ్య 21వ సమావేశం జరిగిన తరవాతా తన సైనికులను ఉపసంహరించడానికి చైనా నిరాకరిస్తోంది. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ప్రశాంత పరిస్థితులను కొనసాగించాలని, సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని అంగీకారం కుదిరింది.


దళాల మోహరింపు

భారత్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుకు కదలకుండా చేయగలమని, ఆకస్మిక దాడులకు పాల్పడగలమని హెచ్చరించడానికే చైనా లద్దాఖ్‌లో సరిహద్దు వివాదాన్ని ఉపయోగించుకొంటోంది. సరిహద్దులో ఉద్రిక్తతలను ఎగదోస్తూ ఉండటం ద్వారా భారత్‌ ఎక్కువ నిధులు, సమయాన్ని వెచ్చించే పరిస్థితిని కల్పిస్తోంది. సరిహద్దు వివాదాన్ని సమసిపోకుండా చూడాలన్నదే చైనా ఎత్తుగడగా ఉంది. చైనాకు అడ్డుకట్ట వేయడానికి మోదీ ప్రభుత్వం అమెరికాతో వ్యూహపరమైన పొత్తును బలపరచుకొంటోంది. క్వాడ్‌లో చేరి ఇండో-పసిఫిక్‌లో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకొంటోంది. చైనా సరిహద్దులో రహదారులు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని పెద్దయెత్తున చేపట్టింది. ఎక్కువ సంఖ్యలో సైనిక దళాలను మోహరిస్తోంది. పొరుగున దక్షిణాసియా దేశాలతో ఆర్థిక బంధాన్ని బలపరచుకొంటోంది. ఆ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టింది. ఇదంతా చైనాకు ఇబ్బంది కలిగిస్తోంది. గల్వాన్‌ ఘర్షణలకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడానికి చైనా నిరాకరిస్తున్నందువల్ల భారత్‌ సరిహద్దులో బందోబస్తును పెంచుతోంది. అమెరికాతో సహకారాన్ని పెంపొందించుకొంటోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరాఖండ్‌- హిమాచల్‌ మధ్య 545 కిలోమీటర్ల ప్రాంతంలో సైనిక మోహరింపును భారత్‌ పెంచింది. పరిపాలన, శిక్షణ, శాంతి కార్యకలాపాలు సాగించే ఉత్తర భారత్‌(యూబీ)గా వ్యవహరించే ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయి ఆపరేషనల్‌ కోర్‌గా తీర్చిదిద్దింది. ఈ కోర్‌ కింద అదనపు సైనికులు, ఫిరంగులు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఇంజినీర్‌ బ్రిగేడ్లను మోహరించింది. ఇది వ్యూహాత్మకంగా సరైన చర్యగా భావిస్తున్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఆగడాలను అడ్డుకోవడానికి బాగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. అంతేకాదు- ఎల్‌ఏసీ పొడవునా అదనపు బలగాలు, ఆయుధ వ్యవస్థలను మోహరించడానికి భారత సైన్యం నడుంకట్టింది. గల్వాన్‌ ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఎల్‌ఏసీపై పశ్చిమ, మధ్య, తూర్పు విభాగాలలో మోహరింపును పెంచింది. పాకిస్థాన్‌ సరిహద్దులోని ఒకటో దాడి దళాన్ని(స్ట్రైక్‌ కోర్‌) చైనా సరిహద్దుకు బదిలీ చేసింది. పానాగఢ్‌లోని 17వ కోర్‌ను ఎల్‌ఏసీ తూర్పు విభాగానికి తరలించింది. ఎల్‌ఏసీ పశ్చిమ, తూర్పు విభాగాలు రెండింటినీ పర్యవేక్షిస్తున్న పర్వత పోరాట దళం (మౌంటెన్‌ స్ట్రైక్‌ కోర్‌)ను ఇకపై పూర్తిగా తూర్పు విభాగంలోనే కేంద్రీకరిస్తోంది.


ముమ్మర కృషి

అమెరికా, క్వాడ్‌ కూటమి సహకారంతో చైనా దూకుడును అడ్డుకోవడానికి భారత్‌ ముమ్మరంగా కృషి చేస్తోంది. భారత్‌-అమెరికాలు టైగర్‌ ట్రయంఫ్‌, యుద్ధ్‌ అభ్యాస్‌, మలబార్‌ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఆపరేషన్‌ మలబార్‌ పేరిట జరిగే సంయుక్త నౌకాదళ విన్యాసాలలో పాల్గొనవలసిందిగా భారత్‌ 2020లో మొదటిసారి ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. 2007 నుంచి భారత్‌, అమెరికా, జపాన్‌లు ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి మోహరించిన భారతీయ జవాన్లకు అతిశీతల వాతావరణాన్ని తట్టుకునే దుస్తులను అమెరికా అందించింది. చైనా కార్యకలాపాలపై గూఢచారి సమాచారాన్ని అందించింది. అమెరికా సరఫరా చేసిన షినూక్‌ హెలికాప్టర్లు, సీ గార్డియన్‌ డ్రోన్లు, తేలికైన హొవిట్జర్‌ ఫిరంగులను లద్దాఖ్‌ సరిహద్దులో మోహరించారు. భారత్‌ ఇటీవల దేశీయంగా తయారు చేసిన డ్రోన్లను గుర్తించే సరికొత్త సాంకేతిక వ్యవస్థను సైతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసింది. తూర్పు లద్దాఖ్‌లో అనూహ్యంగా, ఆకస్మికంగా దాడి చేయడం ద్వారా చైనా ఆరంభంలో కొంత పైచేయి సాధించినా, ఇకపై అలాంటి ఎత్తుగడలను సాగనివ్వకూడదని భారత సైన్యం కృతనిశ్చయంతో ఉంది. పరిస్థితి చేజారి పోకముందే భారత్‌, చైనాలు సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. 


జోరుగా నిర్మాణాలు

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా దండెత్తితే తక్షణం ఎదుర్కోవడానికి వీలుగా భారత్‌ రోడ్లు, వంతెనలను నిర్మించి, అదనపు బలగాలను మోహరిస్తోంది. ఎల్‌ఏసీకి అవతల చైనా సైనిక మోహరింపును పెంచుతున్నందువల్ల భారత్‌ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. ఎల్‌ఏసీ వెంబడి 73 రహదారి ప్రాజెక్టులను చేపట్టిన భారత్‌, అందులో 1,430 మైళ్ల పొడవైన రోడ్డును ఒక్క అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే నిర్మిస్తోంది. సేనలను వేగంగా తరలించడానికి వీలుగా సొరంగ మార్గాలనూ నిర్మిస్తోంది. సరిహద్దు రహదారి నిర్మాణ సంస్థ (బీఆర్‌ఓ) 2023లో లద్దాఖ్‌లో 54 రహదారులు, వంతెనల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 2021, 2022 సంవత్సరాలలో 45 ప్రాజెక్టులను నిర్మించింది. అరుణాచల్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌, లద్దాఖ్‌లలో 2,967 గ్రామాల్లో ఆధునిక వసతుల ఏర్పాటుకు వైబ్రెంట్‌ విలేజ్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహాలయం ముప్పున హిమాలయం

‣ సంరక్షణ కొరవడి సంక్షోభం

‣ స్వావలంబనలో కీలక మైలురాయి

‣ మద్దతుకు భరోసా.. రైతుకు దిలాసా!

Posted Date: 27-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం