• facebook
  • whatsapp
  • telegram

ఎవరూ లేని బరిలో విజేత



రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ (71) అయిదోసారి అఖండ మెజారిటీతో గెలుపొందారు. బలమైన విపక్షాలు, నేతలు లేని పరిస్థితుల్లో నామమాత్ర పోటీలో విజయం సాధించారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజా గెలుపుతో పుతిన్‌ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


పుతిన్‌ విజయం తరవాత వివిధ దేశాలు విభిన్న రీతిలో స్పందించాయి. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వెంటనే ఆయనకు అభినందనలు తెలిపారు. పుతిన్‌ నిర్ణయాత్మక విజయం సాధించారని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రశంసించారు. ఉత్తర కొరియా కూడా అభినందన సందేశం పంపింది. ఐరోపా సమాఖ్య (ఈయూ) మాత్రం తీవ్ర పౌర, రాజకీయ హక్కుల ఉల్లంఘనల మధ్య పుతిన్‌ ఎన్నిక జరిగిందని విమర్శించింది. రష్యాలో ప్రతిపక్షం లేదు, స్వేచ్ఛ లేదు, రష్యన్లకు పుతిన్‌ తప్ప గత్యంతరమూ లేదని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు మిషెల్‌ వెక్కిరింతగా వ్యాఖ్యానించారు. రష్యాలో పోలింగ్‌ ముగియకముందే పుతిన్‌ గెలుపును అభినందిస్తున్నానంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు. అమెరికా, బ్రిటన్‌లు కూడా రష్యా అధ్యక్ష ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని వ్యాఖ్యానించాయి. ఈ బూటకపు ఎన్నికలకు న్యాయబద్ధత లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు.


మూడు రోజులపాటు జరిగిన ఓటింగ్‌లో పుతిన్‌కు 87 శాతం ఓట్లు రాగా, ఆయనపై పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు తలా 3-4 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఈ ముగ్గురూ ప్రభుత్వానికి అనుకూలమైన పార్టీలకు చెందిన నామమాత్ర అభ్యర్థులే. వీరిలో ఒకరు కమ్యూనిస్టు నేత నికొలయ్‌ ఖరితొనోవ్‌. పుతిన్‌ను నిజంగా వ్యతిరేకించే ప్రతిపక్షాల నాయకులంతా జైళ్లలోనో, స్వయం ప్రకటిత ప్రవాసంలోనో ఉన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించే పార్టీల అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని నిషేధించారు. పుతిన్‌      బద్ధవైరి నవాల్నీ (47) సైబీరియాలోని జైలులో గత నెలలో కన్నుమూశారు. నవాల్నీ సహజ కారణాలతోనే మరణించారని రష్యా అధికారులు చెబుతున్నా, పుతిన్‌ ఆదేశాలపై హతం చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన పుతిన్‌ను నవాల్నీ మరణం గురించి ఒక అమెరికన్‌ విలేఖరి ప్రశ్నించగా, ఆయన మరణం విచారకరమని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఆధునిక రష్యాను అత్యధిక కాలం స్టాలిన్‌ పాలించగా, ఆయన తరవాత ఆ ఘనతను పుతిన్‌ అందుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగియవస్తున్నప్పుడు జర్మనీలో సోవియట్‌ గూఢచారిగా ఉన్న పుతిన్‌ దేశాధ్యక్షుడవుతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. 1999లో బోరిస్‌ యెల్త్సిన్‌ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్‌ నియమితులయ్యారు. 2000 సంవత్సర ఎన్నికల్లో అధికారికంగా దేశాధ్యక్షుడైన పుతిన్‌ రష్యా రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు మాత్రమే ఆ పదవిని నిర్వహించవలసి ఉన్నా, రాజ్యాంగాన్ని సవరించి మరో రెండుసార్లు అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం అయిదోసారి పదవీ నిర్వహణను చేపట్టారు.


తొలిసారి అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు పుతిన్‌ అమెరికా, నాటో (ఐరోపా) దేశాల పట్ల స్నేహపూర్వకంగానే వ్యవహరించారు. కానీ, జార్జియా, ఉక్రెయిన్‌లను నాటోలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలైనప్పుడు పుతిన్‌ వాటిని ప్రతిఘటించారు. 2008లో జార్జియాపైన, 2022లో ఉక్రెయిన్‌పైన దండెత్తారు. ఉక్రెయిన్‌పై దాడిని పురస్కరించుకుని రష్యాపై అమెరికా, ఐరోపా, జపాన్‌లు ఆర్థిక ఆంక్షలు విధించినా అవి పనిచేయలేదు. ఉక్రెయిన్‌కు అమెరికా, ఐరోపాలు మొదట్లో భారీగా నిధులు, ఆయుధాలు సమకూర్చినా ఇప్పుడు ఆ సహాయం తీవ్రత తగ్గింది. పైగా ఉక్రెయిన్‌ ప్రారంభించిన ఎదురుదాడి విఫలం కావడంతో రష్యా మరింత చెలరేగిపోతోంది. యుద్ధం కోసం క్షిపణులు, మందుగుండు, విమానాలు, ట్యాంకుల ఉత్పత్తి కర్మాగారాల్లో రష్యన్లకు ఉపాధి లభించి నిరుద్యోగం దాదాపు అదృశ్యమైంది. కొన్ని రంగాల్లో కార్మికుల కొరత కూడా కనబడుతోంది. జీతభత్యాలు పెరగ్గా, ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. జీవన పరిస్థితులు బాగానే ఉండటంతో ఉక్రెయిన్‌ యుద్ధానికి రష్యన్‌ ఓటర్ల మదిలో అంతగా ప్రాధాన్యం లభించలేదని చెప్పాలి. దీంతో ఈ యుద్ధంలో రష్యన్లంతా తన వెనకే ఉన్నారని ప్రకటించడానికి పుతిన్‌కు అవకాశం చిక్కింది. తాజా విజయంతో పుతిన్‌ ఉక్రెయిన్‌పై మరింత రెచ్చిపోతారని అంచనా. రష్యా సేనలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్ళే అవకాశం ఉంది. దీనితోపాటు స్వదేశంలో ప్రతిపక్షాలను తుడిచిపెట్టే కార్యక్రమమూ జోరందుకొంటుందని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి.


- ప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్రిప్టోలకు మళ్ళీ రెక్కలు

‣ గాలి నాణ్యతకు హరిత ఇంధనం

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Posted Date: 22-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం