• facebook
  • whatsapp
  • telegram

ఇజ్రాయెల్‌ అమానుష హత్యాకాండ



హమాస్‌ అంతమే అంతిమ లక్ష్యమంటూ పేట్రేగుతున్న ఇజ్రాయెల్‌ - గాజాలో దారుణ జాతిహననానికి పాల్పడుతోంది. ఒంటెత్తు పోకడలతో అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలనూ అది ఎంతమాత్రం లెక్కచేయడం లేదు.


రఫాపై దాడులను ఇజ్రాయెల్‌ తక్షణమే ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఇటీవల ఆదేశించింది. కొన్ని నెలలుగా దక్షిణ గాజా ప్రాంతంపై ఇజ్రాయెలీ దళాలు బాంబులు గుమ్మరించి ఆ ప్రాంతాన్ని శిథిలాల దిబ్బగా మార్చేశాయి. దాంతో లక్షల సంఖ్యలో పాలస్తీనీయులు ఈజిప్ట్‌-ఉత్తర గాజా సరిహద్దులోని రఫాకు తరలివెళ్ళి కాలం వెళ్ళదీస్తున్నారు. హమాస్‌ను అంతం చేయాలంటూ రఫాపైనా టెల్‌అవీవ్‌ దాడులకు దిగింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజ ఆందోళనలు, నిరసనలను అది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గాజా జాతిహననంపై దక్షిణాఫ్రికా ఐసీజేని ఆశ్రయించింది. ఐసీజే తీర్పు అమలుకావాలంటే- ఐరాస భద్రతామండలి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. జాతిహననం తీవ్ర నేరం. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించి గాజాలో ఇజ్రాయెల్‌ హత్యాకాండను తేల్చడానికి ఐసీజేకి సంవత్సరాల సమయం పడుతుంది. ఆలోగా, ఇజ్రాయెల్‌ దాష్టీకాలను నిలువరించేందుకు అది తనవంతు ప్రయత్నం చేస్తోంది.


వెల్లువెత్తిన నిరసనలు

గాజాకు మానవీయ సాయం దక్కేలా చూడాలని, తరలిపోయిన లక్షల మంది పాలస్తీనీయులకు సరిపడా ఆహారం అందుతుందో లేదో, వారి రక్షణ పరిస్థితి ఏమిటో తెలియజెప్పాలన్న ఐసీజే ఉత్తర్వులను ఇజ్రాయెల్‌ పట్టించుకోలేదు. మానవహననం ఆరోపణలపై విచారణ జరపడానికి ఎలాంటి కమిషన్లనైనా ఇజ్రాయెల్‌ అనుమతించాలని ఐసీజే సూచించింది. హమాస్‌ ఆధీనంలోని బందీల గురించీ ఆందోళన వ్యక్తం చేసింది. వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆదేశించింది. ఐసీజే ఆదేశాలను ఇజ్రాయెల్‌ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. ఐరాసను సైతం అది లెక్కచేయడం లేదు. టెల్‌అవీవ్‌ ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) తీర్పును పెడచెవిన పెట్టింది. సాక్ష్యాలను పరిశీలించి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గాజాలో మానవత్వాన్ని మంటగలుపుతున్నారని ఐసీసీ నిర్ధారణకు వచ్చింది. గాజా మొత్తాన్ని గుప్పిటపట్టాలని టెల్‌అవీవ్‌ ఉవ్విళ్లూరుతోంది. ఆది నుంచి పాలస్తీనీయులకు సమాన హక్కులు కల్పించడానికి అది నిరాకరిస్తోంది. వారిపై తీవ్ర దుర్విచక్షణ ప్రదర్శిస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా, పశ్చిమదేశాలు పూర్తి అండదండలు అందిస్తున్నాయి. టెల్‌అవీవ్‌కు భారీగా ఆయుధాలను సమకూర్చాయి.


నిరుడు అక్టోబరు ఏడున హమాస్‌ దాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకారానికి దిగింది. అప్పటి నుంచి టెల్‌అవీవ్‌ సాగిస్తున్న విధ్వంసానికి ఇప్పటిదాకా ముప్ఫై అయిదు వేల మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14వేల మంది చిన్నారులే! గాజాలో బడులు, నివాసగృహాలు, ఆస్పత్రులు... ఇలా వేటినీ వదలకుండా ఇజ్రాయెలీ సేనలు బాంబులు కురిపించాయి. పాలస్తీనీయులు ఇళ్లు ఖాళీచేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రఫాకు పారిపోయేలా చేశాయి. ఇప్పడు అక్కడా టెల్‌అవీవ్‌ విరుచుకుపడుతూ ఎందరో అమాయకుల ఉసురు తీస్తోంది. మానవహక్కుల నిపుణురాలైన ఫ్రాన్సెస్కా ఆల్బనీస్‌ ఇటీవల ఐరాసకు ఇచ్చిన నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. పాలస్తీనీయులను శారీరకంగా, మానసికంగా హింసిస్తూ, గాజాను నాశనం చేస్తూ ఇజ్రాయెల్‌ తీవ్ర జాతిహననాన్ని కొనసాగిస్తోందని ఆమె విశ్లేషించారు. టెల్‌అవీవ్‌ చర్యలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. పశ్చిమ దేశాలతో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గుడారాలు ఏర్పాటు చేసుకొని ఆందోళనలు చేపట్టారు. వియత్నాం యుద్ధం తరవాత నుంచి ఇలాంటివి అగ్రరాజ్యం ఎన్నడూ ఎరగదు. ఇజ్రాయెల్‌కు వత్తాసు పలుకుతున్న చాలామంది నాయకులు ఇప్పుడు ప్రజల మద్దతు కోల్పోతామేమోనని జంకుతున్నారు.


అన్నీ ఒక్కటై..

ఇటీవల ఐర్లాండ్, నార్వే, స్పెయిన్‌లు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్‌ అంతర్జాతీయంగా ఏకాకులు అవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ చట్టాలు, ఐరాస నిర్ణయాలను ఉల్లంఘిస్తోంది. టెల్‌అవీవ్‌పై చర్యలకు సంబంధించిన తీర్మానాలను అమెరికా వీటో చేస్తోంది. అలాంటప్పుడు ఇజ్రాయెల్‌ మారణకాండ, స్వతంత్ర పాలస్తీనా విషయంలో ప్రపంచ దేశాలు మాత్రం ఏమి చేయగలుగుతాయి! పశ్చిమాసియాలో శాంతి వెల్లివిరియాలంటే పాలస్తీనాకు మద్దతు పలికే అన్ని దేశాలు ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను ఖండించాలి. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన ఇక ఎంతమాత్రం సాగదని నినదించాలి. 1949లో ఐరాస ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది. దీన్ని రద్దుచేసే ధైర్యాన్ని ఐరాస ప్రదర్శించాలి. అప్పుడుగాని టెల్‌అవీవ్‌ దారికి రాదు.


- అనురాధా చెనాయ్‌

(నెదర్లాండ్స్‌లోని ట్రాన్స్‌నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్‌ ఫెలో)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కృత్రిమ మేధ ప్రభావమెంత?

‣ పర్యావరణానికి యుద్ధ గాయాలు

‣ రష్యా - చైనా చెట్టపట్టాల్‌.. భారత్‌పై ప్రభావమెంత?

‣ ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?

Posted Date: 01-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం