• facebook
  • whatsapp
  • telegram

వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక



అంతర్జాతీయ వాణిజ్యంలో- పెట్టుబడులు, సరకుల రవాణా, సేవలు ప్రధానంగా నిలుస్తాయి. ప్రపంచ దేశాల అభివృద్ధి, అంతర్జాతీయ వ్యాపార విస్తరణలకు ఐరాసకు చెందిన ప్రత్యేక విభాగం కృషి చేస్తోంది. దీన్ని వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస సదస్సు (అంక్టాడ్‌)గా పిలుస్తారు. అంక్టాడ్‌ ఇటీవల అరవయ్యో వార్షికోత్సవ సమావేశం జరుపుకొంది.


ఐక్యరాజ్య సమితి ఛత్రం కింద వర్ధమాన దేశాల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్న సంస్థలు రెండే రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి- వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస సదస్సు (అంక్టాడ్‌), రెండోది ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ). సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో(ఎస్‌డీజీలలో) ఇది 17వ లక్ష్యం. దీని సాధనకు అంక్టాడ్‌ పూర్తిగా అంకితమైంది. అంక్టాడ్‌కు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రధాన కార్యాలయం ఉంది. న్యూయార్క్‌ (అమెరికా), అడిస్‌ అబబ(ఇథియోపియా)లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. 1960ల నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో వర్ధమాన దేశాల వాటా పెంచడానికి అంక్టాడ్‌ కృషి చేస్తోంది.


ప్రశంసల వర్షం

ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో వాణిజ్య విధానాలు, నిబంధనలు, సంస్థలపై అంక్టాడ్‌ దృష్టి సారిస్తుంది. మరో ఐరాస అనుబంధ సంస్థ ఐటీసీ (అంతర్జాతీయ వ్యాపార కేంద్రం) చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ విపణికి అనుసంధానిస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్యంలో నిబంధనల రూపకల్పన, మధ్యవర్తిత్వ బాధ్యతలను చేపడుతుంది. డబ్ల్యూటీఓ, అంక్టాడ్‌ల మధ్య 2003 నుంచే అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఉంది. మరో 11 విభాగాల్లో సహకార విస్తృతికి 2015లో ఎంఓయూ పరిధిని విస్తరించారు. ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు రంగం, విద్యావేత్తలు, ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి అంక్టాడ్‌ పనిచేస్తోంది. నేడు ఈ సంస్థ వాణిజ్య, అభివృద్ధి బోర్డులో 116 అంతర ప్రభుత్వ సంస్థలు, 242 పౌర సమాజ సంస్థలకు పరిశీలక హోదా లభించింది. అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు తోడ్పడే సమాచారాన్ని అంక్టాడ్‌ డేటా కేంద్రం వెలువరిస్తోంది.


మొట్టమొదటి అంక్టాడ్‌ సమావేశం 1964లో జెనీవాలో జరిగింది. అప్పటి నుంచి నాలుగేళ్లకొకసారి అంక్టాడ్‌ మహా సభ నిర్వహిస్తున్నారు. ఇటీవలి అరవయ్యో వార్షికోత్సవ భేటీలో అంతర్జాతీయ వాణిజ్యానికి ఎదురైన విఘాతాలు, ప్రభుత్వాలపై కొండలా పెరిగిన రుణభారం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ఫైనాన్స్, పెట్టుబడుల గురించి చర్చించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఈ సందర్భంగా ప్రపంచ నాయకుల సమావేశాన్ని ప్రారంభించారు. అంక్టాడ్‌ ప్రధాన కార్యదర్శి రెబెకా గ్రిన్‌స్పాన్, పలు దేశాల అధినేతలు, 28 దేశాల వాణిజ్య, విదేశాంగ మంత్రులు, 152 దేశాల నుంచి ఆర్థికవేత్తలు, మేధావులు, ప్రైవేటు రంగ ప్రముఖులు, అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు పాల్గొన్నారు. ‘మారుతున్న ప్రపంచం కోసం కొత్త అభివృద్ధి నమూనా’ అనే అంశంపై చర్చించారు.      వాతావరణ మార్పులు, పెరిగిన రుణభారం, వ్యాపారాలకు ఎదురవుతున్న ఆటంకాలు నేటి ప్రపంచానికి ప్రధాన సమస్యలుగా మారాయి. వర్ధమాన దేశాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పేద దేశాల మధ్య సహకార వృద్ధికి, వర్ధమాన-సంపన్న దేశాల నడుమ సంప్రతింపుల విస్తరణకు అంక్టాడ్‌ చేస్తున్న కృషిని సమావేశంలో పాల్గొన్న ప్రపంచ నాయకులు ప్రశంసించారు. రాబోయే అయిదేళ్లలో ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అంక్టాడ్‌ పాటుపడుతోంది. దానికి మద్దతుగా చైనా రెండు కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. అంక్టాడ్‌ అరవయ్యో వార్షికోత్సవ సభను ఉద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వీడియో ద్వారా ప్రసంగించారు. సాటి బ్రిక్స్‌ దేశమైన బ్రెజిల్‌ సైతం అంక్టాడ్‌ కృషికి తన మద్దతు తెలిపింది. అనేక చిన్న దేశాల ప్రతినిధులు జెనీవా అంక్టాడ్‌ సభలో పాల్గొన్నారు. భారత్‌ మాత్రం మంత్రిని లేదా ఉన్నతాధికారినైనా పంపకపోవడం విచిత్రం. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు అంతర్జాతీయ వాణిజ్యంలో వర్ధమాన దేశాలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అంక్టాడ్‌ చేయూతనివ్వడాన్ని ప్రశంసించారు. హరిత పారిశ్రామిక విధానాల రూపకల్పన, అమలుకు ఈ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహానికి, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలోని సవాళ్ల పరిష్కారానికి, అంతర్జాతీయ సరఫరా గొలుసుల విచ్ఛిన్నం వల్ల ఎదురవుతున్న సమస్యలను వర్ధమాన దేశాలు అధిగమించడానికి అంక్టాడ్‌ సహకరిస్తోందని తెలియజెప్పారు. వర్ధమాన దేశాల ప్రజలను ఆర్థిక అభద్రత, పర్యావరణ సంక్షోభం చుట్టుముట్టాయని అంక్టాడ్‌ ప్రధాన కార్యదర్శి రెబెకా గ్రిన్‌స్పాన్‌ ప్రస్తావించారు. బహుళపక్ష వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.


అంతర్జాతీయ సంస్కరణలు అవసరం

అంక్టాడ్‌ సభ ముగింపు సమావేశంలో విఖ్యాత ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. అన్ని దేశాలకూ ఒకే అభివృద్ధి నమూనా పనికిరాదని, అంతర్జాతీయ ఆర్థికానికి పటిష్ఠమైన సంస్థాగత ఏర్పాట్లు ఉండాలని వారు సూచించారు. అలాంటి ఏర్పాట్లు లేనందువల్లనే ప్రస్తుత రుణ సంక్షోభాన్ని పేద దేశాలు అధిగమించలేకపోతున్నాయని విశ్లేషించారు. మారుతున్న కాలానికి తగినట్లుగా అంతర్జాతీయ సంస్కరణలు చేపట్టాలని సూచించారు. రుణ సంక్షోభాన్ని అధిగమించి ప్రపంచానికి సుస్థిర ఆర్థిక భవిష్యత్తును అందించడం తక్షణావసరం. ప్రపంచ దేశాలు దీన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని అంక్టాడ్‌ సభలో ఆర్థికవేత్తలు సూచించారు. ఐక్యరాజ్య సమితి త్వరలోనే భావి ప్రపంచ తీరుతెన్నులపై నిర్వహించే శిఖరాగ్ర సభలో అంక్టాడ్‌ సైతం పాల్గొంటుంది. అందులో వర్ధమాన దేశాల సమస్యలను ప్రస్తావించి, ఆచరణీయ ప్రణాళికను ప్రతిపాదించి ఆమోదం పొందుతుందని ఆశిద్దాం.


ఏఐపై దృష్టి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, హమాస్‌-ఇజ్రాయెల్‌ పోరు వల్ల ఇంధనం, ఆహార ధాన్యాల సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై పేద దేశాలు తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ పేద, ధనిక దేశాల మధ్య కొత్త అసమానతలను సృష్టిస్తోంది. ఈ సమస్యలపై అంక్టాడ్‌ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్ధమాన దేశాలకు తగ్గిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపిచ్చారు. పర్యావరణ హితకరమైన, హరిత, సుస్థిర పారిశ్రామిక విధానాలను అనుసరించాలని సూచించారు. కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో వర్ధమాన దేశాలకూ భాగస్వామ్యం కల్పించాలని ప్రతిపాదించారు. వర్ధమాన దేశాల పరిస్థితులకు అనుగుణమైన ఏఐ అనువర్తనాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఏఐపై అంతర్జాతీయ నియమ నిబంధనల చట్రాన్ని రూపొందించాలని పిలుపిచ్చారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎగుమతుల కలిమి... సేద్యానికి బలిమి!

‣ వేడెక్కుతున్న భూగర్భ జలాలు

‣ భారత్‌ - బంగ్లా చెట్టపట్టాల్‌

‣ ప్రాభవం కోల్పోతున్న జీ7

Posted Date: 28-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం