• facebook
  • whatsapp
  • telegram

అణ్వాయుధ నిరోధంపై ఐక్యగళం

ఆశలు రేపుతున్న పి-5 దేశాల తీర్మానం

 

 

చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా దేశాల సంబంధాలు క్షీణిస్తూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నవేళ... అంతర్జాతీయ సమాజం స్వాగతించదగిన ఓ కీలక పరిణామం ఇటీవల చోటుచేసుకుంది. అణుయుద్ధాలు ఎప్పటికీ జరగకుండా నివారించాలని, మున్ముందు అణ్వాయుధ వ్యాప్తిని నిలువరించాలని అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ (పి-5 దేశాలు) ముక్తకంఠంతో తీర్మానించాయి. అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం తలెత్తకుండా చూడటం, మానవాళి భద్రతకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం తమ ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నామని ఆ దేశాలు ఉద్ఘాటించాయి. ఆ ఆయుధాలు మనుగడలో ఉన్నంతకాలం ఆత్మరక్షణకు, ప్రత్యర్థుల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి, యుద్ధాలను నివారించడానికి మాత్రమే వాటిని వినియోగించాలని ఆకాంక్షించాయి. పి-5 దేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ప్రోది చేయడంలో ముందడుగుగా ఈ తీర్మానం పనిచేసే అవకాశముంది.

 

డ్రాగన్‌ వడివడిగా...

ఉక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా ఉవ్విళ్లూరుతున్నట్లు కొన్నాళ్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిని బలపరచేలా ఆ దేశ సరిహద్దుల్లో పుతిన్‌ సర్కారు తమ బలగాలను భారీగా పెంచుతోంది. ఫలితంగా పలు ఐరోపా దేశాలతో రష్యా సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఉపక్రమిస్తే ఆంక్షలు విధిస్తామంటూ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల హెచ్చరించారు. ఐరోపాలో తమ బలగాల మోహరింపును పెంచుతామనీ స్పష్టం చేశారు. ప్రచ్ఛన్నయుద్ధం తరవాత మళ్ళీ దాదాపు ఆ స్థాయికి అమెరికా-రష్యా సంబంధాలు ఇప్పుడు క్షీణించినట్లు కనిపిస్తున్నాయి. చైనాతోనూ అమెరికాకు బొత్తిగా పొసగడం లేదు. తైవాన్‌పై సైనిక బలప్రయోగానికి డ్రాగన్‌ కుట్రలు పన్నుతోంది. బైడెన్‌ సర్కారు సహా పలు ఐరోపా దేశాలు దీనిపై గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి ఘర్షణాత్మక వాతావరణంలో అంతర్జాతీయ భద్రతపై పి-5 దేశాలు ఐక్యతా రాగాన్ని ఆలపించడం ఆశ్చర్యకరమే. 2022కు ఇది నిస్సందేహంగా సానుకూల ఆరంభమే. ప్రస్తుతం పి-5 దేశాలతోపాటు ఇజ్రాయెల్‌, ఇండియా, పాకిస్థాన్‌, ఉత్తర కొరియాల వద్ద అణ్వాయుధాలున్నాయి. వాటి సంఖ్యను పెంచకూడదని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) స్పష్టం చేస్తోంది. అది కార్యరూపం దాల్చడంలేదు. పైకి నీతి వచనాలు పలుకుతున్న చైనా, గుట్టుగా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకొంటోంది. డ్రాగన్‌ వద్ద ప్రస్తుతం దాదాపు 350 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. వాటి సంఖ్యను 2027 నాటికి 700కు, 2030 నాటికి ఏకంగా వెయ్యికి చేర్చేలా జిన్‌పింగ్‌ సర్కారు ముందుకు సాగుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ఇటీవల ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా ఏటికేడు అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. భారత్‌, పాక్‌ సైతం పోటాపోటీగా అణ్వస్త్రాలను తయారు చేసుకొంటున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంనుంచి ట్రంప్‌ హయాములో అమెరికా బయటికి రావడం మరో ఆందోళనకర అంశం. ప్రధానంగా పశ్చిమాసియా దేశాల్లో అణ్వాయుధాల వ్యాప్తికి అది కారణమయ్యే ముప్పుంది. ప్రస్తుతం అమెరికా వద్ద 5,600, రష్యా అమ్ములపొదిలో దాదాపు 6,250, బ్రిటన్‌ వద్ద 225 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. నిజానికి 1986 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 వేల అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య 14 వేలకు తగ్గింది. సంఖ్య తగ్గడం స్వాగతించదగిన పరిణామమే అయినా- అణ్వస్త్ర సామర్థ్యాల ఆధునికీకరణ పేరుతో అమెరికా, బ్రిటన్‌, రష్యా భారీగా నిధులు వెచ్చిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అణ్వాయుధాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు 2040 కల్లా ఏకంగా లక్ష కోట్ల డాలర్లను వ్యయం చేయాలని బ్రిటన్‌ ప్రణాళికలు రచించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

 

పరిత్యజిస్తేనే ప్రపంచ శాంతి

అణ్వస్త్రాలతో జరిగే యుద్ధంలో విజేతలెవరూ ఉండబోరని పి-5 దేశాలు తమ తాజా తీర్మానంలో ఉద్ఘాటించాయి. అది అక్షరసత్యం. అణ్వాయుధాలు మహా విధ్వంసానికి కారణమవుతాయి. వాటివల్ల  నగరాలకు నగరాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై 1945లో జరిగిన దాడులు అణ్వస్త్రాల బీభత్సాన్ని మానవాళి కళ్ళకు కట్టాయి. హిరోషిమాపై జరిగిన దాడిలో దాదాపు 80 వేలమంది, నాగసాకిపై దాడిలో 70 వేలమందికి పైగా దుర్మరణం పాలయ్యారు. అణ్వస్త్రాల ప్రభావం పేలుళ్లతో ముగిసిపోదు. వాటి నుంచి అధిక స్థాయిలో వెలువడే రేడియేషన్‌ దీర్ఘకాలంపాటు దుష్ప్రభావాలకు కారణమవుతుంది. కాబట్టి, ఈ ఆయుధాలను ప్రపంచ దేశాలు సాధ్యమైనంత త్వరగా త్యజించాలి. అణ్వస్త్రాల మనుగడతో మానవాళికి నిరంతరం ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి అణ్వాయుధ దేశాలు తమ అస్త్రాలను నిర్వీర్యం చేసి ప్రపంచ శాంతికి బాటలు పరవాలి. పర్యావరణంలో ప్రతికూల మార్పులు, ఉగ్రవాదం, సైబర్‌ దాడులే ప్రస్తుత ప్రపంచానికి అసలైన సవాళ్లు. వాటిని ఎదుర్కోవడానికి అణ్వస్త్రాల అవసరం లేదన్న సంగతిని గుర్తించాలి. అణ్వాయుధాల ఆధునికీకరణపై చేసే వ్యయాన్ని విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు మళ్ళించి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి.

 

- నవీన్‌ కుమార్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఊపందుకొంటున్న ఉపగ్రహ అంతర్జాలం

‣ ఆశలపల్లకిలో కొత్త ఏడాదిలోకి...

‣ బహుళ ప్రయోజనాల మైత్రీబంధం

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

Posted Date: 08-01-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం